ఏ చట్టం కింద బదలాయిస్తారు?
ఏపీఏటీ కేసులపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) పరిధి నుంచి తెలంగాణను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ట్రిబ్యునల్‌లో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న తెలంగాణకు చెందిన కేసులను ఏ చట్టం కింద హైకోర్టుకు బదలాయిస్తారని ప్రశ్నించింది. పరిపాలన ట్రిబ్యునల్ చట్టం కింద హైకోర్టు నుంచి ట్రిబ్యునల్‌కు కేసులను బదలాయించవచ్చని, అయితే ట్రిబ్యునల్ నుంచి కేసులను హైకోర్టుకు ఎలా.. ఏ చట్టం కింద బదలాయిస్తారో వివరించాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరుతూ న్యాయవాదులు పీవీ కృష్ణయ్య, బి.కిరణ్‌కుమార్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కిరణ్‌కుమార్ తరఫు న్యాయవాది లక్ష్మీ నరసింహ వాదనలు వినిపిస్తూ, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ట్రిబ్యునళ్లను కార్యనిర్వాహక ఉత్తర్వులతో రద్దు చేయడం సాధ్యం కాదని, చట్టం తీసుకురాకుండా ఏపీఏటీ నుంచి తెలంగాణను తప్పించడం సరికాదన్నారు. పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థలు ఉభయ రాష్ట్రాలకు సేవలందించాల్సి ఉందన్నారు.
కేంద్ర నోటిఫికేషన్‌తో ఏపీఏటీలోని కేసుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పీవీ కృష్ణయ్య వివరించారు. నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, అసలు ఈ వ్యాజ్యాలు దాఖలుకు పిటిషనర్లకు అర్హతలేదని, వారేమీ బాధితులు కాదని తెలిపా రు. 2 రాష్ట్రాల సర్వీసు వివాదాలను హైకోర్టు పరిష్కరించవచ్చన్నారు. ట్రిబ్యునల్ రద్దుకు అవకాశముందని, ఈ విషయమై మద్రాసు హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు. అయితే ఆ తీర్పు వివరాలను తమ ముందుంచాలని ఏజీకి స్పష్టం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.