ఇది చరిత్రాత్మక ముందడుగు
• ‘ఉదయ్’లో రాష్ట్రం చేరికపై ముఖ్యమంత్రి కేసీఆర్
• డిస్కంలు రుణభారం నుంచి విముక్తి అవుతాయి
• వాటి అప్పుల్లో 75 శాతం ప్రభుత్వమే భరిస్తుంది
• తెలంగాణను మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
• బషీర్‌బాగ్ దుర్ఘటన చరిత్రలో మాయని మచ్చ అని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో మరింత ప్రగతి సాధనకు, డిస్కంలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోవడం చరిత్రాత్మక ముందడుగని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. గత పాలకుల లోపభూయిష్ట విధానాల ఫలితంగా ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, వాటికి రుణ విముక్తి కలిగించేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని వెల్లడించారు. ‘‘రెండు డిస్కమ్‌లు రూ.11,897 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.
ఇందులో ఎస్‌పీడీఎసీఎల్‌కు రూ.7,392 కోట్లు అప్పుంటే, ఎన్‌పీడీసీఎల్‌కు రూ.4,505 కోట్ల అప్పుంది. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఈ అప్పుల్లో 75 శాతం అంటే రూ.8,923 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.2,974 కోట్లు ప్రభుత్వ గ్యారంటీతో బాండ్స్ ఇచ్చే వెసులుబాటు డిస్కంలకు లభిస్తుంది. దీంతో డిస్కంలకు రుణభారం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చడం వల్ల డిస్కంలు ప్రతి ఏటా రూ.890 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిస్కంలు తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు రూ.4,584 కోట్లు అందిస్తోంది’’ అని సీఎం వివరించారు.
మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..
రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 5,863 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా.. 2,700 మెగావాట్ల కొరత ఉండేదని, ఈ రెండున్నరేళ్లలో అదనంగా 5,039 మెగా వాట్లు అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,902 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉందని, ఇందులో జల విద్యుత్, సోలార్, పవన విద్యుత్ ద్వారా వచ్చేది 3,531 మెగావాట్లుగా ఉందని చెప్పారు. అయితే ఈ మూడు మార్గాల ద్వారా వచ్చే విద్యుత్ అంతగా ఆధారపడేది కాదని, అందుకే 10,902 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా స్థిరంగా అందుబాటులో ఉండేది 7,371 మెగావాట్లు మాత్రమేనని తెలిపారు.
రాష్ట్రంలో కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల కరెంట్, వ్యవసాయానికి 9 గంటల త్రీఫేజ్ కరెంట్ అందిస్తున్నామన్నారు. దీంతో రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వచ్చే కాలం వచ్చిం దన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను మిగులు విద్యు త్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తా మని చెప్పారు. భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం పవర్‌ప్లాంట్ల ద్వారా 5,880 మెగా వాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నా మన్నారు. వీటికి తోడు రామగుండం ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, జైపూర్ సింగరేణి ద్వారా 800 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ ద్వారా వెయ్యి మెగావాట్లు, సీజీఎస్ ద్వారా 595 మెగావాట్లు, సోలార్ ద్వారా 3,290 మెగావాట్లు, పులిచింతల ద్వారా 27,187 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం రాష్ట్రానికి ఉంటుందన్నారు.
బషీర్‌బాగ్ కాల్పులు మాయని మచ్చ
సమైక్య రాష్ట్రంలో జరిగిన బషీర్‌బాగ్ కాల్పుల ఘటనను సీఎం ప్రస్తావించారు. ‘‘సమైక్య రాష్ట్రంలో సరైన అంచనా, ప్రణాళిక లేకుండా విద్యుత్ విధానం కొనసాగింది. దీంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. కరెంట్ చార్జీలు తగ్గించి, మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని రోడ్డెక్కిన రైతులపై సమైక్య పాలకులు కాల్పులు జరిపారు. ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయిన బషీర్‌బాగ్ దుర్ఘటన సమైక్య రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ. ఈ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ప్రజా ఉద్యమం విజ యం సాధించి తెలంగాణ ఏర్పడింది’’ అని పేర్కొన్నారు. గత పరిస్థితులు రాకుండా తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పని చేస్తామని, ప్రజల జీవి తాల్లో విద్యుత్ కాంతులు నింపుతామన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 20 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీక రించా లని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే 1,175 మందిని రెగ్యులరైజ్ చేశామని తెలిపారు.