'హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు రావు'
నెల్లూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని ప్రజలకు చెప్పేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరులో సీఎం చంద్రబాబు శుక్రవారం మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు రావన్నారు. హోదాపై కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
కొడవలూరు మండలం రాచర్లపాడులో గమేసా పవన విద్యుత్ తయారీ కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని.. ఉదయ్ పథకం కింద రూ.8256 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
అమరావతిలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల ఏ ఉపయోగం ఉండదన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి అభివృద్ధికి సాధ్యమన్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తోంది. పార్లమెంట్ లో శుక్రవారం వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.