అటవీ హద్దులు గుర్తించాల్సిందే
- కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డైరెక్టర్ జనరల్ సిద్ధాంత దాస్
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా అటవీ అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అటవీ భూముల సర్వే, బ్లాకుల నిర్ధారణ ఎప్పుడో స్వాతంత్య్రానికి ముందు జరిగిందని, మారిన పరిస్థితుల నేపథ్యంలో కచ్చితమైన హద్దులు సాంకేతికంగా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డైరెక్టర్ జనరల్ సిద్ధాంత దాస్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అటవీ భూ ముల హద్దులను కచ్చితమైన లెక్కలతో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిద్ధాంత దాస్ మాట్లా డుతూ దేశ విస్తీర్ణంలో మూడో వంతుకు పైగా ఉండాల్సిన అటవీ ప్రాంతం, కేవలం 24 శాతంగా ఉన్నట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నా యని, ఉన్న అటవీ సంపదను కాపాడుకుంటూనే, పచ్చదనాన్ని మరో 9 శాతం పెంచుకునేందుకు అన్ని రాష్ట్రాలు కృషి చేయాలన్నారు.
రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం
4 రాష్ట్రాలకు చెందిన అధికారులు తమ రాష్ట్రాల్లో అటవీ భూముల రక్షణకు, హద్దుల గుర్తింపునకు చేస్తున్న ప్రయత్నాలు, టెక్నాలజీ వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ శాఖతో అటవీ శాఖ సమన్వయం ద్వారా పూర్తిస్థాయిలో అటవీ భూములను రికార్డు చేయించబోతున్నట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని, ఉమ్మడి సరిహద్దుల్లో అటవీ బౌండరీలను గుర్తించేందుకు సహకరించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
సీఎం కేసీఆర్‌తో సిద్ధాంత దాస్ భేటీ
పచ్చదనం పెంచడానికి, నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్రం చేస్తోన్న కృషి ఆదర్శనీయ మని సిద్ధాంత దాస్ ప్రశంసించారు. రాష్ట్రప్రభుత్వం హరితహారంతోపాటు సమర్థ నీటి వినియోగ కార్య క్రమాలు అమలు చేస్తోందన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ ఏర్పడిన రెండో వారం నుంచే అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకానికి చర్యలు చేపట్టినట్లు సీఎం ఆయనకు వివరించారు.