UDAY Scheme
-
ఉదయ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం
- 12.42 లక్షలకు గాను 3.6 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసిన తెలంగాణ - పురోగతిని వెల్లడించిన కేంద్ర విద్యుత్ శాఖ సాక్షి, హైదరాబాద్: ఉజ్వల్ డిస్కం అష్యురెన్స్ యోజన (ఉదయ్) పథకం సంస్కరణల అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, సంస్కరణల అమలులో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరిలు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. వీటి తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ఎల్ఈడీ దీపాల పంపిణీ, గ్రామీణ విద్యుత్ ఫీడర్ల ఆడిట్, ఫీడర్ల విభజన, విద్యుత్ సదుపాయం లేని గ్రామాల విద్యుదీకరణ, పట్టణ, గ్రామీణ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల మీటరింగ్ తదితర సంస్కరణల అమల్లో సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకులను కేటాయించింది. తీవ్ర ఆర్థిక నష్టాలు, అప్పులతో ఉన్న రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉదయ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద చేరిన రాష్ట్రాలు డిస్కంల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి, నష్టాలు తగ్గించుకోవడానికి కేంద్రం 14 సంస్కరణలను నిర్దేశించింది. అందులోని కొన్ని ముఖ్యమైన సంస్కరణల అమలులో రాష్ట్రం సాధించిన పురోగతి ఇలా ఉంది. ► రాష్ట్రంలో 12.42 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఉదయ్ పథకంలో చేరక ముందు 2.4లక్షలు, ఆ తర్వాత మరో 1.27 లక్షల బల్బులు పంపిణీ చేశారు. ► 5,906 గ్రామీణ ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరాపై ఆడిటింగ్ నిర్వహించాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరిన తర్వాత 60 ఫీడర్లలో ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ► 4,101 ఫీడర్లను వ్యవసాయ, వ్యవసాయేతర ఫీడర్లుగా విభజన చేపట్టాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరక ముందు 57 ఫీడర్లు, చేరిన తర్వాత 4 ఫీడర్లను విభజించారు. ► రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని 6.05 లక్షల గృహాలకు విద్యుత్ సౌకర్యం కలిగించాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరిన తర్వాత వాటిలోని 46 వేల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు జారీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 96 శాతం పురోగతి సాధించారు. ► 52,682 పట్టణ ప్రాంత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు అమర్చాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరినతర్వాత 1,863 ట్రాన్స్ఫార్మర్లకు అమర్చారు. 1,91,648 గ్రామీణ ట్రాన్స్ఫార్మర్లకు గాను ఉదయ్‌లో చేరాక 7,050 ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించారు. ► డిస్కంల వార్షిక నష్టాలు(ఏటీ అండ్ సీ లాసెస్) 14.2% వరకు ఉన్నాయి. నష్టాల తగ్గింపులో ఆశించిన పురోగతి లేకపోవడంతో 15 పాయింట్లు మాత్రమే లభించాయి. ► డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం రూ.11,244 కోట్ల బాండ్లు జారీ చేయాల్సి ఉండగా, రూ.8,923 కోట్ల బాండ్లను జారీ చేయడంతో 80 పాయింట్లు లభించాయి. ► గ్రామీణ, పట్టణ ఫీడర్ల మీటరింగ్‌లో రాష్ట్రం 100 శాతం లక్ష్యాలు సాధించింది. ► పట్టణ ట్రాన్స్ఫార్మర్ల మీటరింగ్‌లో 53 శాతం, గ్రామీణ ట్రాన్స్ఫార్మర్ల మీటరింగ్‌లో 16 శాతం పురోగతి సాధించింది. ► స్మార్ట్ మీటరింగ్‌లో ఎలాంటి పురోగతి లేకపోగా, ఫీడర్ల విభజన, గ్రామీణ ఫీడర్ల ఆడిటింగ్ అంశాల్లో 1 శాతం మాత్రమే పురోగతి సాధించింది. -
'హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు రావు'
నెల్లూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని ప్రజలకు చెప్పేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరులో సీఎం చంద్రబాబు శుక్రవారం మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు రావన్నారు. హోదాపై కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కొడవలూరు మండలం రాచర్లపాడులో గమేసా పవన విద్యుత్ తయారీ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని.. ఉదయ్ పథకం కింద రూ.8256 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అమరావతిలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల ఏ ఉపయోగం ఉండదన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి అభివృద్ధికి సాధ్యమన్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తోంది. పార్లమెంట్ లో శుక్రవారం వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. -
ఇది చరిత్రాత్మక ముందడుగు
• ‘ఉదయ్’లో రాష్ట్రం చేరికపై ముఖ్యమంత్రి కేసీఆర్ • డిస్కంలు రుణభారం నుంచి విముక్తి అవుతాయి • వాటి అప్పుల్లో 75 శాతం ప్రభుత్వమే భరిస్తుంది • తెలంగాణను మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం • బషీర్‌బాగ్ దుర్ఘటన చరిత్రలో మాయని మచ్చ అని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో మరింత ప్రగతి సాధనకు, డిస్కంలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోవడం చరిత్రాత్మక ముందడుగని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. గత పాలకుల లోపభూయిష్ట విధానాల ఫలితంగా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, వాటికి రుణ విముక్తి కలిగించేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని వెల్లడించారు. ‘‘రెండు డిస్కమ్‌లు రూ.11,897 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇందులో ఎస్పీడీఎసీఎల్కు రూ.7,392 కోట్లు అప్పుంటే, ఎన్పీడీసీఎల్కు రూ.4,505 కోట్ల అప్పుంది. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఈ అప్పుల్లో 75 శాతం అంటే రూ.8,923 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.2,974 కోట్లు ప్రభుత్వ గ్యారంటీతో బాండ్స్ ఇచ్చే వెసులుబాటు డిస్కంలకు లభిస్తుంది. దీంతో డిస్కంలకు రుణభారం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చడం వల్ల డిస్కంలు ప్రతి ఏటా రూ.890 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిస్కంలు తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు రూ.4,584 కోట్లు అందిస్తోంది’’ అని సీఎం వివరించారు. మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 5,863 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా.. 2,700 మెగావాట్ల కొరత ఉండేదని, ఈ రెండున్నరేళ్లలో అదనంగా 5,039 మెగా వాట్లు అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,902 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉందని, ఇందులో జల విద్యుత్, సోలార్, పవన విద్యుత్ ద్వారా వచ్చేది 3,531 మెగావాట్లుగా ఉందని చెప్పారు. అయితే ఈ మూడు మార్గాల ద్వారా వచ్చే విద్యుత్ అంతగా ఆధారపడేది కాదని, అందుకే 10,902 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా స్థిరంగా అందుబాటులో ఉండేది 7,371 మెగావాట్లు మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల కరెంట్, వ్యవసాయానికి 9 గంటల త్రీఫేజ్ కరెంట్ అందిస్తున్నామన్నారు. దీంతో రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వచ్చే కాలం వచ్చిం దన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను మిగులు విద్యు త్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తా మని చెప్పారు. భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం పవర్ప్లాంట్ల ద్వారా 5,880 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నా మన్నారు. వీటికి తోడు రామగుండం ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, జైపూర్ సింగరేణి ద్వారా 800 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ ద్వారా వెయ్యి మెగావాట్లు, సీజీఎస్ ద్వారా 595 మెగావాట్లు, సోలార్ ద్వారా 3,290 మెగావాట్లు, పులిచింతల ద్వారా 27,187 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం రాష్ట్రానికి ఉంటుందన్నారు. బషీర్‌బాగ్ కాల్పులు మాయని మచ్చ సమైక్య రాష్ట్రంలో జరిగిన బషీర్‌బాగ్ కాల్పుల ఘటనను సీఎం ప్రస్తావించారు. ‘‘సమైక్య రాష్ట్రంలో సరైన అంచనా, ప్రణాళిక లేకుండా విద్యుత్ విధానం కొనసాగింది. దీంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. కరెంట్ చార్జీలు తగ్గించి, మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని రోడ్డెక్కిన రైతులపై సమైక్య పాలకులు కాల్పులు జరిపారు. ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయిన బషీర్‌బాగ్ దుర్ఘటన సమైక్య రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ. ఈ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ప్రజా ఉద్యమం విజ యం సాధించి తెలంగాణ ఏర్పడింది’’ అని పేర్కొన్నారు. గత పరిస్థితులు రాకుండా తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పని చేస్తామని, ప్రజల జీవి తాల్లో విద్యుత్ కాంతులు నింపుతామన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 20 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీక రించా లని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే 1,175 మందిని రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. -
‘ఉదయ్’లోకి తెలంగాణ
► రాష్ట్రానికి రూ.6,116 కోట్ల లాభం: పీయూష్ గోయల్ ► డిస్కంల అప్పుల్లో 75 శాతం భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపరచడం సహా విద్యుదుత్పత్తి ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా రూపొందించిన ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకంలో తెలంగాణ చేరింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉదయ్ వెబ్ పోర్టల్, యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ, అసోం రాష్ట్రాల ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఉదయ్‌లో చేరడంతో తెలంగాణకు రూ.6,116 కోట్ల లాభం చేకూరుతుందని తెలిపారు. ట్రాన్స్మిషన్ నష్టాన్ని 9.95 శాతానికి తగ్గించుకుంటే రూ.1,476 కోట్ల రెవెన్యూ అదనంగా డిస్కంలకు వస్తుందన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర, రాష్ట్ర స్థాయి నుంచి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపరుచుకునేందుకు ఉదయ్ దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ పథకంలో చేరడంతో తెలంగాణలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉన్న అప్పుల్లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాకు బదిలీ అవుతాయి. రెండు డిస్కంలు ఇప్పటి వరకు రూ.11,897 కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,923 కోట్లు భరించనుంది. దీంతో పంపిణీ సంస్థలకు రూ.387 కోట్ల వడ్డీ తగ్గుతుందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పేర్కొన్నారు. మిగిలిన రుణానికి పంపిణీ సంస్థలు బాండ్ రూపంలో హామీ ఇస్తాయని ఆయన వివరించారు. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఒప్పందాలు చేసుకున్నట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రానికి 75 శాతం నిధులు గ్రాంట్ రూపంలో రావడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు పేర్కొన్నారు. -
డిస్కంలకు నవోదయం
- ‘ఉదయ్’లో చేరికకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ - త్వరలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం - డిస్కంల రూ. 9 వేల కోట్ల అప్పులు టేకోవర్ చేసుకోనున్న రాష్ట్ర సర్కారు - తక్షణమే రూ. 500 కోట్ల ఉపశమనం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల భారం నుంచి బయటపడనున్నాయి. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన(ఉదయ్) పథకంలో రాష్ట్రం చేరబోతోంది. ఉదయ్‌లో చేరిక ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ఆమోదముద్ర వేశారు. ఈ పథకంలో చేరుతున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగైదు రోజుల్లో ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఇందుకు ఢిల్లీ నుంచి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని రెండు డిస్కంలు (దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ–టీఎస్ఎస్పీడీసీఎల్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ–టీఎస్ఎన్పీడీసీఎల్) ఒకేసారి రూ.9 వేల కోట్ల అప్పుల భారం నుంచి విముక్తి పొందనున్నాయి. ఏపీతో సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఇప్పటికే ఉదయ్ పథకంలో చేరాయి. 75 శాతం అప్పులు ప్రభుత్వ ఖాతాలోకే.. ఉదయ్ పథకం మార్గదర్శకాల ప్రకారం.. 2015 సెప్టెంబర్ 30 నాటికి డిస్కంల 75 శాతం అప్పులను రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చిలోగా స్వాధీనం చేసుకోవాలి. 2015 సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణ డిస్కంల అప్పులు మొత్తం రూ.12 వేల కోట్లకు చేరాయి. ఉదయ్‌లో చేరిన తర్వాత ఈ అప్పుల్లో 75 శాతం.. అంటే రూ.9 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోనుంది. పథకంలో చేరిన వెంటనే రాష్ట్ర డిస్కంలకు రూ.500 కోట్ల తక్షణ ఉపశమనం లభిస్తుందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రా>వు తెలిపారు. బ్యాంకులకు బాండ్లు డిస్కంల నుంచి టేకోవర్ చేసుకోనున్న రూ.9 వేల కోట్ల అప్పులకు గ్యారెంటీగా 20 ఏళ్ల కాలపరిమితి గల బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు జారీ చేయనుంది. ఈ అప్పులను 7.5 నుంచి 8 శాతం వడ్డీతో తిరిగి చెల్లించనుంది. అయితే ఒకేసారి రూ.9 వేల కోట్ల అప్పులు ప్రభుత్వ ఖాతాలో చేరితే రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గిపోనుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. పాలన అవసరాల కోసం ఏటా తీసుకునే రుణాలను తగ్గించుకోవాల్సి రానుంది. -
‘ఉదయ్’.. ఖజానాకు భారం!
- వచ్చే ఏడాది ఎఫ్ఆర్బీఎంకు గండి - పునరాలోచనలో పడ్డ తెలంగాణ ప్రభుత్వం.. ఒప్పందంపై సంతకం చేసేందుకు మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఆ పథకం ఒప్పందంపై సంతకాలు చేయాల్సిన చివరిదశలో వెనుకడుగు వేసింది. అసలు అందులో చేరాలా.. వద్దా.. అని మల్లగుల్లాలు పడుతోంది. ఉదయ్‌లో చేరితే రాష్ట్ర ఖజానాపై అప్పులభారం పెరిగి, వడ్డీలు మోత మోగే ప్రమాదముంది. ఉదయ్ పథకం లక్ష్యాల్లో భాగంగా విద్యుత్ పంపిణీ సంస్థలకు(డిస్కంలు) ఉన్న అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాలో జమ చేసుకోవాలి. అంతమేరకు బాండ్లు జారీ చేసి డిస్కంలను అప్పులబారి నుంచి విముక్తులను చేయాలి. రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా అప్పులున్నాయి. ఉదయ్ పథకంలో చేరితే డిస్కంల అప్పుల్లో 75 శాతం దాదాపు రూ.8000 కోట్ల రుణభారం రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలి. ఈ ఏడాది మార్చిలోపు అంతమేరకు బాండ్లు విక్రయించి డబ్బులు సమకూర్చాలి. డిస్కంల నుంచి టేకోవర్ చేసిన రుణం ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితికి ఢోకాలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ, విద్యుత్ కంపెనీలు ఉదయ్‌లో చేరేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్‌కు వచ్చి మంతనాలు జరపడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయ్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తపరిచారు. దీంతో ఒప్పందపత్రాలు సిద్ధమయ్యాయి. ఫైలుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేయటమే మిగిలింది. ఈ తరుణంలో భవిష్యత్తు పరిణామాలపై ఆర్థికశాఖ లేవనెత్తిన సందేహాలతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. బాండ్ల వేలానికి వెనుకడుగు డిస్కంల అప్పులకు సరిపడే రూ.8000 కోట్ల బాండ్లను వేలం వేసేందుకు ఆర్థికశాఖ ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆర్బీఐ ప్రతినెలలో రెండు రోజులు మాత్రమే బాండ్లను వేలం వేస్తుంది. రాబోయే మూడు నెలల్లో ఎంత విలువైన బాండ్లను మార్కెట్లో విక్రయించనుందో ముందే ఆర్బీఐకి తెలియజేయాలి. కానీ రాబోయే మూడు నెలల్లో డిస్కంలకు సరిపడేంత బాండ్ల విక్రయానికి ఆర్థికశాఖ మొగ్గు చూపకపోవటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. డిస్కంల రుణభారం ప్రభుత్వం స్వీకరిస్తే ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఖజానాపై పడే ప్రభావమేమీ లేదు. కానీ, రూ.8000 కోట్ల అప్పుకు ఏటా వడ్డీ చెల్లింపులు తడిసి మోపెడవుతాయి. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీల చెల్లింపు కనీసం రూ.800 కోట్లు పెరిగిపోతాయి. దీంతో రెవెన్యూ ఆదాయంలో వడ్డీ పది శాతం దాటిపోతుంది. దీంతో పెరిగిన ఎఫ్ఆర్బీఎం రుణపరిమితికి మళ్లీ గండి పడే ప్రమాదముంది. అందుకే ఉదయ్‌లో చేరకుండా తాత్కాలికంగా దాటవేసే ధోరణిని అనుసరిస్తోంది. -
'త్వరలోనే ప్రతి ఇంటికి ఎల్ఈడీ బల్బులు'
హైదరాబాద్: విద్యుత్ పొదుపును ప్రోత్సహించడం కోసం త్వరలోనే ప్రతి ఇంటికి ఎల్ఈడీ బల్బులు వచ్చేలా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గురువారం తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్‌తో కేంద్రమంత్రి పియుష్ గోయల్ భేటీ అయ్యారు. నిరంతర విద్యుత్‌ను అందించే ఉదయ్ పథకంలో చేరుతామని అన్నారు. త్వరలోనే ఉదయ్‌పై కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు కేసీఆర్ తెలిపారు. -
ఈ అమ్మకు అన్నీ తెలుసు
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో భాగంగా కడలూరు జిల్లా విరుదాచలంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. కడలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల రేసులో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులను ఓటర్లకు జయలలిత పరిచయం చేశారు. ఐదేళ్ల తన ప్రభుత్వ హయాంలో అందించిన సుపరిపాలనను గుర్తుచేస్తూ, అమలు చేసిన పథకాలను వివరించారు. చెప్పింది చేస్తా.., చేసేదే చెబుతా అన్నది తన సిద్ధం అని, అలాగే, చెప్పనవి కూడా చేసి చూపించానని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం తన అభిమతంగా పేర్కొన్నారు. తనకు కుటుంబం ఈ ప్రజలేనని, మీ కోసం నేను...నా కోసం మీరు అంటూ, మళ్లీ అవకాశం ఇస్తే, రాష్ట్రం సుభిక్షవంతంగా మారుతుందని ప్రకటించారు. ప్రజల అవసరాలు ఏమిటో, సమస్యలు ఏమిటో, వారికి ఏమి కావాలో, ఏమి చేయాలో, అన్న అన్ని విషయాలు ఈ తల్లికి తెలుసునని, మళ్లీ ఈ తల్లిని ఆదరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాదు, ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడం, కుటుంబం అంతా ఆనందోత్సాహాలతో జీవించేందుకు తగ్గ కార్యచరణ , సరికొత్త పథకాలు అమలు చేసి తీరుతానని , ఇందుకు ప్రజలందరూ తనకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. డిఎంకేకు పతనం ఖాయం అని, ఈ విషయం స్వయంగా కరుణానిధికి కూడా తెలుసునని, అందుకే కళ్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తానేదో కేంద్ర మంత్రులకు అనుమతి ఇవ్వడం లేదని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన సమాధానం తన సమాధానంగా వివరించారు. ఉదయ్ పథకంతో తమిళనాడుకు ఒరిగేది శూన్యమేని వ్యాఖ్యానించారు. తనతో ఎన్ని సార్లు భేటీ అయ్యారో, అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చర్చించారో, తనను సంప్రదించే విషయంలో ఏ ఇబ్బందులు లేవంటూ స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించి ఉండటం బట్టి తానేమిటో అన్నది అర్థం చేసుకోవాలని సూచించారు. మళ్లీ అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనకు అండగా నిలబడే విధంగా అన్నాడీఎంకే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. -
‘ఉదయ్’తో ఒరిగిందేమీ లేదు
టీనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి నత్తం విశ్వనాథన్ ఆరోపించారు. కేంద్రమంత్రి గోయల్ తన స్థాయిని మరచి మాట్లాడడం సరికాదన్నారు. ప్రజల పొట్టగొట్టే పథకాన్ని విద్యుత్ సంస్కరణల చట్టం పేరుతో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యుత్, ప్రత్యామ్నాయ ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పవన విద్యుత్‌కు సంబంధించిన ఒక ప్రశ్నకు బదులిస్తూ తన స్థాయిని మరచి మాట్లాడారని విమర్శించారు. రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు వీలు కాలేదని ఒక కుంటిసాకును తెలపడమే గాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకానికి సంబంధించిన ఒప్పందంలో తమిళనాడు ప్రభుత్వం ఇంకా సంతకం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. ఈ ఉదయ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ప్రజల కోసమే పథకాలు ఉన్నాయని, పథకాల కోసం ప్రజలు లేరనేది ముఖ్యమంత్రి అభిప్రాయమన్నారు. ఉదయ్ పథకం ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్రానికి సరిపడదనేది తేటతెల్లమవుతోందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యం: డి.రాజా రాష్ట్ర హక్కులను పరిరక్షించడంలో అన్నాడీఎంకే ప్రభుత్వం విఫలమైందని కమ్యూనిస్టు జాతీయ కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. చెన్నై టీనగర్‌లోగల సీపీఐ ప్ర ధాన కార్యాలయం బాలన్ ఇల్లంలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పరిరక్షిం చేందుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని అన్నా రు. డీఎండీకే-మక్కల్నల కూట్టనితో కూటమి ఏర్పడిందని, ఇందుకు సీపీఐ కేంద్ర కమిటీ కూడా స్వాగతించిందన్నారు. అదే విధంగా ప్రజలు కూడా స్వాగతిస్తారనే నమ్మకం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా వున్న పియూష్ గోయల్‌కు తమిళనాడులో ఎటువంటి అభివృద్ధి పథకం నెరవేర్చేందుకు ముఖ్యమంత్రిని చూసేందుకు వీలుకాలేదని పేర్కొన్నారు. సీఎం దర్శనం దుర్లభం: తమిళిసై దేశ ప్రధానిని సులభంగా కలుసుకోవచ్చని, అయితే రాష్ట్ర సీఎం, ఇతర మంత్రులను కలుసుకోవడం అసాధ్యమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏర్పడిన వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి వరద బాధిత ప్రాంతాలను సందర్శించారని, అంతవరకు వరదలను పరిశీలించని ముఖ్యమంత్రి మోడీ వస్తున్నారని తెలియడంతో అత్యవసరంగా వరద ప్రాంతాలను సందర్శించారన్నారు. ప్రధానిని సామాన్య ప్రజలు కూడా సులభంగా సందర్శించుకోవచ్చని, ప్రధానిని చూసేందుకు అన్నాడీఎంకే ఎంపీలకు అనుమతి లభించడం లేదనేది అంగీకార యోగ్యం కాదన్నారు.