'బుద్ధి లేనోడా నేను చెప్పేది కూడా అదే' | congress leader revanth reddy takes on mp balka suman and kcr | Sakshi
Sakshi News home page

'మీ కొంప తగులబెట్టేందుకు రవ్వే చాలు'

Published Sun, Jan 14 2018 2:44 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

congress leader revanth reddy takes on mp balka suman and kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న కుంభకోణాలు తాను ప్రశ్నిస్తే టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ మాత్రం వివరణ ఇవ్వకుండా తిట్లదండకం మొదలుపెట్టారని కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. మతితప్పినప్పుడు శృతితప్పిన మాటలు ఎలా ఉంటాయో బాల్క సుమన్‌ మాటలు చూస్తే తెలిసిపోతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుచేశారని, ఆ కారణంగానే ప్రభుత్వ అధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని స్వయంగా బాల్క సుమనే చెప్పినందుకు తాను అభినందిస్తున్నానని అన్నారు. శనివారం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

''బాల్క సుమన్ నన్ను రవ్వంత అన్నాడు. టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి కొంపను తగులబెట్టేందుకు ఆ రవ్వే చాలు. ఒక్క నిప్పురవ్వే టీఆర్‌ఎస్‌ పార్టీ కొంపను కాలుస్తుంది. తెలంగాణలో 24గంటల విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే. 2008లో జీవో 53 ద్వారా 8, 9శాతం విద్యుత్‌ కేటాయింపులు మాత్రమే జరిగాయని బాల్క సుమన్‌ అంటున్నారు. మతి తప్పినప్పుడు శృతిలేని మాటలు ఇలాగే ఉంటాయి. 2008లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్‌ పార్టీ.

2008లో జంటనగరాల్లో 24గంటల నిరంతర విద్యుత్‌ ఇవ్వాలని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ఉద్దేశంతో నాడు ఆంధ్ర ప్రాంతానికి 53.89శాతం తెలంగాణకు 46.11శాతం విద్యుత్‌ వినియోగం కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 43శాతం వాటా మాత్రమే వస్తుందని అలా జరిగితే తెలంగాణ చీకటి మయం అవుతుందని 2008లో ఎలాంటి కేటాయింపులు చేశారో అదే కేటాయింపులు ఉండాలని సోనియాగాంధీ చెప్పారు. దాన్నే విభజన సమయంలో పేర్కొన్నారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే. ఈ విషయం చెప్పకుండా మీరే ఇచ్చినట్లు ఎందుకు చెప్పుకుంటున్నారు.

భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు విషయంలో నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో 23మంది అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు వారిని శిక్షించాలని చెప్పింది. ఇదే విషయం నేను చెప్పాను. దీనిపై బాల్క సుమన్‌ వచ్చి కొండను తవ్వి ఎలుకనన్నా పడతడేమంటే కనీసం తొండను కూడా పట్టలేదు. 23మందిని కాదు ఇద్దరినే శిక్షించాలని కోర్టు చెప్పిందని కోర్టు కాపీ కూడా మీడియాకు ఇచ్చారు. బుద్ధి లేనోడా నేను చెప్పేది కూడా అదే.

మీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని మీరు ఒప్పుకున్నట్లే కదా. జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గించి ప్రైవేట్‌ విద్యుత్‌ కొంటున్నారు. ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలకు చెందిన ఇచ్చే లంచాలు, కమిషన్‌లకు కక్కుర్తిపడి ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో 84శాతం ఉన్న ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల వాటా 60శాతానికి పడిపోయింది. దీనికి కారణం మీ ప్రభుత్వమే'' అని రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement