అమ్మవారి విగ్రహానికి సల్వార్ కమీజ్ అలంకరణ
సాక్షి, నాగపట్టణం: అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌తో అలంకరించిన ఇద్దరు అర్చకులపై వేటు పడింది. తమిళనాడు నాగపట్టణం జిల్లా మయిలాదుతుదైలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మయూర్‌నాథర్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు
ఆలయంలోని అభయాంబిగై అమ్మవారిని ప్రతి శుక్రవారం వివిధ రంగుల కాగితాలతో అలంకరిస్తుంటారు. సంప్రదాయానికి భిన్నంగా రాజ్ అనే పురోహితుడు అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు తొడిగారు. పింక్ రంగు సల్వార్ కమీజ్, నీలం రంగు దుపటాతో అమ్మవారిని అలంకరించారు. సీనియర్ అర్చకుడు కళ్యాణమ్ కుమారుడైన రాజ్‌ను తండ్రికి సహాయంగా ఉంటాడనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టులో ఆలయంలో నియమించారు.
తండ్రీకొడుకులపై వేటు
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆగమ నియమాలకు విరుద్ధంగా అమ్మవారికి అపచారం జరగడంతో భక్తులు, సీనియర్ అర్చకులు మండిపడ్డారు. దీంతో స్పందించిన దేవస్థానం పాలక మండలి ఇద్దరు అర్చకులను విధుల నుంచి తొలగించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో వీరిద్దరిపై చర్య తీసుకోవాల్సివచ్చిందని పాలక మండలి ప్రతినిధి ఎస్. గణేశన్ తెలిపారు. తాను ఎటువంటి దురుద్దేశంతోనూ ఈ తప్పు చేయలేదని అర్చకుడు రాజ్ చెప్పారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
నంది విగ్రహానికి నోట్లతో అలంకరణ
ప్రచారం కోసం గతంలోనూ రాజ్ ఇటువంటి పనులు చేశాడని మయిలాదుతుదై ఫొటోజర్నలిస్ట్ ఒకరు చెప్పారు. నంది విగ్రహాన్ని రూ. 15 వేల విలువ చేసే వంద రూపాయల నోట్లతో అలకరించించాడని, అప్పుడు అతడిని అందరూ మెచ్చుకున్నారని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడని తెలిపారు. కాగా, అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌లో అలంకరించిన ఫొటోలను రాజ్ తన స్నేహితులకు పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment