- ఆక్రమణలకు గురైంది (చదరపు కిలోమీటర్లలో) 15,000
- ప్రాజెక్టులకు ఇచ్చింది (చదరపు కిలోమీటర్లలో) 14,000
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు మొక్కలు నాటాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వాలే.. అభివృద్ధి పేరిట అటవీ భూములను ఉదారంగా కట్టబెట్టేస్తున్నాయి. సాగునీటి, రక్షణ ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు, గనులు, పరిశ్రమలు, రైల్వే, రహదారులు ఇలా వివిధ ప్రాజెక్టుల కోసం అడవులను అడ్డంగా నరికేసేందుకు అనుమతులి స్తున్నాయి. గడిచిన 30 ఏళ్లలో 15,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురికాగా.. మరో 14,000 చదరపు కిలోమీటర్ల అరణ్యం 23,716 ప్రాజెక్టుల కోసం హరించుకుపోయిందట. ఈ గణాంకాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఇది ప్రభుత్వ లెక్క మాత్రమే అని, వాస్తవానికి చాలా భాగం అటవీ ప్రాంతం ఆక్రమణలకు గురయ్యాయని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. ఏటా 250 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను రక్షణ ప్రాజెక్టులు, డ్యామ్‌లు, మైనింగ్, పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, రహదారులు వంటి వాటికోసం ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయి. ఈ మళ్లింపులో రాష్ట్రాలకు.. రాష్ట్రాలకూ మధ్య వ్యత్యాసం ఉంటోంది. 1980 నుంచి ఇప్పటి వరకూ పంజాబ్ తమ అటవీ ప్రాంతంలో సగ భాగాన్ని ఇలా మళ్లించిందట. అదే పశ్చిమబెంగాల్, తమిళనాడు తమ అటవీ ప్రాంతంలో కేవలం 1 శాతం మాత్రమే ఇలా మళ్లిం చాయి. 1980 నుంచి 14,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను ప్రాజెక్టులకు కేటాయించడంతో.. దీనికి పరిహారంగా 6,770 చదరపు కిలోమీటర్ల చెట్లను కొత్తగా నాటడం లేదా పరిహార అటవీకరణ చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి.
– సాక్షి, తెలంగాణ డెస్క్
మైనింగ్, రక్షణ, డ్యామ్‌లకే ఎక్కువ
పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ప్రాజెక్టులకు అప్పగించిన 14,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో మైనింగ్‌కు 4,947 చ.కి.మీ., రక్షణ ప్రాజెక్టులకు 1,549 చ.కి.మీ., హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు 1,351 చ.కి.మీ. అప్పగించారు. ఇక 15,000 చదరపు కిలోమీటర్ల అరణ్యం ఆక్రమణల బారిన పడగా.. ఇందులో ఎక్కువ శాతం మధ్యప్రదేశ్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. గత 30 ఏళ్లలో అరుణాచల్‌ప్రదేశ్ అత్యధికంగా 3,338 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని ప్రాజెక్టులకు కట్టబెట్టింది. మధ్యప్రదేశ్ 2,477 చ.కి.మీ., ఆంధ్రప్రదేశ్ 1,079 చ.కి.మీ. అప్పగించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ అతి తక్కువ కేటాయింపులు జరిపాయని తేలింది. అటవీ భూముల్లో అత్యధికంగా 4,330 ప్రాజెక్టులను ఉత్తరాఖండ్ చేపట్టగా.. పంజాబ్ 3,250, హరియాణాలో 2,561 ప్రాజెక్టులను చేపట్టారు.