డిస్కంలకు నవోదయం
- ‘ఉదయ్’లో చేరికకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్
- త్వరలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- డిస్కంల రూ. 9 వేల కోట్ల అప్పులు టేకోవర్ చేసుకోనున్న రాష్ట్ర సర్కారు
- తక్షణమే రూ. 500 కోట్ల ఉపశమనం
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల భారం నుంచి బయటపడనున్నాయి. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన(ఉదయ్) పథకంలో రాష్ట్రం చేరబోతోంది. ఉదయ్‌లో చేరిక ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ఆమోదముద్ర వేశారు. ఈ పథకంలో చేరుతున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగైదు రోజుల్లో ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఇందుకు ఢిల్లీ నుంచి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని రెండు డిస్కంలు (దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ–టీఎస్‌ఎస్పీడీసీఎల్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ–టీఎస్‌ఎన్పీడీసీఎల్) ఒకేసారి రూ.9 వేల కోట్ల అప్పుల భారం నుంచి విముక్తి పొందనున్నాయి. ఏపీతో సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఇప్పటికే ఉదయ్ పథకంలో చేరాయి.
75 శాతం అప్పులు ప్రభుత్వ ఖాతాలోకే..
ఉదయ్ పథకం మార్గదర్శకాల ప్రకారం.. 2015 సెప్టెంబర్ 30 నాటికి డిస్కంల 75 శాతం అప్పులను రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చిలోగా స్వాధీనం చేసుకోవాలి. 2015 సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణ డిస్కంల అప్పులు మొత్తం రూ.12 వేల కోట్లకు చేరాయి. ఉదయ్‌లో చేరిన తర్వాత ఈ అప్పుల్లో 75 శాతం.. అంటే రూ.9 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోనుంది. పథకంలో చేరిన వెంటనే రాష్ట్ర డిస్కంలకు రూ.500 కోట్ల తక్షణ ఉపశమనం లభిస్తుందని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రా>వు తెలిపారు.
బ్యాంకులకు బాండ్లు
డిస్కంల నుంచి టేకోవర్ చేసుకోనున్న రూ.9 వేల కోట్ల అప్పులకు గ్యారెంటీగా 20 ఏళ్ల కాలపరిమితి గల బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు జారీ చేయనుంది. ఈ అప్పులను 7.5 నుంచి 8 శాతం వడ్డీతో తిరిగి చెల్లించనుంది. అయితే ఒకేసారి రూ.9 వేల కోట్ల అప్పులు ప్రభుత్వ ఖాతాలో చేరితే రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గిపోనుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. పాలన అవసరాల కోసం ఏటా తీసుకునే రుణాలను తగ్గించుకోవాల్సి రానుంది.