సాక్షి, హైదరాబాద్
బీటీ–2 పోయింది.. గులాబీ రంగు పురుగు సోకి
లక్షల ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది!
బీటీ–3.. కేంద్రమే వద్దంది.. అది విషతుల్యమని,
జీవవైవిధ్యానికి ముప్పని తేల్చింది!
మరి వచ్చే ఖరీఫ్‌లో రైతు ఏ పత్తి విత్తనం వేయాలి?
రాష్ట్రంలో లక్షలాది మంది రైతులను వేధిస్తున్న ప్రశ్న ఇది. విత్తనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వట్లేదు. ఇదే అదనుగా వచ్చే ఏడాది కూడా బీటీ–2 పత్తి విత్తనంతోపాటు అనుమతి లేని బీటీ–3 విత్తనాలను అన్నదాతలకు అంటగట్టేందుకు కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే లక్షల ప్యాకెట్లను రహస్యంగా సిద్ధం చేసి ఉంచాయి. అదే జరిగితే ఇప్పటికే చిత్తయిన పత్తి రైతు మరోసారి నిండా మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చొరబడిన బీటీ–3: ప్రపంచంలో అత్యధికంగా పత్తి పండించే 80 దేశాల్లో భారత్ 32వ స్థానంలో ఉంది. దేశంలో 2.92 కోట్ల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. అందులో మన రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మొత్తం సాగు విస్తీర్ణంలో సగం వరకు పత్తి వేశారు. రైతులు దాదాపు కోటి పత్తి విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అయితే బీటీ–2 విఫలమైందని తెలిసిన కొందరు రైతులు అనుమతిలేని బీటీ–3 విత్తనాలు కూడా వేశారు. అక్రమ మార్గాల్లో కంపెనీలు, డీలర్లు అంటగట్టిన దాదాపు 20 లక్షల బీటీ–3 విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేసినట్లు అంచనా. దీనికితోడు పత్తి పంటకు కలుపు వస్తే దాన్ని నాశనం చేసేందుకు గ్‌లైపోసేట్ అనే పురుగుమందును కేంద్రం అనుమతివ్వకున్నా కంపెనీలు రహస్యంగా రైతులకు అంటగడుతున్నాయి.
10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు
రాష్ట్రంలో గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి చాలా మంది రైతులు పత్తి పంట వైపే మొగ్గారు. కానీ పంటకు సోకిన గులాబీ రంగు పురుగు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వర్షాభావం, డ్రైస్పెల్స్, ఎండల తీవ్రతకు ఉధృతమైంది. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా పంట ఉత్పాదకత గణనీయంగా పడిపోయింది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉన్నా అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈ సీజన్‌లో 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ప్రభుత్వం మొదట్లో అంచనా వేసింది. కానీ ఇప్పుడు 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
దేశీయ విత్తనం సంగతేంటి?
దేశీయ పత్తి విత్తనాల కోసం నాగపూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. తాము అభివృద్ధి చేసిన విత్తనాలు పరిశోధన దశను దాటి ట్రయల్ రన్‌లో ఉన్నట్లు చెబుతోంది. ఆర్‌జీ–8, పీఏ–402, పీఏ–405, పీఏ–255, డీఎల్‌ఎస్‌ఏ–17, జయధర్ విత్తనాలను సంస్థ బీటీ టెక్నాలజీతోనే తయారుచేస్తోంది. అయితే బీటీ టెక్నాలజీయే విఫలమైనప్పుడు ఈ దేశీయ రకాలు కూడా ఎలా గులాబీ రంగు పురుగును తట్టుకుంటాయన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. మొత్తంగా చూస్తే రైతుకు వచ్చే ఏడాది కూడా నకిలీ విత్తనాలే దిక్కుకానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది పత్తి వేయొద్దు
బీటీ–2 పత్తి విఫలమైంది. బీటీ–3 విత్తనం వల్ల జీవవైవిధ్యానికి ముప్పుంది. ఇక దేశీయ పత్తి విత్తనాలు కూడా సిద్ధం కాలేదు. పైగా వాటిల్లోనూ బీటీ టెక్నాలజీ ఉంది. కాబట్టి వచ్చే ఏడాది బీటీ–2, బీటీ–3 విత్తనాలనే రైతులకు అంటగట్టే కుట్ర జరుగుతోంది. కాబట్టి రైతులు ఇలాంటి విత్తనాలను వాడే బదులు వచ్చే ఖరీఫ్‌లో పత్తి సాగు చేయకుండా విరామం ప్రకటించాలి. – నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment