journalist killed
-
ఇజ్రాయిల్ దాడుల్లో రాయిటర్స్ జర్నలిస్టు మృతి, మరో ఆరుగురికి గాయాలు
జెరుసలేం: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టు మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. జ్రాయిల్ సరిహద్దు దగ్గరున్న అల్మా అల్-షాబ్ సమీపంలో ఆ దేశ మిలిటరీతో పాటు లెబనీస్ మిలిటరీ హిజ్బుల్లా కాల్పులకు పాల్పడుతోంది. అదే ప్రాంతంలో అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్‌పీ)కు చెందిన జర్నలిస్టులు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దిశ నుంచి వచ్చిన మిస్సైల్ దాడిలో రాయిటర్స్ వీడియో జర్నలిస్ట్ ఇస్సామ్ అబ్దల్లా హత్య ప్రాణాలు కోల్పోయాడు. జర్నలిస్టు మృతికి ఇజ్రాయిల్ కారణమని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ఆరోపించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు తమ జర్నలిస్టు మృతిపట్ల రాయిటర్స్ వార్తా సంస్థ స్పందించింది. సౌత్ లెబనాన్ నుంచి లైవ్ అందిస్తున్న ఇస్సామ్ అబ్దుల్లా మృతిపట్ల సంతాపం ప్రకటించింది. ఇజ్రాయెల్ వైపు నుంచి వస్తున్న క్షిపణి కాల్పులను వీడియో తీస్తుండగా, మరో మిస్సైల్ దూసుకురావడంతోఅతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. రాయిటర్స్‌కు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులు అల్ సుడానీ, మహేర్ నజే సైతం గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపింది. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం Video showing the scene before Reuters journalist Issam Abdallah was killed. Journalists clearly marked as journalists, in an open landscape, doing their jobs. Not endorsing the commentary, just sharing the video. pic.twitter.com/weaKiYqFet — Aislinn Laing (@Simmoa) October 14, 2023 ఇదిలా ఉండగా హమాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య వారం రోజులుగా భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అంతం చేసి గాజాను చేజిక్కిచుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు బాంబ్‌లు, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ దాడుల్లో తాజాగా హమాస్‌కు గ్రూపుకు చెందిన వైమానిక దళ నేత మురాద్ అబూ మురాద్‌ను ఇజ్రాయెల్ అంతమొందించింది. శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో మురాద్ చనిపోయినట్లు ఇవాళ ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. వైమానిక కార్యకలాపాలను సాగిస్తున్న హమాస్ ప్రధాన కార్యాలయంపై చేసిన దాడుల్లో మురాద్ హతమైనట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా హమాస్ మిలిటెంట్లకు మురాద్ దిశానిర్దేశం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాంగ్ గ్లైడర్ల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌లో అడుగుపెట్టడానికి మురాద్ కారణమని చెబుతున్నారు. -
ఒడిశాలో బాంబు పేలుడు.. జర్నలిస్టు మృతి
భవానీపట్నం/భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ రోహిత్‌కుమార్ బిశ్వాల్(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెలలో జరగబోయే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిస్తూ మావోయిస్టులు మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్‌ను రోహిత్‌కుమార్ తిలకిస్తుండగా అక్కడే బాంబు పేలిందని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. -
కశ్మీరీ శాంతి కపోతం
మతాలవారీగా, కులాలవారీగా, ప్రాంతాలవారీగా, రాజకీయ భావజాలాల వారీగా చీలిపోయిన నేటి భారతంలో గౌరవప్రదంగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా నిలబడి రాణించడం దాదాపు అసాధ్యం. కల్లోల కశ్మీరంలో అయితే జర్నలిజం కత్తిమీద సాము. ప్రమాదపుటంచుల్లో విన్యాసమే. వస్తునిష్టంగానే రాస్తామంటే కుదరదు. ఉంటే ప్రభుత్వ పక్షాన ఉండాలి లేదా వేర్పాటువాదులకు విధేయంగా ఉండాలి. జరిగిన వాస్తవాలు మాత్రమే ప్రచురించడం అంటే అందరినీ శత్రువులను చేసుకోవడమే. ప్రభుత్వం లేదా సైనికాధికారులు చెబుతున్న సంగతులే ప్రచురిస్తే ‘సర్కారీ పత్రకార్’ అంటూ నిందిస్తారు. డబ్బు తీసుకొని ప్రభుత్వానికి బాకా ఊదుతున్నారంటూ పాకిస్తాన్ అనుకూలవర్గాలూ, మిలిటెంట్లూ, వేర్పాటువాదులూ ఈసడించుకుంటారు. వేర్పాటువాదుల అభి ప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తే ‘దేశద్రోహులు’ అంటూ హిందూత్వవాదులూ, వీర దేశాభిమానులూ ముద్రవేస్తారు. ఈ నేపథ్యంలో అటు వేర్పాటువాదుల తోనూ, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఇటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోనూ, కశ్మీర్‌లోని ప్రభుత్వ ప్రతినిధులతోనూ, ఉన్నత సైనికాధి కారులతోనూ సమాన ఫక్కీలో సత్సంబంధాలు కలిగిఉంటూ శాంతి నెలకొల్ప డానికి ప్రయత్నించడం సాహసం. అటువంటి అరుదైన సాహసి మొన్న తూటా లకు బలైన ప్రఖ్యాత జర్నలిస్టు సుజాత్ బుఖారీ. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన పత్రిక ‘రైజింగ్ కశ్మీర్’ కార్యాలయం బయటనే ఇఫ్తార్‌కు వెళ్ళేందుకు కారు ఎక్కబోతుండగా హంతకులు జరిపిన కాల్పులలో నేలకొరిగాడు. సుజాత్ బుఖారీ వివేకవంతుడు. సాహసి. స్నేహశీలి. ఎత్తుగా, అందంగా, హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉండే బుఖారీకి అన్ని రంగాలవారితోనూ పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి. అందరితో మాట్లాడే చనువుంది. అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో పని చేస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌లో మిత్రులు ఉన్నారు. మనసు విప్పి మాట్లాడే ఆర్మీ జనరల్స్ ఉన్నారు. కనుకనే బారాముల్లా జిల్లాలో క్రీరీ గ్రామంలో శుక్రవారం జరిగిన బుఖారీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరైనారు. కొందరు సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వెళ్ళారు. కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుఖారీ హత్యవార్త విని కన్నీటి పర్యంతం అయిపోయారు. ఆమె సోదరుడూ, మంత్రి తస్దీఖ్ముఫ్తీ, ప్రతిపక్ష నాయకుడూ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోనే కాకుండా దేశవ్యాప్తంగా బుఖారీని అభిమానించేవారు ఉన్నారు. యావద్భారతం శోకతప్తమైన సందర్భం ఇది. బుఖారీతో పాటు ఆయన అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పోలీసులు ఆగంతకుల తూటాలకు నేలకొరిగారు. అంతకు కొన్ని గంటల ముందే జౌరంగజేబు అనే జవాన్ శవం పుల్వామాలో దొరికింది. రంజాన్ సెలవుపై ఇంటికి వెడుతున్న జౌరంగజేబును దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. రంజాన్ మాసం సందర్భంగా దేశీయాంగ శాఖ కశ్మీర్లో స్వచ్ఛంద కాల్పుల విరమణ ప్రకటించిన ఫలితంగా లభించిన అవకాశాన్ని ఉగ్రవాదులు పూర్తిగా వినియోగించుకున్నారు. కాల్పుల విరమణకు ముందు ఏప్రిల్ 19 నుంచి మే 16 వరకూ ఉగ్రవాద సంబంధమైన ఉదంతాలు 25 జరిగితే, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మే 17 నుంచి జూన్ 13 వరకూ 66 ఘటనలు జరిగాయి. కాల్పుల విరమణను పొడిగించి, చర్చల ప్రక్రియను పునరుద్ధరించకపోతే కశ్మీర్లో 1990 దశకం ఆరంభంనాటి పరిస్థితి పునరావృతం అవుతుంది. హింసాకాండ కొనసాగి ఉగ్రవాదులది పైచేయి అయితే కశ్మీర్ అంతర్జాతీయ వివాదంగా మళ్ళీ తెరపైకి ప్రముఖంగా వస్తుంది. ఇతర దేశాల జోక్యాన్ని నివారించడం కష్టం అవుతుంది. కశ్మీరీల ఆత్మగౌరవాన్ని (అస్మితను) సుజాత్ బుఖారీ ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. కశ్మీరీ భాష అన్నా, సంస్కృతి అన్నా చెవికోసుకునేవాడు. కశ్మీరీ భాషలో వార్తాపత్రికలు రావడానికి ఉద్యమం చేశాడు. కశ్మీరీ భాషలో కవులూ, రచయితల కోసం స్థాపించిన ‘అబ్దీ మక్రజ్ కమ్రాజ్’ అనే సంస్థకు బుఖారీ అధ్యక్షుడు. ఈ సంస్థ కృషి ఫలితంగానే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2017లో కశ్మీర్ పాఠశాలల్లో పదో తరగతి వరకూ కశ్మీరీ భాషను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. కశ్మీరీ భాషకు పర్షియన్–అరబిక్ లిపిని రద్దు చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని ఈ సంస్థ జయప్రదంగా ఆడ్డుకున్నది. ఉర్దూ, ఇంగ్లీష్, కశ్మీరీ భాషలలో అధికారం కలిగిన రచయిత బుఖారీ. మంచి వక్త. సాహిత్యసభలలో తరచుగా పాల్గొనేవాడు. అతడు కేవలం జర్నలిస్టు కాదు. శాంతికోసం పరితపించిన∙యాక్టివిస్టు కూడా. ‘రికన్సీలియేషన్ రిసోర్సెస్’ అనే సంస్థను నెలకొల్పి కశ్మీర్లో శాంతి సాధనకు చొరవ తీసుకొని సమాలోచనలు నిర్వహించే బృందంలో బుఖారీ ముఖ్యపాత్రధారి. ఇండియా, పాకిస్తాన్ల మధ్య సమాంతర దౌత్యం (ట్రాక్–2 డిప్లొమసీ) నిర్వహించేవారు. రెండు దేశాల ప్రభుత్వాల, పౌరసమాజాల ప్రతినిధులతో సమాలోచనలు అమెరికాలో, ఇంగ్లండ్‌లో, ఇతర దేశాలలో నిర్వహించేవారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఈ రకం దౌత్యంలో ప్రముఖ సంపాదకుడు శేఖర్‌గుప్తా పాల్గొనేవారు. గత నెల దుబాయ్‌లో బుఖారీ ఆధ్వర్యంలో జరిగిన కశ్మీర్ ఇనీషియేటివ్ భేటీ వివాదాస్పదమైంది. ఇండియా, పాకిస్తాన్‌లు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ సమావేశంలో తీర్మానం ఆమోదించాలని అనుకున్నట్టు వార్త పొక్కింది. తీర్మానం ఆమోదానికి పెట్టలేదు కానీ అందులోని అంశాలపై రకరకాల వ్యాఖ్యలూ, ప్రతిస్పందనలూ సోషల్ మీడియాలో స్వైరవిహారం చేశాయి. ఇది ఉగ్రవాదులను ఆగ్రహోదగ్రులను చేసింది. కశ్మీర్లో శాంతి నెలకొనే అవకాశాలు మెరుగైన ప్రతిసారీ ఉగ్రవాదులు రెచ్చిపోతారు. ‘కశ్మీర్లో ప్రజలు ప్రాణత్యాగం చేస్తున్నది ఉల్లిగడ్డల లేదా ఆలుగడ్డల వ్యాపారం కోసమో, కశ్మీర్‌ను శాశ్వతంగా విభజించడం కోసమో కాదు. కశ్మీర్‌కు విమోచన కలిగించడానికి. దుబాయ్‌లో జరిగిన భేటీ భారత ఇంటెలిజెన్స్ సంస్థల నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తులు నిర్వహించింది. అటువంటి సమావేశాలు నిరర్థకమైనవి’ అంటూ భారత ఇంటెలిజెన్స్ సంస్థల తొత్తుగా సుజాత్ తదితరులను జగమెరిగిన ఉగ్రవాది సలాహుద్దీన్ నిందించాడు. హిజ్బుల్ ముజాహిదీన్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్లు బుఖారీని భారత సైన్యానికీ, ఇంటెలిజెన్స్ సంస్థలకీ డబ్బుకోసం అమ్ముడుపోయిన వ్యక్తిగా అభివర్ణించాయి. హంతకులెవరు? సుజాత్ బుఖారీని ఎవరు చంపారు? ఈ ప్రశ్నపైన సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి నివేదికపైన సుజాత్ బుఖారీ వ్యాఖ్య చేసిన కొన్ని గంటలకే అతడిని హత్య చేయడం విశేషం అంటూ పాకిస్తాన్ విదేశాంగ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సుజాత్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉన్నదంటూ పరోక్షంగా పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపిస్తున్నది. బుఖారీని ఎవరు చంపారనే ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి లేదు. అతడిని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? వేర్పాటువాదులతో, పాకిస్తాన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని కశ్మీర్ ముఖ్యమంత్రి పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణ గడువును పొడిగించాలనీ, అవసరమైతే వేర్పాటువాదులతో సైతం చర్చలు జరపాలనీ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో శాంతికాముకుడైన బుఖారీని చంపవలసిన అవసరం కల్లోలం కోరుకునేవారికే ఉంటుంది. ముగ్గురు ఉగ్రవాదులు బైక్‌పైన వచ్చి కాల్పులు జరిపినట్టు జమ్మూ–కశ్మీర్ డీజీపీ ఎస్పి వెయిద్ అంటున్నారు. కశ్మీర్ లోయలో ప్రభుత్వానికీ, వేర్పాటువాదులకూ మధ్య, ఇండియాకూ, పాకిస్తాన్‌కూ మధ్య, ముస్లింలకూ, కశ్మీరీ పండిట్లకూ మధ్య వారధిగా ఉన్న మానవతామూర్తిని పొట్టనపెట్టుకున్నారు. కశ్మీరీ పండిట్లకు అండగా ఉంటూ, వారిని తిరిగి కశ్మీర్‌కు రప్పించాలని కోరుకునేవారిలో బుఖారీ అగ్రగణ్యుడు. అటువంటి ఉదారవాదులకు కశ్మీర్లో స్థానం లేదనీ, భద్రత లేదనీ స్పష్టం చేయడం, ఉదారవాదంవైపు మొగ్గు చూపవద్దని ఇతరులను హెచ్చరించడం హంతకుల లక్ష్యం. ఉగ్రవాదులకు హెచ్చరిక బుఖారీ అంత్యక్రియలకు హాజరైన జర్నలిస్టులు అతడి స్ఫూర్తితో మరింత ధైర్యంగా వ్యవహరించి ఉగ్రవాదుల లక్ష్యాన్ని ఓyì ంచడమే అతడికి నిజమైన నివాళి. కడచిన 15 సంవత్సరాలలో కశ్మీర్లో ఉగ్రవాదులు హత్య చేసిన మొదటి ఉదారవాది బుఖారీ. 2003లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అబ్దుల్ మాజీద్ దార్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపివేశారు. అంతకు పది నెలల ముందు ప్రొఫెసర్ అబ్దుల్ ఘనీ లోన్ని మీర్వాయిజ్ మౌల్వీ ఫారూఖ్ వర్థంతి సభలో ప్రసంగిస్తున్న సమయంలో హత్య చేశారు. 12 ఏళ్ళ కిందట మౌల్వీ ఫారూఖ్ని కూడా ఉగ్రవాదులే చంపారు. ఫారూఖ్కీ, లోన్‌కీ, దార్కూ, బుఖారీకి మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం– ఉదారవాదం. ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు శాంతిమంత్రం జపిస్తారు కనుక వారిని ఉగ్రవాదులు ఉపేక్షించరు. స్నేహశీలి, క్రియాశీలి సుజాత్ బుఖారీని నేను 2010లో మొదటి సారి కలుసుకున్నాను. వందమందికిపైగా యువకులు చేతుల్లో రాళ్ళు పట్టుకొని మరతుపాకుల ఎదురుగా నిలిచి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పారామిలటరీ సైనికులు కాల్పులకు నేలకూలిన ఘటనలు జరిగిన తర్వాత కొన్ని వారాలకు హెచ్ఎంటీవీ తరఫున అక్కడికి వెళ్ళాను. సహచరుడు జమీల్–ఉర్–రెహ్మాన్ తోడు ఉన్నాడు. గృహనిర్బంధంలో ఉన్న వేర్పాటువాద నాయకుడూ, పాకిస్తాన్ అనుకూలుడూ అయిన సయ్యద్ అలీ షా గిలానీనీ, మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ వంటి హురియత్ నాయకులనూ, ఇతరులనూ ఇంటర్వ్యూ చేశాను. సాధారణ ప్రజలతో మాట్లాడాను. చివరి అంశంగా శ్రీనగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. అందులో సుజాత్ బుఖారీతో పాటు శ్రీనగర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ, పౌరహక్కుల నేతలూ, విద్యార్థులూ అనేక మంది చురుగ్గా పాల్గొన్నారు. కశ్మీర్లో పరిస్థితీ, సైన్యం నీడలో ప్రజల జీవితాలూ, కశ్మీరీ పండిట్ల వలస, ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న కశ్మీరీల బతుకులూ చర్చకు వచ్చాయి. కశ్మీరీలతో సంబంధాలు లేకుండా ఈ రోజుల్లో ఢిల్లీ స్టుడియోలలో కూర్చొని దేశభక్తి వండివార్చే టీవీ యాంకర్లకు వివేకం కానీ, వినయం కానీ లేవు. విషయపరిజ్ఞానం అంతకంటే లేదు. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు పెట్టుకోవాలనీ, పాకిస్తాన్ సహకారంతో కశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనీ సూచించే వ్యక్తులను పాకిస్తానీ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా చిత్రంచే జర్నలిస్టులు ఢిల్లీలో కొన్ని చానళ్ళను శాసిస్తున్నారు. వారికి నమస్కారం. కశ్మీర్లో ఏ ఘటన జరిగినా కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలంటే అక్కడి సంక్లిష్టమైన పరిస్థితులపైన లోతైన అవగాహన కలిగిన బుఖారీ వంటి వ్యక్తులతో మాట్లాడాలి. బుఖారీ అప్పుడు హిందూ పత్రిక ప్రతినిధిగా శ్రీనగర్‌లో పని చేస్తున్నాడు. ఆ పర్యటనలో రెండు దఫాలు అతడితో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం కలిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. కశ్మీర్ చరిత్రను సరైన దృక్కోణంలో అర్థం చేసుకోవడానికి అవసరమైన అవగాహన కలిగింది. బాలగోపాల్ అంటే బుఖారీకీ, హక్కుల నాయకులకూ, ప్రొఫెసర్లకూ ఇష్టం, గౌరవం. అప్పటికి సంవత్సరం క్రితమే కన్నుమూసిన బాలగోపాల్‌ను చాలామంది గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సంపాదకుల సమావేశం సందర్భంగా ఒక సారి బుఖారీ, నేనూ కలుసుకున్నాం. ‘ది హన్స్ ఇండియా’ సంపాదకత్వం నిర్వహించిన రోజుల్లో కశ్మీర్లో ముఖ్యమైన పరిణామాలు సంభవించినప్పుడు బుఖారీని అడిగి ప్రత్యేక విశ్లేషణ తెప్పించుకొని ప్రచురించేవాడిని. హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా ఆవేశం లేకుండా, చిర్నవ్వు చెదరకుండా ఉండటం, ఏది మాట్లాడినా సాధికారంగా వ్యాఖ్యానించడం అతడి ప్రత్యేకత. బుఖారీ వంటి వ్యక్తులు అరుదుగా తారసపడతారు. అతడి మరణం కశ్మీర్ ప్రజలకు తీరని లోటు. కె. రామచంద్రమూర్తి -
కశ్మీర్లో మరో దురంతం
కల్లోలిత ప్రాంతాల్లో పాత్రికేయులు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేయవలసి వస్తున్నదో ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు గురువారం నేలకొరిగిన ‘రైజింగ్ కశ్మీర్’ దినపత్రిక ప్రధాన సంపాదకుడు షుజాత్ బుఖారీ నిరూపించారు. ఆయనపై గతంలోనే మిలిటెంట్లు కన్నేశారు. రెండుసార్లు అపహరించడానికి ప్రయత్నించారు. ఒకసారి హత్యాయత్నం చేశారు. కశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి కాచుక్కూర్చున్న శక్తులు ప్రత్యేకించి బుఖారీని లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణముంది. దశాబ్దాలుగా నెత్తురోడుతున్న కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. సాధారణ ప్రజా జీవనానికి అటు భద్రతా దళాలనుంచీ, ఇటు మిలిటెంట్లనుంచీ కలుగుతున్న ఇబ్బందుల గురించి అందరి దృష్టికీ తీసుకొస్తున్నారు. కశ్మీర్లో వాస్తవంగా ఏం జరుగుతున్నదో, అక్కడి పరిస్థితులేమిటో తెలుసు కోదల్చుకున్న విదేశీ, స్వదేశీ పాత్రికేయులకు తటస్థ స్వరం వినిపించే బుఖారీయే గుర్తుకొచ్చేవారు. కశ్మీర్ సమస్య విషయంలో ఆయన వెల్లడించే అభిప్రాయాలు అటు ప్రభుత్వానికీ, ఇటు మిలిటెంట్లకూ కూడా కంటగింపుగా ఉండేవి. పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం జరిపే అనధికార చర్చల్లో ఆయన భాగస్వామిగా ఉంటున్నా, తరచు పాక్‌లో జరిగే సదస్సులకు హాజరయ్యే అలవాటున్నా కశ్మీర్లో అనవసర జోక్యం చేసుకుని, హింసను ప్రేరేపిస్తున్న పాక్ తీరును నిర్మొహ మాటంగా ఖండించేవారు. కల్లోలిత కశ్మీర్లో మళ్లీ శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదపడటం కోసం రంజాన్ మాసం సందర్భంగా నెలరోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత నెల 17న ప్రకటించారు. అయితే మిలిటెంట్ల వైపు నుంచి కాల్పులు జరిగితే ఎదురుకాల్పులు తప్పవని కూడా చెప్పారు. రాజ్‌నాథ్ ప్రకటనకు రాజకీయ పార్టీలనుంచీ, ఉదారవాద వర్గాల నుంచీ హర్షం వ్యక్తమైనా లష్కరే తొయిబా, యునైటెడ్ జిమాద్ కౌన్సిల్ వంటి మిలిటెంట్ సంస్థలు దాన్ని తాము గుర్తించబోమని వెనువెంటనే తెలిపాయి. దానికి తగినట్టే కాల్పుల విరమణ మొదలైనప్పటినుంచీ భద్రతా దళాలపైనా, పోలీసులపైనా మిలిటెంట్ల దాడులు తీవ్రమయ్యాయి. తొలి 19 రోజుల్లో 23మంది యువకులను మిలిటెంట్ గ్రూపులు చేర్చుకున్నాయని, ఇద్దరు పోలీసులను, ఇద్దరు సైనిక జవాన్లను హతమార్చడంతోపాటు గ్రెనేడ్ దాడులు ముమ్మరం చేశాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక చెబుతోంది. మొత్తంగా రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం మిలిటెంట్లు 62 ఘటనలకు పాల్పడ్డారని ఆ నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాల్పుల విరమణకు ముందు నెలలో వీటి సంఖ్య 18 మాత్రమే. కాల్పుల విరమణ మిలిటెంట్ల కోసం కాదు. దాడులకు పాల్పడేవారిని ఎటూ భద్రతా దళాలు ఉపేక్షించవు. హింసాయుత వాతావరణం వల్ల అస్తవ్యస్థమవుతున్న పౌర జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడమే విరమణ వెనకున్న ఉద్దేశం. రెండేళ్లక్రితం మిలిటెంట్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు ఎన్కౌంటర్లో హతమార్చినప్పటినుంచీ అల్లకల్లోలంగానే ఉంటున్న కశ్మీర్ ఈ ప్రకటన తర్వాత కాస్త చల్లబడింది. మధ్యేవాద స్వరాలు వినబడటం ప్రారంభమయ్యాయి. కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభించాలని వివిధ పక్షాలు కోరు తున్నాయి. భారత, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌లు ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత తొలిసారి స్నేహపూర్వక ప్రకటనలు చేశారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాకిస్తాన్‌నుంచి శాంతియుత వాతావరణం నెలకొనడానికి అనువైన ప్రతిపాదన వస్తే పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోపక్క ఆ దేశంతో అనధికార చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ తరహా చర్చల్లో బుఖారీ ఎప్పుడూ ప్రధానపాత్ర వహిస్తారు. ఇదంతా మిలిటెంట్లకు కంటగింపుగా మారి ఉండొచ్చు. ప్రశాంత పరిస్థితులు ఏర్పడితే, భద్రతా దళాల చర్యలు ఆగితే కశ్మీర్ పౌరుల్లో అసంతృప్తి తగ్గు ముఖం పడుతుందని, అది తమ పలుకుబడిని తగ్గిస్తుందని వారికి అనిపించి ఉండొచ్చు. వారికి నిరంతరం సంక్షోభం కొనసాగడమే ముఖ్యం. అయితే ఈ ఉదంతంలో నిఘా లోపం కూడా ఉంది. కాల్పుల విరమణ ప్రకటించినంత మాత్రాన నిఘా వ్యవస్థ చేష్టలుడిగి ఉండకూడదు. కానీ జరిగింది అదే. శ్రీనగర్ నడిబొడ్డున, భద్రత కట్టుదిట్టంగా ఉన్న లాల్ చౌక్‌లో ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై ముగ్గురొచ్చి ‘రైజింగ్ కశ్మీర్’ కార్యాలయం వెలుపల వేచి ఉండి ఆయనను కాల్చి చంపారంటే ఆశ్చర్యం కలుగుతుంది. బుఖారీని, ఆయనకు రక్షణగా ఉన్న ఇద్దరు పోలీసులను వారు కాల్చిచంపాక కనీసం ఆ మిలిటెంట్లను పట్టుకునే ప్రయత్నం కూడా జరగలేదంటే ఎంత నాసి రకమైన భద్రతా ఏర్పాట్లున్నాయో అర్ధమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో మిలిటెంట్లు దాడులకు పాల్పడితే భద్రతా బలగాలు తిప్పికొడతాయని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హింసాకాండ పెరిగిన 1990 మొదలుకొని ఇంతవరకూ కశ్మీర్ లోయలో సంపాదకులు, విలేకరులు, ఫొటో జర్నలిస్టులు మొత్తం 15మంది ఉగ్రవాదుల హింసలో ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలోనే ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడన్న అభియోగంతో నిరుడు సెప్టెంబర్‌లో అరెస్టయిన ఫొటో జర్నలిస్టు కమ్రాన్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. కశ్మీర్లో మాత్రమే కాదు...కల్లోలిత ప్రాంతాలన్నిటా పాత్రికేయులకు దినదిన గండమే. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటిచోట్ల అటు పోలీసులనుంచీ, ఇటు నక్సలైట్లనుంచీ పాత్రికేయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కేసుల్లో ఇరుక్కుని జైళ్లపాలైతే మరికొందరు ఆ రాష్ట్రం వదిలిపెట్టాల్సి వచ్చింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులను అందరి దృష్టికీ తెస్తూ, లోపాలను ఎత్తిచూపుతూ ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడటానికి పాటుబడుతున్న బుఖారీ వంటి పాత్రికేయులపై దాడులు జరగటం దురదృష్టకరం. ఈ ఉదంతంలో దోషులెవరో, వారి వెనకున్నదెవరో సత్వరం నిగ్గుదేల్చి వారిని కఠినంగా శిక్షించాలి. -
కారుబాంబు.. పొలాల్లో ముక్కలై పడిన జర్నలిస్టు
మాల్టా : పనామా కేసులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న డాదప్నే కార్వానా గలిజియా(53) అనే జర్నలిస్టును చంపేశారు. ఆమె ప్రయాణించే కారులో బాంబు పెట్టి అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇంట్లో నుంచి కారు వేసుకొని బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు పేలి పోవడంతో ఆమె దేహం విడిపోయిన భాగాలుగా పొలాల్లో పడిపోయింది. ఈ హత్య ఎవరు చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచంలో పనామా కుంభకోణం ఓ కుదుపు కుదిపిన విషయం తెలసిందే. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి కూడా ఈ కుంభకోణం కారణంగానే ఊడిపోయింది. అలాగే, పలు అగ్ర దేశాల అధినేతలు సైతం ఈ కుంభకోణం ద్వారా వెలుగులోకి వచ్చారు. అలాంటి పనామా కేసులో గలిజియా విచారణ విభాగంలో మాల్టాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన భర్త పిల్లలతో కలిసి మోస్టా అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. సోమవారం ఉదయం తన ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆమె కొద్ది సెకన్లకే బాంబు పేలుడుకు గురైంది. ఆమె కారుతో సహా ఎగిరిపోయి పొలాల్లో పడిపోయారు. ఆమె దేహం పూర్తిగా కాలి చిద్రమై పోయింది. ఆమె దుర్మరణంపట్ల మాట్లా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ సంతాపం వ్యక్తం చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. కాగా, పనామా కేసు విచారణలో భాగస్వామురాలైన ఆమె ప్రధాని ముస్కాట్ భార్య, విద్యుత్‌శాఖ మంత్రి అక్రమంగా నిధులు పొందారని కథనాలు వెలువరించారు. -
భారత్.. జర్నలిస్టులకు వెరీ డేంజరస్.!
న్యూఢిల్లీ: మీడియా వ్యక్తులకు భారత్ ప్రమాదకరదేశమట. అంతేకాదు జర్నలిస్టులకు రక్షణ కరువైన దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయం 2015లో జరిపిన ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. పాత్రికేయులకు హాని ఉన్న దేశాల జాబితా రూపొందించడానికి చేసిన సర్వేలో ఇరాక్, సిరియా తొలి రెండు స్థానాల్లో నిలవగా... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వే వివరాలను కొట్టిపారేయడానికి ఆస్కారం లేదని మనం గమనించాలి. అందుకు తాజాగా జరిగిన జర్నలిస్టుల హత్యలే ఇందుకు ఉదాహరణ. పక్క పక్క రాష్ట్రాలైన బిహార్, జార్ఖండ్‌లలో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు జర్నలిస్టులు దారుణహత్యకు గురయ్యారు. సీనియర్ పాత్రికేయుడు రాజ్దేవ్ రంజన్‌ను ఈ శుక్రవారం సాయంత్రం బిహార్‌లోని సివాన్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. రాజ్దేవ్ హిందీ దినపత్రిక 'హిందూస్తాన్'లో బ్యూరో చీఫ్ గా 20 ఏళ్లుగా విధులు నిర్వర్తించారు. సివాన్ రైల్వేస్టేషన్ వద్ద అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. జార్ఖండ్‌లోని చాత్రా జిల్లాలో 35 ఏళ్ల అఖిలేశ్ అనే జర్నలిస్టును గురువారం రాత్రి అతి దారుణంగా కాల్చిచంపారు. 1992 నుంచి భారత్ లో అధికారికంగా ఇప్పటివరకూ 64 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని సర్వేలో వెల్లడైంది. ఇందులో చాలా మంది చిన్న చిన్న గ్రామాలు, టౌన్ ప్రాంతాల్లో తమ సమస్యలపై కథనాలు రాసిన వారు ఉన్నారు. స్థానిక రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వల్ల హత్యకు గురవుతున్నారని ఎన్నో ఆరోపణలున్నాయి. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, దాడులు జరిగిన తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త పాలసీలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ చంద్రమౌళి కుమార్ విజ్ఞప్తిచేశారు. -
పాతకక్షలతో పాత్రికేయుడి హత్య
ఒడిషాలోని ఓ ప్రైవేటు టీవీ ఛానల్లో పనిచేస్తున్న పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. బెరహంపూర్కు చెందిన తపస్ ఆచార్య (34) మృతదేహం ఖల్లికోటె పోలీసు స్టేషన్‌కు సమీపంలో రోడ్డుపక్కన పడి ఉండగా గుర్తించారు. తపస్ మెడ మీద గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన డ్యూటీ ముగించుకుని ఖల్లికోటేకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి వస్తుండగా అతడు హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులు పదునైన ఆయుధం లేదా కత్తిని ఉపయోగించి ఉంటారని ఛత్రపూర్ డీఎస్పీ ఏసీహెచ్ పాహి తెలిపారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. గంజాం జిల్లాలోని పాత్రికేయ సంఘాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించాయి.