కచ్చదీవులు మనవే!
కచ్చదీవులు మనవే!
Published Fri, Mar 7 2014 1:27 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు గా ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నాగపట్నంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కె గోపాల్‌కు మద్దతుగా ఓట్లను సేకరించారు. జాలర్లు, ముస్లిం ఓటర్లు, డెల్టా అన్నదాతల్ని ఆకర్షించే రీతిలో అవరిత్తిడల్‌లో జరిగిన ప్రచార సభలో జయలలిత ప్రసంగించారు. కచ్చదీవులు మనవే: కచ్చదీవులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ధారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళుల భూ భాగాన్ని ధారాదత్తం చేయడానికి వారెవరని ప్రశ్నించారు. కేంద్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తొలి సంతకం కచ్చదీవుల స్వాధీనానికి సంబంధించి ఉంటుందని స్పష్టం చేశారు. ‘మన దీవుల్ని మనం స్వాధీనం చేసుకుని చేపలను వేటాడుకుందాం’ అని సూచించారు. లోక్‌సభ ఎన్నికలు కేంద్రంలో అధికార మార్పునకు మాత్రమే వేదిక కాదని, పక్కదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఆయుధమని వివరించారు.
సముద్ర తీరాల్లో భద్రతను పెంచామని, సముద్రం కోతలకు గురి కాకుండా, సముద్ర తీరవాసులకు భద్రత కల్పించే రీతిలో నిధులను వెచ్చించినట్లు గుర్తు చేశారు. జాలర్ల సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తోన్న అన్నాడీఎంకే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మిథైన్‌ను అడ్డుకుందాం: డెల్టా అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచిన డీఎంకే, కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైందన్నారు. కావేరి నదీ జలాల వ్యవహారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి అన్నదాతలను అప్పుల పాలు చేసింది ఆ రెండు పార్టీలు కాదా..? అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చాక ఓ వైపు కావేరి జలాల కోసం ప్రతి ఏటా పోరాడుతూ, మరో వైపు అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునే రీతిలో నిధులు వెచ్చిస్తూ వచ్చామని వివరించారు. కావేరి వ్యవహారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన డీఎంకే, కాంగ్రెస్‌లు, అన్నదాతల జీవనాధారంపై దెబ్బ తీయడం లక్ష్యంగా మిథైన్ వాయువు తవ్వకాలకు అనుమతి ఇచినట్లు గుర్తు చేశారు. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం తనకు కల్పిస్తే మిథైన్ తవ్వకాల అనుమతిని రద్దు చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిథైన్‌ను అడ్డుకుని తీరుతానని డెల్టా అన్నదాతలకు భరోసా ఇచ్చారు. అన్నదాతలతో, పంటలతో చెలాగాటం ఆడే రీతిలో జన్యుమార్పిడి పద్ధతికి కేంద్రం విదేశీ సంస్థలతో కలసి పరిశోధనలకు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్నదాతలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు, ఒప్పందాలను జాతీయ స్థాయిలో రద్దు చేసి తీరుతానని ప్రకటించారు.
రిజర్వేషన్లు: ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం తన ప్రభుత్వం శ్రమిస్తూ వస్తున్నదని జయలలిత వివరించారు. రాష్ట్రం నుంచి ఏటా హజ్ వెళ్లే యాత్రికుల సంఖ్యను పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. క్రైస్తవులు జెరూసలేంకు వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మైనారిటీలకు రాష్ట్రంలో 3.5 శాతం రిజర్వేషన్ అమల్లో ఉందని, దీనిని పెంచాలన్న డిమాండ్ పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగపట్నానికి చేరుకున్న జయలలితకు అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టారుు. సాయంత్రం మైలాడుతురైలో జరిగిన బహిరంగ సభలో జయలలిత ప్రసంగించారు. సెంబనర్ కోయిల్ యూనియన్ పరిధిలోని కాళహస్తికాపురంలో జరిగిన సభలో తమ అభ్యర్థి ఆర్‌కే భారతీ మోహన్ మద్దతుగా ప్రచారం చేశారు.
Advertisement
Advertisement