ఈ అమ్మకు అన్నీ తెలుసు
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో భాగంగా కడలూరు జిల్లా విరుదాచలంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. కడలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల రేసులో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులను ఓటర్లకు జయలలిత పరిచయం చేశారు. ఐదేళ్ల తన ప్రభుత్వ హయాంలో అందించిన సుపరిపాలనను గుర్తుచేస్తూ, అమలు చేసిన పథకాలను వివరించారు. చెప్పింది చేస్తా.., చేసేదే చెబుతా అన్నది తన సిద్ధం అని, అలాగే, చెప్పనవి కూడా చేసి చూపించానని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం తన అభిమతంగా పేర్కొన్నారు. తనకు కుటుంబం ఈ ప్రజలేనని, మీ కోసం నేను...నా కోసం మీరు అంటూ, మళ్లీ అవకాశం ఇస్తే, రాష్ట్రం సుభిక్షవంతంగా మారుతుందని ప్రకటించారు.
ప్రజల అవసరాలు ఏమిటో, సమస్యలు ఏమిటో, వారికి ఏమి కావాలో, ఏమి చేయాలో, అన్న అన్ని విషయాలు ఈ తల్లికి తెలుసునని, మళ్లీ ఈ తల్లిని ఆదరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాదు, ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడం, కుటుంబం అంతా ఆనందోత్సాహాలతో జీవించేందుకు తగ్గ కార్యచరణ , సరికొత్త పథకాలు అమలు చేసి తీరుతానని , ఇందుకు ప్రజలందరూ తనకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. డిఎంకేకు పతనం ఖాయం అని, ఈ విషయం స్వయంగా కరుణానిధికి కూడా తెలుసునని, అందుకే కళ్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తానేదో కేంద్ర మంత్రులకు అనుమతి ఇవ్వడం లేదని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన సమాధానం తన సమాధానంగా వివరించారు. ఉదయ్ పథకంతో తమిళనాడుకు ఒరిగేది శూన్యమేని వ్యాఖ్యానించారు. తనతో ఎన్ని సార్లు భేటీ అయ్యారో, అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చర్చించారో, తనను సంప్రదించే విషయంలో ఏ ఇబ్బందులు లేవంటూ స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించి ఉండటం బట్టి తానేమిటో అన్నది అర్థం చేసుకోవాలని సూచించారు. మళ్లీ అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనకు అండగా నిలబడే విధంగా అన్నాడీఎంకే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.