Bt-3 seeds
-
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా -
బీటీ–3పై ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి ప్రమాద కరమైన బీటీ–3 పత్తి విత్తనాన్ని ఏం చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన ‘క్షేత్రస్థాయి తనిఖీ, శాస్త్రీయ మూల్యాం కన కమిటీ (ఎఫ్‌ఐఎస్‌ఈసీ)’పరిశీలన ము మ్మరం చేసింది. పత్తి అధికంగా సాగుచేసే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్‌లలో.. అనుమతిలేని బీటీ–3 విత్తనం ఏమేరకు వ్యాప్తి చెందిందో అధ్యయనం చే స్తోంది. అందులో భాగంగా 12 మంది సభ్యుల బృందం గురు, శుక్రవారాల్లో తెలం గాణలోని గద్వాల, మంచిర్యాల, వికా రాబాద్ జిల్లాల్లో పర్యటించింది. రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవు లు నేతృత్వంలో రైతులను కలసి విచారించిం ది. ఆయా జిల్లాల్లో పత్తి పంటలను, జిన్నింగ్ మిల్లులను, విత్తన శుద్ధి ప్లాంట్లను పరిశీలిం చి, విత్తన నమూనాలను సేకరించింది. బీటీ–3కి అనుమతి లేకున్నా పలు చోట్ల ఆ విత్తనాన్ని వేశారని గుర్తించింది. అనంతరం హైదరాబాద్‌లో విత్తన కంపెనీలు, డీలర్లు, విత్తనోత్పత్తిదారులతో సమావేశమైంది. దిశా నిర్దేశం చేయండి అనధికార, పర్యావరణ కాలుష్య కారకమైన బీటీ–3 పత్తి విత్తనాలను అరికట్టడంపై స్పష్టమైన నిబంధనలతో అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర బృందాన్ని కోరారు. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఆ విత్తనాలను క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కొన్నేళ్లుగా అనధికార బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని జాతీయ, రాష్ట్ర విత్తన సంఘాల ప్రతినిధులు, విత్తనోత్పత్తిదారులు కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. అనధికార పత్తి విత్తనాలను పూర్తిగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. కొందరు విత్తనోత్పత్తిదారులు చేసిన తప్పులకు విత్తన డీలర్లు ఇబ్బందులపాలు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించటానికి తగిన నిబం ధనలు రూపొందించాలని.. విత్తనాల గుర్తిం పుపై డీలర్లకు, రైతులకు శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి కావలసిన పత్తి విత్తనాల్లో 40 శాతం వరకు రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నామని.. అనుమతి లేని బీటీ–3 పత్తి విత్తనాల వల్ల వాతావరణం కలుషితమవుతుందని రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవులు పేర్కొన్నారు. బీటీ–3 పత్తిలో హెచ్‌టీ లక్షణాన్ని కనుగొని విత్తన ధ్రువీకరణ చేయటానికి ప్రైవేటు పత్తి సంకరజాతి రకాల నోటిఫికేషన్ అడ్డంకిగా ఉందని కేంద్ర ప్రభుత్వ జీవ సాంకేతిక విభాగం ముఖ్య శాస్త్రీయ అధికారి వి.ఎస్.రెడ్డి చెప్పారు. కేంద్ర బృందానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలివీ.. 1. చట్టవిరుద్ధ బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిని, అమ్మకాలను నియంత్రించే చర్యలు చేపట్టాలి. 2. అన్ని రాష్ట్రాల లాఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు చేపట్టాల్సిన తక్షణ చర్యలను గుర్తించి మార్గదర్శకాలు రూపొందించాలి. 3. బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిపై, గ్లైఫోసేట్ అమ్మకాలపై పర్యవేక్షణకు మార్గదర్శకాలు రూపొందించాలి. 4. విత్తన ఉత్పత్తిదారుల వద్ద లేదా ప్రొసెసింగ్ ప్లాంట్లలో బీటీ–3 పత్తి విత్తనాలను తనిఖీ చేసి వెంటనే నాశనం చేసేలా విధివిధానాలు రూపొందించాలి. 5. బీటీ–3 పత్తి వాడకం, గ్లైఫోసేట్ దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి. 6. బీటీ–3లో హెచ్‌టీ లక్షణం పరీక్ష కోసం ప్రొటోకాల్స్ రూపొందించాలి. -
బీటీ–2 పాయె.. బీటీ–3 వద్దాయె.. రైతుకు విత్తేది?
సాక్షి, హైదరాబాద్ బీటీ–2 పోయింది.. గులాబీ రంగు పురుగు సోకి లక్షల ఎకరాల్లో పత్తి పంట నాశనమైంది! బీటీ–3.. కేంద్రమే వద్దంది.. అది విషతుల్యమని, జీవవైవిధ్యానికి ముప్పని తేల్చింది! మరి వచ్చే ఖరీఫ్‌లో రైతు ఏ పత్తి విత్తనం వేయాలి? రాష్ట్రంలో లక్షలాది మంది రైతులను వేధిస్తున్న ప్రశ్న ఇది. విత్తనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వట్లేదు. ఇదే అదనుగా వచ్చే ఏడాది కూడా బీటీ–2 పత్తి విత్తనంతోపాటు అనుమతి లేని బీటీ–3 విత్తనాలను అన్నదాతలకు అంటగట్టేందుకు కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే లక్షల ప్యాకెట్లను రహస్యంగా సిద్ధం చేసి ఉంచాయి. అదే జరిగితే ఇప్పటికే చిత్తయిన పత్తి రైతు మరోసారి నిండా మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చొరబడిన బీటీ–3: ప్రపంచంలో అత్యధికంగా పత్తి పండించే 80 దేశాల్లో భారత్ 32వ స్థానంలో ఉంది. దేశంలో 2.92 కోట్ల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. అందులో మన రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మొత్తం సాగు విస్తీర్ణంలో సగం వరకు పత్తి వేశారు. రైతులు దాదాపు కోటి పత్తి విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అయితే బీటీ–2 విఫలమైందని తెలిసిన కొందరు రైతులు అనుమతిలేని బీటీ–3 విత్తనాలు కూడా వేశారు. అక్రమ మార్గాల్లో కంపెనీలు, డీలర్లు అంటగట్టిన దాదాపు 20 లక్షల బీటీ–3 విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేసినట్లు అంచనా. దీనికితోడు పత్తి పంటకు కలుపు వస్తే దాన్ని నాశనం చేసేందుకు గ్లైపోసేట్ అనే పురుగుమందును కేంద్రం అనుమతివ్వకున్నా కంపెనీలు రహస్యంగా రైతులకు అంటగడుతున్నాయి. 10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు రాష్ట్రంలో గతేడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి చాలా మంది రైతులు పత్తి పంట వైపే మొగ్గారు. కానీ పంటకు సోకిన గులాబీ రంగు పురుగు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లలో వర్షాభావం, డ్రైస్పెల్స్, ఎండల తీవ్రతకు ఉధృతమైంది. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా పంట ఉత్పాదకత గణనీయంగా పడిపోయింది. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉన్నా అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈ సీజన్లో 3.30 కోట్ల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ప్రభుత్వం మొదట్లో అంచనా వేసింది. కానీ ఇప్పుడు 2 కోట్ల క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ విత్తనం సంగతేంటి? దేశీయ పత్తి విత్తనాల కోసం నాగపూర్‌లోని కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. తాము అభివృద్ధి చేసిన విత్తనాలు పరిశోధన దశను దాటి ట్రయల్ రన్లో ఉన్నట్లు చెబుతోంది. ఆర్జీ–8, పీఏ–402, పీఏ–405, పీఏ–255, డీఎల్ఎస్ఏ–17, జయధర్ విత్తనాలను సంస్థ బీటీ టెక్నాలజీతోనే తయారుచేస్తోంది. అయితే బీటీ టెక్నాలజీయే విఫలమైనప్పుడు ఈ దేశీయ రకాలు కూడా ఎలా గులాబీ రంగు పురుగును తట్టుకుంటాయన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. మొత్తంగా చూస్తే రైతుకు వచ్చే ఏడాది కూడా నకిలీ విత్తనాలే దిక్కుకానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది పత్తి వేయొద్దు బీటీ–2 పత్తి విఫలమైంది. బీటీ–3 విత్తనం వల్ల జీవవైవిధ్యానికి ముప్పుంది. ఇక దేశీయ పత్తి విత్తనాలు కూడా సిద్ధం కాలేదు. పైగా వాటిల్లోనూ బీటీ టెక్నాలజీ ఉంది. కాబట్టి వచ్చే ఏడాది బీటీ–2, బీటీ–3 విత్తనాలనే రైతులకు అంటగట్టే కుట్ర జరుగుతోంది. కాబట్టి రైతులు ఇలాంటి విత్తనాలను వాడే బదులు వచ్చే ఖరీఫ్‌లో పత్తి సాగు చేయకుండా విరామం ప్రకటించాలి. – నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
మోసగాళ్లు వచ్చేశారు..
► మహారాష్ట్ర నుంచి దళారుల రంగప్రవేశం ► అనుమతి లేని బీటీ–3 రకం పత్తి విత్తనాల విక్రయాలు ► కలుపు మందులు అవసరం లేదంటూ ప్రచారం ► ఒక్కో ప్యాకెట్ ధర రూ.1,600 ► మోసపోవద్దంటున్న వ్యవసాయశాఖ అధికారులు భూపాలపల్లి: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతన్నకు మోసగాళ్ల బెడద మొదలైంది. అమాయక రైతులే లక్ష్యంగా కొందరు అనుమతి లేని పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యక్తులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ బోల్‌గార్డ్(బీటీ) 3 విత్తనాలను విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలను నాటితే కలుపు మందులు అవసరం లేదంటూ ప్రచారం చేస్తూ రైతులను ముంచేందుకు యత్నిస్తున్నారు. బీటీ–2కే అనుమతి గత ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాల మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన కొందరు జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, కాటారం, మహదేవ్పూర్ మండలాలతో పాటు ములుగు డివిజన్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో బీటీ–2 రకం పత్తి విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. కాగా అనుమతి లేని బీటీ–3 విత్తనాలు మేలైనవని దళారులు రైతులను నమ్మబలుకుతున్నారు. ఈ విత్తనాలు నాటితే కలుపు మందులు కొట్టాల్సిన అవసరం లేదని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన బీటీ –2 పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.800 వరకు ఉండగా దళారులు నకిలీ విత్తనాలను రూ.1,200 నుంచి రూ.1,600 వరకు వి క్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. విత్తన ప్యాకెట్ల విక్రయాల కోసం దళారులు కమీషన్ పద్ధతిన స్థానికులను కొందరిని నియమించుకుని ఈ దందా సాగిస్తున్నట్లు తెలిసింది. లైసెన్స్ లేకుండానే.. బీటీ 3 పేరిట విత్తనాలు విక్రయించే వారితో పాటు మరికొందరు గ్రామాల్లో తిరుగుతూ ఇతర రకాల నకిలీ విత్తనాలు వి క్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్టిలైజర్, విత్తన విక్రయ దుకా ణాలు ఏర్పాటు చేసుకోకుండా, లైసెన్సులు పొందకుండా విత్తన విక్రయాలు జరుపుతున్నారు. పలువురు దళారులు తెల్ల సంచుల్లో విత్తనాలను విక్రయిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు విక్రయించే వారు రైతులకు రశీదులు ఇవ్వడం లేదు. కనీసం దుకాణాల అడ్రస్ కూడా సరిగా తెలియజేయడం లేదని తెలిసింది. లైసెన్స్ లేని వారి వద్ద, ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు కొనుగోలు చేయడం మూలంగా విత్తనం మొలకెత్తకపోయినా, పంట దిగుబడి రా కున్నా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మా దృష్టికి వచ్చింది.. భూపాలపల్లి డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు బీటీ–3 పేరిట పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. బీటీ–3కి ప్రభుత్వం అనుమతి లేదు. అలాంటి విత్తనాలను రైతులు కొనుగోలు చేసి మోసపోవద్దు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదు, విత్తన ప్యాకెట్ కవర్‌ను పంట దిగుబడి వచ్చే వరకు దాచి ఉంచాలి. బీటీ–3 విత్తనాలు విక్రయించే వారి సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటాం. – సత్యంబాబు, ఏడీఏ, భూపాలపల్లి