ఉదయ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం
ఉదయ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానం
Published Mon, Jun 26 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM
- 12.42 లక్షలకు గాను 3.6 లక్షల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసిన తెలంగాణ
- పురోగతిని వెల్లడించిన కేంద్ర విద్యుత్ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఉజ్వల్ డిస్కం అష్యురెన్స్ యోజన (ఉదయ్) పథకం సంస్కరణల అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, సంస్కరణల అమలులో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరిలు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. వీటి తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ఎల్‌ఈడీ దీపాల పంపిణీ, గ్రామీణ విద్యుత్ ఫీడర్ల ఆడిట్, ఫీడర్ల విభజన, విద్యుత్ సదుపాయం లేని గ్రామాల విద్యుదీకరణ, పట్టణ, గ్రామీణ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల మీటరింగ్ తదితర సంస్కరణల అమల్లో సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకులను కేటాయించింది. తీవ్ర ఆర్థిక నష్టాలు, అప్పులతో ఉన్న రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉదయ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద చేరిన రాష్ట్రాలు డిస్కంల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి, నష్టాలు తగ్గించుకోవడానికి కేంద్రం 14 సంస్కరణలను నిర్దేశించింది. అందులోని కొన్ని ముఖ్యమైన సంస్కరణల అమలులో రాష్ట్రం సాధించిన పురోగతి ఇలా ఉంది.
► రాష్ట్రంలో 12.42 లక్షల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఉదయ్ పథకంలో చేరక ముందు 2.4లక్షలు, ఆ తర్వాత మరో 1.27 లక్షల బల్బులు పంపిణీ చేశారు.
► 5,906 గ్రామీణ ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరాపై ఆడిటింగ్ నిర్వహించాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరిన తర్వాత 60 ఫీడర్లలో ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు.
► 4,101 ఫీడర్లను వ్యవసాయ, వ్యవసాయేతర ఫీడర్లుగా విభజన చేపట్టాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరక ముందు 57 ఫీడర్లు, చేరిన తర్వాత 4 ఫీడర్లను విభజించారు.
► రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని 6.05 లక్షల గృహాలకు విద్యుత్ సౌకర్యం కలిగించాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరిన తర్వాత వాటిలోని 46 వేల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు జారీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 96 శాతం పురోగతి సాధించారు.
► 52,682 పట్టణ ప్రాంత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు అమర్చాల్సి ఉండగా, ఉదయ్‌లో చేరినతర్వాత 1,863 ట్రాన్స్‌ఫార్మర్లకు అమర్చారు. 1,91,648 గ్రామీణ ట్రాన్స్‌ఫార్మర్లకు గాను ఉదయ్‌లో చేరాక 7,050 ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించారు.
► డిస్కంల వార్షిక నష్టాలు(ఏటీ అండ్ సీ లాసెస్) 14.2% వరకు ఉన్నాయి. నష్టాల తగ్గింపులో ఆశించిన పురోగతి లేకపోవడంతో 15 పాయింట్లు మాత్రమే లభించాయి.
► డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం రూ.11,244 కోట్ల బాండ్లు జారీ చేయాల్సి ఉండగా, రూ.8,923 కోట్ల బాండ్లను జారీ చేయడంతో 80 పాయింట్లు లభించాయి.
► గ్రామీణ, పట్టణ ఫీడర్ల మీటరింగ్‌లో రాష్ట్రం 100 శాతం లక్ష్యాలు సాధించింది.
► పట్టణ ట్రాన్స్‌ఫార్మర్ల మీటరింగ్‌లో 53 శాతం, గ్రామీణ ట్రాన్స్‌ఫార్మర్ల మీటరింగ్‌లో 16 శాతం పురోగతి సాధించింది.
► స్మార్ట్ మీటరింగ్‌లో ఎలాంటి పురోగతి లేకపోగా, ఫీడర్ల విభజన, గ్రామీణ ఫీడర్ల ఆడిటింగ్ అంశాల్లో 1 శాతం మాత్రమే పురోగతి సాధించింది.
Advertisement
Advertisement