సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి కేటీఆర్ తెలంగాణకు ఒక గొప్ప వరం. ఆయన ప్రసంగించే తీరు అమోఘం. ఒక రాజకీయ నేతగా ప్రజాసమస్యల పట్ల అవగాహన, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ దూసుకెళ్తున్న విధానమే కేటీఆర్‌కు వీరాభిమానిగా మార్చాయి..’ అని ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నాడు. టీఆర్‌ఎస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఏకంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 17 రోజుల పాదయాత్ర చేసి ఆదివారం రోహిత్ ప్రగతిభవన్‌కు చేరుకున్నాడు.
అనంతరం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావును కలసి మాట్లాడాడు. సుదూర ప్రాంతం నుండి అభిమానంతో వచ్చిన రోహిత్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు తనకు తెలంగాణ పట్ల ఆసక్తిని, అభిమానాన్ని పెంపొందించాయని రోహిత్ తెలిపాడు.
యువతరానికి స్ఫూర్తినిచ్చేలా మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారని, తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన ముఖచిత్రాన్ని గుండె మీద టాటూగా వేయించుకున్నానని వెల్లడించాడు. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో అభివృద్ధి బాగుందన్నాడు. కాగా టీఆర్‌ఎస్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించాలని రోహిత్ కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ చేరుకున్న రోహిత్‌ను టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మంత్రి వద్దకు తీసుకుని వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment