ప్రతీకాత్మక చిత్రం
చెన్నై : ఈ భూమ్మిద మనం గట్టిగా నమ్మేది ఒక వైద్యులను మాత్రమే. అందుకే డాక్టర్లను దేవుడిగా అభివర్ణిస్తాం. కానీ కొన్ని ఘటనలు మాత్రం వైద్యులపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. డబ్బు ఆశతో చచ్చిన శవానికి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి సీన్ చిరంజీవి ‘ఠాగుర్’ లో చూశాం. తాజాగా అలాంటి ఘటననే నిజజీవితంలో జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని చనిపోయిన మూడు రోజులకి కూడా వైద్యం పేరిట లక్షల్లో డబ్బు వసూలు చేశారు. బాధితులు ఆ విషయం కనిపెట్టే లోపు తమకేం తెలియదని చేతులెత్తేశారు.
తమిళానాడులోని నాగపట్టినం జిల్లాకు చెందిన శేఖర్‌కు(55) ఈనెల 9న కడుపునొప్పి రావడంతో కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి చేర్పించారు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఈ నెల 10న తంజావూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ శేఖర్‌కు ఆపరేషన్ చేయాలని రూ.5లక్షలు ఫీజు చెల్లించాలని డాక్టర్లు సూచించారు. దీంతో శేఖర్ కొడుకు సుభాష్ ఆ మొత్తాన్ని చెల్లించారు.
రెండు రోజుల తర్వాత మళ్లీ మరో రూ.3లక్షలు చెల్లించాలని సిబ్బంది సూచించడంతో సుభాష్‌కు అనుమానం వచ్చింది. శేఖర్ డిశ్చార్జ్ చేస్తే తాము వేరే ఆసుపత్రికి తీసుకెళ్తామని సిబ్బందిని కోరారు. అందుకు నిరాకరించిన సిబ్బంది తర్వాత రోజు డిశ్చార్జ్ చేశారు. దీంతో శేఖర్‌ని తంజావుర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శేఖర్ మరణించి మూడు రోజులు అవుతుందని తెలిపారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని అక్కడే పెట్టి ధర్నాకు దిగారు. తమ తండ్రి చనిపోయి మూడు రోజులైనా చెప్పకుండా తమ వద్ద రూ.లక్షలు వసూలు చేశాడని సుభాష్ వాపోయాడు. తమకు అన్యాయం చేసిన ఆస్పత్రి యాజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఆస‍్పత్రి యాజమాన్యం మాత్రం తమకేమి తెలియదని చేతులెత్తేసింది. తమ ఆస్పత్రికి చెడ్డ పేరు తీసుకురావడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment