కల్లోలిత ప్రాంతాల్లో పాత్రికేయులు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేయవలసి వస్తున్నదో ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు గురువారం నేలకొరిగిన ‘రైజింగ్ కశ్మీర్’ దినపత్రిక ప్రధాన సంపాదకుడు షుజాత్ బుఖారీ నిరూపించారు. ఆయనపై గతంలోనే మిలిటెంట్లు కన్నేశారు. రెండుసార్లు అపహరించడానికి ప్రయత్నించారు. ఒకసారి హత్యాయత్నం చేశారు. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి కాచుక్కూర్చున్న శక్తులు ప్రత్యేకించి బుఖారీని లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణముంది. దశాబ్దాలుగా నెత్తురోడుతున్న కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. సాధారణ ప్రజా జీవనానికి అటు భద్రతా దళాలనుంచీ, ఇటు మిలిటెంట్లనుంచీ కలుగుతున్న ఇబ్బందుల గురించి అందరి దృష్టికీ తీసుకొస్తున్నారు. కశ్మీర్‌లో వాస్తవంగా ఏం జరుగుతున్నదో, అక్కడి పరిస్థితులేమిటో తెలుసు కోదల్చుకున్న విదేశీ, స్వదేశీ పాత్రికేయులకు తటస్థ స్వరం వినిపించే బుఖారీయే గుర్తుకొచ్చేవారు. కశ్మీర్ సమస్య విషయంలో ఆయన వెల్లడించే అభిప్రాయాలు అటు ప్రభుత్వానికీ, ఇటు మిలిటెంట్లకూ కూడా కంటగింపుగా ఉండేవి. పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం జరిపే అనధికార చర్చల్లో ఆయన భాగస్వామిగా ఉంటున్నా, తరచు పాక్‌లో జరిగే సదస్సులకు హాజరయ్యే అలవాటున్నా కశ్మీర్‌లో అనవసర జోక్యం చేసుకుని, హింసను ప్రేరేపిస్తున్న పాక్ తీరును నిర్మొహ మాటంగా ఖండించేవారు.
కల్లోలిత కశ్మీర్‌లో మళ్లీ శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదపడటం కోసం రంజాన్ మాసం సందర్భంగా నెలరోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత నెల 17న ప్రకటించారు. అయితే మిలిటెంట్ల వైపు నుంచి కాల్పులు జరిగితే ఎదురుకాల్పులు తప్పవని కూడా చెప్పారు. రాజ్‌నాథ్ ప్రకటనకు రాజకీయ పార్టీలనుంచీ, ఉదారవాద వర్గాల నుంచీ హర్షం వ్యక్తమైనా లష్కరే తొయిబా, యునైటెడ్ జిమాద్ కౌన్సిల్ వంటి మిలిటెంట్ సంస్థలు దాన్ని తాము గుర్తించబోమని వెనువెంటనే తెలిపాయి. దానికి తగినట్టే కాల్పుల విరమణ మొదలైనప్పటినుంచీ భద్రతా దళాలపైనా, పోలీసులపైనా మిలిటెంట్ల దాడులు తీవ్రమయ్యాయి. తొలి 19 రోజుల్లో 23మంది యువకులను మిలిటెంట్ గ్రూపులు చేర్చుకున్నాయని, ఇద్దరు పోలీసులను, ఇద్దరు సైనిక జవాన్లను హతమార్చడంతోపాటు గ్రెనేడ్ దాడులు ముమ్మరం చేశాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక చెబుతోంది. మొత్తంగా రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం మిలిటెంట్లు 62 ఘటనలకు పాల్పడ్డారని ఆ నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాల్పుల విరమణకు ముందు నెలలో వీటి సంఖ్య 18 మాత్రమే.
కాల్పుల విరమణ మిలిటెంట్ల కోసం కాదు. దాడులకు పాల్పడేవారిని ఎటూ భద్రతా దళాలు ఉపేక్షించవు. హింసాయుత వాతావరణం వల్ల అస్తవ్యస్థమవుతున్న పౌర జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడమే విరమణ వెనకున్న ఉద్దేశం. రెండేళ్లక్రితం మిలిటెంట్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినప్పటినుంచీ అల్లకల్లోలంగానే ఉంటున్న కశ్మీర్ ఈ ప్రకటన తర్వాత కాస్త చల్లబడింది. మధ్యేవాద స్వరాలు వినబడటం ప్రారంభమయ్యాయి. కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభించాలని వివిధ పక్షాలు కోరు తున్నాయి. భారత, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌లు ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత తొలిసారి స్నేహపూర్వక ప్రకటనలు చేశారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాకిస్తాన్‌నుంచి శాంతియుత వాతావరణం నెలకొనడానికి అనువైన ప్రతిపాదన వస్తే పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోపక్క ఆ దేశంతో అనధికార చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ తరహా చర్చల్లో బుఖారీ ఎప్పుడూ ప్రధానపాత్ర వహిస్తారు.
ఇదంతా మిలిటెంట్లకు కంటగింపుగా మారి ఉండొచ్చు. ప్రశాంత పరిస్థితులు ఏర్పడితే, భద్రతా దళాల చర్యలు ఆగితే కశ్మీర్ పౌరుల్లో అసంతృప్తి తగ్గు ముఖం పడుతుందని, అది తమ పలుకుబడిని తగ్గిస్తుందని వారికి అనిపించి ఉండొచ్చు. వారికి నిరంతరం సంక్షోభం కొనసాగడమే ముఖ్యం. అయితే ఈ ఉదంతంలో నిఘా లోపం కూడా ఉంది. కాల్పుల విరమణ ప్రకటించినంత మాత్రాన నిఘా వ్యవస్థ చేష్టలుడిగి ఉండకూడదు. కానీ జరిగింది అదే. శ్రీనగర్ నడిబొడ్డున, భద్రత కట్టుదిట్టంగా ఉన్న లాల్ చౌక్‌లో ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై ముగ్గురొచ్చి ‘రైజింగ్ కశ్మీర్’ కార్యాలయం వెలుపల వేచి ఉండి ఆయనను కాల్చి చంపారంటే ఆశ్చర్యం కలుగుతుంది. బుఖారీని, ఆయనకు రక్షణగా ఉన్న ఇద్దరు పోలీసులను వారు కాల్చిచంపాక కనీసం ఆ మిలిటెంట్లను పట్టుకునే ప్రయత్నం కూడా జరగలేదంటే ఎంత నాసి రకమైన భద్రతా ఏర్పాట్లున్నాయో అర్ధమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో మిలిటెంట్లు దాడులకు పాల్పడితే భద్రతా బలగాలు తిప్పికొడతాయని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
హింసాకాండ పెరిగిన 1990 మొదలుకొని ఇంతవరకూ కశ్మీర్ లోయలో సంపాదకులు, విలేకరులు, ఫొటో జర్నలిస్టులు మొత్తం 15మంది ఉగ్రవాదుల హింసలో ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలోనే ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడన్న అభియోగంతో నిరుడు సెప్టెంబర్‌లో అరెస్టయిన ఫొటో జర్నలిస్టు కమ్రాన్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. కశ్మీర్‌లో మాత్రమే కాదు...కల్లోలిత ప్రాంతాలన్నిటా పాత్రికేయులకు దినదిన గండమే. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటిచోట్ల అటు పోలీసులనుంచీ, ఇటు నక్సలైట్లనుంచీ పాత్రికేయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కేసుల్లో ఇరుక్కుని జైళ్లపాలైతే మరికొందరు ఆ రాష్ట్రం వదిలిపెట్టాల్సి వచ్చింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులను అందరి దృష్టికీ తెస్తూ, లోపాలను ఎత్తిచూపుతూ ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడటానికి పాటుబడుతున్న బుఖారీ వంటి పాత్రికేయులపై దాడులు జరగటం దురదృష్టకరం. ఈ ఉదంతంలో దోషులెవరో, వారి వెనకున్నదెవరో సత్వరం నిగ్గుదేల్చి వారిని కఠినంగా శిక్షించాలి.
Comments
Please login to add a commentAdd a comment