టీ సర్కార్ ప్రాంతీయ పక్షపాతం..
♦ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ పోస్టుపై హైకోర్టులో పిటిషన్
♦ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ రాష్ట్రాలకు నోటీసులు
♦ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) వైస్ చాన్స్‌లర్ పోస్టు భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాంతీయ పక్షపాతాన్ని చూపిస్తోందంటూ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వైస్ చాన్స్‌లర్ పోస్టుకు ఉభయ రాష్ట్రాలకు చెందిన వారు అర్హులవుతారని, అయితే తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన వారితోనే సెర్చ్ కమిటీ ద్వారా జాబితా సిద్ధం చేసిందని, దీనిని అడ్డుకోవాలంటూ డాక్టర్ డి.విజయకిశోర్, మరో నలుగురు ప్రొఫెసర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపిస్తూ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ పోస్టు భర్తీ కోసం గత ఏడాది జూన్ 14న నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఈ పోస్టు భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తులతోనే ప్యానెల్‌ను సిద్ధం చేసిందని తెలిపారు. వీసీ పోస్టు నిమిత్తం ఎంపిక చేసిన వ్యక్తులకు యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన అర్హతలు లేవని ఆయన వివరించారు. ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్‌తో సంబంధం లేని వ్యక్తులను, నిబద్ధత, విలువలు లేని వ్యక్తులను ఎంపిక చేసిందని తెలిపారు. ఈ యూనివర్సిటీ గురించి ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని వివరించారు. రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పరిగణనలోకి తీసుకుని, అర్హులను వీసీగా నియమించాల్సి ఉంటుందన్నారు.
కేంద్రం పట్టించుకోవడంలేదు..
దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా పట్టనట్లు వ్యవహరిస్తోందని సుధీర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పునర్విభజన చట్టం, యూజీసీ నిబంధనల ప్రకారం వీసీ నియామకానికి చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సెర్చ్ కమిటీ సిద్ధం చేసిన ప్యానెల్ నుంచి వీసీని నియమించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసింది.