‘ఉదయ్’లోకి తెలంగాణ
► రాష్ట్రానికి రూ.6,116 కోట్ల లాభం: పీయూష్ గోయల్
► డిస్కంల అప్పుల్లో 75 శాతం భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపరచడం సహా విద్యుదుత్పత్తి ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా రూపొందించిన ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకంలో తెలంగాణ చేరింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉదయ్ వెబ్ పోర్టల్, యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ, అసోం రాష్ట్రాల ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఉదయ్‌లో చేరడంతో తెలంగాణకు రూ.6,116 కోట్ల లాభం చేకూరుతుందని తెలిపారు. ట్రాన్స్‌మిషన్ నష్టాన్ని 9.95 శాతానికి తగ్గించుకుంటే రూ.1,476 కోట్ల రెవెన్యూ అదనంగా డిస్కంలకు వస్తుందన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర, రాష్ట్ర స్థాయి నుంచి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపరుచుకునేందుకు ఉదయ్ దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ పథకంలో చేరడంతో తెలంగాణలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉన్న అప్పుల్లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాకు బదిలీ అవుతాయి. రెండు డిస్కంలు ఇప్పటి వరకు రూ.11,897 కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,923 కోట్లు భరించనుంది. దీంతో పంపిణీ సంస్థలకు రూ.387 కోట్ల వడ్డీ తగ్గుతుందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పేర్కొన్నారు. మిగిలిన రుణానికి పంపిణీ సంస్థలు బాండ్ రూపంలో హామీ ఇస్తాయని ఆయన వివరించారు. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఒప్పందాలు చేసుకున్నట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రానికి 75 శాతం నిధులు గ్రాంట్ రూపంలో రావడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు పేర్కొన్నారు.