‘ఉదయ్’.. ఖజానాకు భారం!
- వచ్చే ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎంకు గండి
- పునరాలోచనలో పడ్డ తెలంగాణ ప్రభుత్వం.. ఒప్పందంపై సంతకం చేసేందుకు మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఆ పథకం ఒప్పందంపై సంతకాలు చేయాల్సిన చివరిదశలో వెనుకడుగు వేసింది. అసలు అందులో చేరాలా.. వద్దా.. అని మల్లగుల్లాలు పడుతోంది. ఉదయ్‌లో చేరితే రాష్ట్ర ఖజానాపై అప్పులభారం పెరిగి, వడ్డీలు మోత మోగే ప్రమాదముంది. ఉదయ్ పథకం లక్ష్యాల్లో భాగంగా విద్యుత్ పంపిణీ సంస్థలకు(డిస్కంలు) ఉన్న అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాలో జమ చేసుకోవాలి. అంతమేరకు బాండ్లు జారీ చేసి డిస్కంలను అప్పులబారి నుంచి విముక్తులను చేయాలి. రాష్ట్రంలో ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌కు దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా అప్పులున్నాయి.
ఉదయ్ పథకంలో చేరితే డిస్కంల అప్పుల్లో 75 శాతం దాదాపు రూ.8000 కోట్ల రుణభారం రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలి. ఈ ఏడాది మార్చిలోపు అంతమేరకు బాండ్లు విక్రయించి డబ్బులు సమకూర్చాలి. డిస్కంల నుంచి టేకోవర్ చేసిన రుణం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితికి ఢోకాలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ, విద్యుత్ కంపెనీలు ఉదయ్‌లో చేరేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్‌కు వచ్చి మంతనాలు జరపడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయ్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తపరిచారు. దీంతో ఒప్పందపత్రాలు సిద్ధమయ్యాయి. ఫైలుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేయటమే మిగిలింది. ఈ తరుణంలో భవిష్యత్తు పరిణామాలపై ఆర్థికశాఖ లేవనెత్తిన సందేహాలతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
బాండ్ల వేలానికి వెనుకడుగు
డిస్కంల అప్పులకు సరిపడే రూ.8000 కోట్ల బాండ్లను వేలం వేసేందుకు ఆర్థికశాఖ ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆర్‌బీఐ ప్రతినెలలో రెండు రోజులు మాత్రమే బాండ్లను వేలం వేస్తుంది. రాబోయే మూడు నెలల్లో ఎంత విలువైన బాండ్లను మార్కెట్లో విక్రయించనుందో ముందే ఆర్‌బీఐకి తెలియజేయాలి. కానీ రాబోయే మూడు నెలల్లో డిస్కంలకు సరిపడేంత బాండ్ల విక్రయానికి ఆర్థికశాఖ మొగ్గు చూపకపోవటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. డిస్కంల రుణభారం ప్రభుత్వం స్వీకరిస్తే ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఖజానాపై పడే ప్రభావమేమీ లేదు. కానీ, రూ.8000 కోట్ల అప్పుకు ఏటా వడ్డీ చెల్లింపులు తడిసి మోపెడవుతాయి. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీల చెల్లింపు కనీసం రూ.800 కోట్లు పెరిగిపోతాయి. దీంతో రెవెన్యూ ఆదాయంలో వడ్డీ పది శాతం దాటిపోతుంది. దీంతో పెరిగిన ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితికి మళ్లీ గండి పడే ప్రమాదముంది. అందుకే ఉదయ్‌లో చేరకుండా తాత్కాలికంగా దాటవేసే ధోరణిని అనుసరిస్తోంది.