Haka
-
Hana-Rawhiti: అట్లుంటది ఆమెతోని..!
‘కాంతారా’ లోని గుండె గుభిల్లుమనే ‘అరుపు’ ఆ సినిమాను చూసిన వారి చెవుల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుపే గురువారం నాడు న్యూజిల్యాండ్ పార్లమెంట్ హాల్లో ప్రతిధ్వనించింది! ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసు ఎంపీ అయిన 22 ఏళ్ల హానా రాహిటీ మైపీ–క్లార్క్ కంఠనాళాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా బయటికి వచ్చిన అరుపు అది. 123 మంది సభ్యులు గల ఆ నిండు సభను ఒక ఊపు ఊపిన ఆ అరుపు.. మావోరీ ఆదివాసీ తెగల సంప్రదాయ రణన్నినాదమైన ‘హాకా’ అనే నృత్య రూపకం లోనిది! న్యూజీలాండ్ ప్రభుత్వం తీసుకు రాబోతున్న కొత్త బిల్లుకు నిరసనగా, ఆ బిల్లు కాగితాలను రెండుగా చింపి పడేసి, తన సీటును వదిలి రుద్ర తాండవం చేసుకుంటూ పార్లమెంట్ హాల్ మధ్యలోకి వచ్చారు హానా! ఆమెతో జత కలిసేందుకు తమ సీట్లలోంచి పైకి లేచిన మరికొందరు ఎంపీలు ‘హాకా’ డ్యాన్స్ కు స్టెప్పులు వేయటంతో నివ్వెరపోయిన స్పీకర్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేయవలసి వచ్చింది. హానా ‘మావోరీ’ పార్టీకి చెందిన ప్రతిపక్ష ఎంపీ. మావోరీ తెగల హక్కుల పరిరక్షకురాలు. బ్రిటిష్ ప్రభుత్వానికీ, మావోరీలకు మధ్య కుదిరిన 1840 నాటి ‘వైతాంగి ఒప్పందం’ ద్వారా మావోరీలకు సంక్రమిస్తూ వస్తున్న ప్రత్యేక హక్కులను మొత్తం న్యూజీలాండ్ ప్రజలందరికీ వర్తింపజేసేలా మార్పులు చేసిన తాజాబిల్లును మావోరీల తరఫున హానా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతకు సంకేతంగానే పార్లమెంటులో అరుపు అరిచారు. అధికార పక్షాన్ని ఓ చరుపు చరిచి బిల్లు కాగితాలను చింపేశారు.ఈ ఏడాది జనవరిలో కూడా హానా ఇదే అరుపుతో పార్లమెంటు దద్దరిల్లిపోయేలా చేశారు. అంతకు ముందే డిసెంబరులో కొత్తగా ఏర్పాటైన న్యూజిలాండ్ ప్రభుత్వం తొలి పార్లమెంటు సమావేశం లో... మాతృభాషను నేర్చుకోవాలని తహతహలాడుతున్న మావోరీ పిల్లలకు మద్దతుగా ఆమె దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ‘హాకా’ వార్ క్రై నినాదాన్ని ఇచ్చారు. ‘‘నేను మీ కోసం చనిపోతాను. అయితే నేను మీకోసం జీవిస్తాను కూడా..’’ అని పార్లమెంటు సాక్షిగా ఆమె మావోరీ తెగలకు మాట ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం అయిన న్యూజీలాండ్‌లో 67.8 శాతం జనాభా ఉన్న యూరోపియన్ ల తర్వాత 17.8 శాతం జనాభాతో మావోరీలే ద్వితీయ స్థానంలో ఉన్నారు. తక్కిన వారు ఆసియా దేశస్తులు, పసిఫిక్ ప్రజలు, ఆఫ్రికన్ లు, ఇతరులు. తాజామార్పుల బిల్లులో అందరినీ ఒకేగాట కట్టేయటాన్ని మావోరీలకు మాత్రమే ప్రత్యేకమైన పెద్దగొంతుకతో హానా ప్రశ్నిస్తున్నారు. -
హా‘హాకా’రాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యాపారికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కిరాణా సామాను సరఫరా పనులను ‘హాకా’ పేరుతో అధిక ధరలకు కొనుగోళ్ల కమిటీ కట్టబెట్టింది. ఆ తరువాత అవే రేట్లతో ‘హాకా’ పేరుతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిరాణా సామాను సరఫరా పనులను నామినేషన్‌పై జిల్లా యంత్రాంగం కట్టబెట్టింది. ఇలా మొత్తంలో 200 విద్యాసంస్థల్లో కిరాణా సామాను సరఫరాను అధిక ధరలకు ఇచ్చేసింది. ఈ తతంగంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించాడు. అధిక ధరలతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ‘హాకా’ పేరుతో సదరు వ్యాపారే రూ.కోట్ల విలువైన పనులను దక్కించుకున్నట్లు, ‘హాకా’ కేవలం 2 శాతం కమీషన్‌పై ఈ పనులను సదరు వ్యాపారికి అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మైనారిటీ గురుకులాల్లో స్టేషనరీ, బూట్లు, ఫరి్నచర్, ఎస్సీ గురుకులాల్లో బ్లాంకెట్లు, వైద్య, ఆరోగ్య శాఖలో సామగ్రి సరఫరా పనులను కూడా ‘హాకా’ పేరుతో తీసుకొని, 2 శాతం కమీషన్‌పై ఇతరులకు అప్పగించారన్న ఆరోపణలున్నాయి.‘హాకా’కే ఇవ్వాలనుకుంటే టెండర్లు ఎందుకు?ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ ద్వారానే విద్యా సంస్థలకు కిరాణా సామాను, ఇతరత్రా పరికరాలు, వివిధ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వంటివి సరఫరా చేయాలని ప్రభుత్వం అనుకుంటే టెండర్లు పిలువడం ఎందుకు? ‘హాకా’కే నేరుగా ఇచ్చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే చర్చ సాగుతోంది. పైగా టెండర్లు పిలిచినప్పుడు వాటిలో ప్రైవేట్ వ్యాపారులు పాల్గొనేలా చేసి, అధిక ధరకు ‘హాకా’ దక్కించుకుంటోందని, మళ్లీ కమీషన్లపై ప్రైవేట్ సంస్థలకు అప్పగించి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘హాకా’కు సరఫరా చేసే సామర్థ్యమే లేదన్న చర్చ సాగుతున్న తరుణంలో ఈ పనులను పొందిన కాంట్రాక్టర్లు, సంస్థలు నాసిరకం కిరాణా సామాను, వస్తువులను సరఫరా చేస్తే దానికి బాధ్యులెవరు? 2 శాతం కమీషన్‌తో ఆ పనులను పొందిన వ్యాపారులు, సంస్థలు బాధ్యత వహిస్తాయా? ‘హాకా’ బాధ్యత వహిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వ్యాపారుల దందాతో నాణ్యత గాలికి..ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పనులను ‘హాకా’నే కాంట్రాక్టుకు తీసుకొని వ్యాపారం చేయొచ్చు.. కానీ అలా చేయడం లేదు. ‘హాకా’ పేరుతో కాంట్రాక్టు తీసుకుంటూ ఇతర వ్యాపారులకు కమీషన్‌పై పనులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో ‘హాకా’ పేరుతో వ్యాపారులే అధిక ధరలకు టెండర్లు దాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని సంస్థ కనీసం పరిశీలన చేయడం లేదు. పైగా ఈ తతంగంలో అందులోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ పనులను పొందిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వస్తువుల నాణ్యతను పాటిస్తున్నారా? లేదా చూసే వారు లేకుండాపోయారు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ పేరుతో వ్యాపారులు దర్జాగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 200 విద్యాసంస్థల్లో దాదాపు రూ.కోట్ల విలువైన పనులను ‘హాకా’ పేరుతో టెండర్లలో అధిక ధరకు కోట్ చేసి వ్యాపారులు దక్కించుకొని ప్రభుత్వ ఖాజానాకు గండికొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నా స్పందించడం లేదు. మూలాలను మరిచిన ‘హాకా’.. రైతుల సంక్షేమానికి పనిచేస్తూ.. రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ఏర్పడిందే హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ సొసైటీ (హాకా). గతంలో వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులు ఎరువులు, విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయే వారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసేందుకు, ఎరువులు, విత్తనాలను సరఫరా చేసేందుకు, తద్వారా రైతు సంక్షేమానికి పాటు పడేందుకు ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘హాకా’ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత జిల్లాల్లోనూ తన కార్యాలయాలను విస్తరించి రైతులు నష్టపోయకుండా చూసేది. అలాంటి సంస్థ ఇప్పుడు తన ముఖ్య లక్ష్యాన్ని వదిలేసి గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులతోపాటు ఆహారానికి సంబంధించిన ఇతర సంస్థల్లోనూ వ్యాపారం చేసే వెసులుబాటు ‘హాకా’కు ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రధానమైన రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న చర్చ సాగుతోంది. వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు పొంది 2 శాతం కమీషన్‌తో ఇతర వ్యాపారులకు ఆయా కాంట్రాక్టులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. పూర్తిగా కమీషన్ వ్యాపార దృక్పథంతోనే ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి. -
రూ.60కే కేజీ శనగపప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా(హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్) తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘భారత్ దాల్’ పేరుతో రాయితీపై పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శనగపప్పు ధర రూ.90 ఉండగా హాకా మాత్రం వినియోగదారులకు రాయితీపై రూ. 60కే అందించనుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కలిసి ప్రారంభించనున్నారు. ఇక్కడ పంపిణీని ప్రారంభించిన అనంతరం హాకా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పంపిణీ చేపట్టనుంది. డీ–మార్ట్, మెట్రో, రిలయన్స్మార్ట్, టాటామార్ట్తో పాటు చిన్న పెద్ద స్టోర్స్‌లలోనే కాకుండా ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన జొమాటో, స్విగ్గి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటోలలో కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీటిల్లో కూడా కేజీ రూ.60కే అందించనున్నారు. కాగా 30కేజీల బ్యాగ్ తీసుకుంటే కేజీ రూ.55కే చొప్పున రూ.1650కే అందజేస్తారు. రాయితీపై అందిస్తున్న ఈ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పప్పు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌ను సేకరించనున్నారు. అధికారులు కోనుగోలుదారుల్లో ఎవరికైనా ఫోన్ చేసి నిర్ణీత ధరకే పప్పు అందిందా లేదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేయనున్నారు. 18 రాష్ట్రాలు... 180 పట్టణాలు రాయితీ శనగ పప్పును హాకా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రాష్ట్రంలో కనీసంగా 10 పట్టణాలను ఎంపిక చేసింది. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 180 పట్టణాల్లో పంపిణీ చేయడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. తెలంగాణతో పాటు ఏపీ, బీహార్, చత్తీస్గడ్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది. -
పొరుగు పాలు రుచెక్కువ!
సాక్షి, హైదరాబాద్ : అంగన్వాడీల్లోని లబ్ధిదారులకు అత్యుత్తమ పౌష్టికాహారం కింద పాలను అందిస్తున్న ప్రభుత్వం, పంపిణీ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన హాకా (హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేట్ అసోసియేషన్ లిమిటెడ్)కు అప్పగించింది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం తెలంగాణ విజయ డెయిరీ (తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పంపిణీ చేసే పాల బ్రాండు) పాలను హాకా కొనుగోలు చేసి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలకు చేరవేయాలి. తెలంగాణ విజయ పాలు ఆశించిన మేర సరఫరా చేయని పక్షంలో స్థానిక కంపెనీలను ప్రోత్సహించే క్రమంలో ఇక్కడి డెయిరీలకు ప్రాధాన్యత ఇవ్వొచ్చని సూచించింది. కానీ స్థానిక ప్రోత్సాహం సంగతి అటుంచితే పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీ నుంచి ఎక్కువ ధర వెచ్చించి ‘హాకా’పాలను కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం)ల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం ఈ కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నారు. మొత్తంగా 16.96 లక్షల మంది చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో 17.04 లక్షల ప్యాకెట్లను హాకా సరఫరా చేసింది. ఇందులో కేవలం 1.19 లక్షల ప్యాకెట్లు తెలంగాణ విజయ పంపిణీ చేయగా... మిగతావి కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ సరఫరా చేసింది. రెండు లక్షలలోపే ఆర్డర్లు... తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రోజుకు సగటున 3 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. ఇందులో టెట్రా ప్యాక్ రూపంలో నెలకు సగటున 10 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసే వీలున్నప్పటికీ ప్రస్తుతం 7 లక్షల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విజయ పాలకు కేవలం 2లక్షల వరకే ఆర్డర్లు పెడుతున్న హాకా... మిగతా కోటా అంతా నందిని డెయిరీకే ఇస్తోంది. ఒకవైపు ఎక్కువ ధర చెల్లించడంతో పాటు, పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీని ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నందిని పాల కొనుగోలుతో ప్రభుత్వ ఖజానాపై భారం పడడంతో పాటు పొరుగు రైతులను ప్రోత్సహించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. నందిని డెయిరీ ఎక్కువ మొత్తంలో కమీషన్ ఇస్తుండడంతో ఆ పాలవైపే హాకా మొగ్గు చూపుతుందనే ఆరోపణలున్నాయి. తెలంగాణ విజయ బ్రాండు క్షేత్రస్థాయిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత కరీంనగర్ డెయిరీ ద్వారా ముల్కనూరు పాలు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తి దారుల సంఘం సరఫరా చేసే ‘నార్ముల్’పాలకు కూడా మంచి పేరే ఉంది. విజయ డెయిరీకి డిమాండ్‌కు సరిపడా పాలను సరఫరా చేసే సామర్థ్యం లేకుంటే స్థానిక ప్రోత్సాహం కింద ముల్కనూరు, నార్ముల్ పాలు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కొందరు రైతులు ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అది ప్రభు త్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
పాల మార్కెటింగ్‌లోకి హాకా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా) పాల వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు నిర్వహి ంచిన ఈ ప్రభుత్వ వ్యాపార సంస్థ.. ఇకపై అంగన్ వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ నుంచి కేంద్రాలన్నింటి కీ టెట్రా ప్యాక్ పాలు సరఫరా చేయనుంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో అవగాహన కుదుర్చు కుంది. నెలకు 15 లక్షల లీటర్ల టెట్రా ప్యాక్ పాలను అందజేయనున్నట్లు హాకా ఎండీ సురేందర్ తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీలు పాలను సరిగా సరఫరా చేయకపోవడంతో మార్కెటింగ్, సరఫరాను హాకాకు ప్రభుత్వం అప్పగించినట్లు తెలు స్తోంది. పాలను సహ కార డెయిరీల నుంచే కొనుగోలు చేయనున్నారు. ప్రధానంగా విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తారు. వారి సామర్థ్యానికి మించి అవసరమైతే ఇతర సహకార, ప్రైవేటు డెయిరీల నుంచీ కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. 35,000 అంగన్వాడీలకు: రాష్ట్రంలోని 35,000 అంగన్వాడీ కేంద్రాలకు హాకా ద్వారా పాలు సరఫరా చేయనున్నారు. రోజూ అన్ని కేంద్రాలకు పాల సరఫరా సాధ్యం కానందున 3 నెలల పాటు నిల్వ ఉండే టెట్రా ప్యాక్ పాలను ఎంచుకున్నామని అధికారులు పేర్కొన్నారు. తమకున్న యంత్రాంగం ద్వారా అన్ని కేంద్రాలకు 15 రోజులకోసారి పాలు సరఫరా చేస్తామని, ఇందుకుగాను కొంత రుసుము వసూలు చేస్తామన్నారు. ఆ ప్రకారం హాకాకు ఏడాదికి రూ.కోటి వరకు లాభం వచ్చే అవకాశముంది. విజయకు మేలు..! హాకా పాల విక్రయాలు చేపడితే విజయ డెయిరీకి మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. విజయకు రోజూ దాదాపు 4 లక్షల లీటర్ల పాలు రైతులు పోస్తున్నారు. అందులో రెండున్నర లక్షలే విక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన పాలతో పాల పొడి, వెన్న తదితర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వాటిని అమ్ముకోలేక డెయిరీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. హాకా 15 లక్షల లీటర్ల పాల సరఫరా చేయనుండటంతో విజయకు మంచి మార్కెట్ లభించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. త్వరలో డెయిరీ యాజమాన్యంతో చర్చించి ఒప్పందం చేసుకునే అవకాశముంది. -
కందుల కొనుగోలు కేంద్రాలు మూత
భువనగిరి/ఆలేరు : జిల్లాలో హాకా సంస్థ ఆ« ద్వర్యంలో ఏర్పాటు చేసి న రెండు కందుల కొనుగోలు కేంద్రాలను శని వారం నుంచి మూసివేయనున్నారు. ఇప్పటికే అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు కేంద్రాలు మూసివేత జిల్లాలో కందులను కొనుగోలు చేసేందుకు హాకా సంస్థ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆలేరులో జనవరి 17, భువనగిరిలో 18వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆలేరులో ఇప్పటి వరకు 2,106మంది రైతుల నుంచి 19,844క్వింటాళ్ల కందులను కొనుగోలు చేయగా భువనగిరిలో 2,557రైతుల నుంచి 20,927క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు భువనగిరిలో 374మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,110క్వింటాళ్లకుగాను రూ.1.69 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా ఇంకా రూ.10కోట్లు రావాల్సి ఉంది. ఆలేరులో 400మంది రైతులకు సంబంధించిన 1,411క్వింటాళ్లకుగాను జనవరి 30నాటికి రూ.85లక్షలను రైతుల ఖాతాల్లో వేశారు. కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం జిల్లా మార్కెట్ శాఖ అధికారి ఆదేశాల మేరకు శనివారం నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నాం. రైతులు ఈవిషయాన్ని గమనించి రైతులు గమనించి సహకరించాలని కోరుతున్నాం.– వేణుగోపాల్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి,భువనగరి -
కంది కొనుగోలుకు రూ.600 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంది కొనుగోలు, రైతు బకాయిల చెల్లింపులకు రూ.600 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకాలు నిర్ణయించాయి. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధమవడంతో అందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వద్దకు వెళ్లింది. సీఎం ఆమోదం రాగానే రుణానికి వెళ్లాలని మార్క్‌ఫెడ్, హాకాలు భావిస్తున్నాయి. రైతుల నుంచి రూ.762 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్ టన్నుల కంది కొనుగోలు చేసి ఇప్పటివరకు రూ.262 కోట్లే చెల్లించారు. దీంతో బకాయిలు, మున్ముందు కొనుగోలుకు రుణమే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతు పండించిన కందిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది. కందిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలసి కోరారు. సీఎం కేసీఆర్ లేఖతో ఇటీవల ఆరుగురు ఎంపీలు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. కానీ స్పందన లేదు. 10 రోజుల క్రితం 1.13 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొంటామని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ సమాచారం ఇచ్చిన కేంద్రం.. సీఎం లేఖ తర్వాత సాంకేతిక కారణాలు చూపించి 75,300 మెట్రిక్ టన్నులే కొంటామని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీశ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌పాశ్వాన్‌కు లేఖ రాశారు. మరో లక్ష టన్నులు కొనాలని కోరారు. కానీ కేంద్రం నుంచి అనుమతి వస్తుందన్న ఆశ లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకోడానికి సర్కారు సిద్ధమైంది. -
యార్డుల్లో పడిగాపులు
► ఉమ్మడి జిల్లా అంతటా గన్నీ సంచుల కొరత ► ఆయా మార్కెట్లలో నిలిచిపోయిన కందుల కొనుగోళ్లు ► నాలుగేసి రోజులు యార్డుల్లోనే ఉంటున్న రైతులు కంది రైతులకు కష్టమొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో గన్నీ సంచుల కొరత ఏర్పడడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు పంటను విక్రయించుకునేందుకు నిద్రహారాలు మాని రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులుకాయాల్సిన పరిస్థితి దాపురించింది. – ఆదిలాబాద్ రూరల్ ప్రభుత్వ సూచన మేరకు ఈ ఖరీఫ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు పత్తి సాగు తగ్గించి పప్పుదినుసుల సాగు పెంచారు. ప్రధానంగా కందిని వివిధ పంటల్లో అంతర పంటగా సాగు చేశారు. గత ఖరీఫ్ సీజన్ లో సుమారు ఉమ్మడి జిల్లాలో 46వేల హెక్టార్లు కది సాగైతే ఈ ఖరీఫ్‌లో 90వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా పంట సాగైంది. దిగుబడి బాగానే వచ్చింది. దీంతో కందులను ఆయా జిల్లాల్లో మార్క్‌ఫెడ్, హకా ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుండగా, నిర్మల్ జిల్లాలో హకా ఆధ్వర్యంలో కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు రైతులు పండించిన కంది పంటను విక్రయించేందుకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పలు మండల కేంద్రాల్లో కంది కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాని అధికారుల్లో ముందు చూపు కొరవడింది. కంది పంట కొనుగోళ్లుకు అవసరమైన గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు మార్కెట్ యార్డుల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లిలో కందులు కొనుగోళ్లు చేస్తున్నారు. కుమురం భీం జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లిలో, నిర్మల్ జిల్లాలో భైంసా, కాగజ్‌నగర్, ఖానాపూర్, కుభీర్‌లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. గన్నీ సంచుల కొరత.. కందులు కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా జిల్లాలకు సరిపడా గన్నీ సంచులు సరఫరా చేయలేదు. దీంతో అంతటా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాకు 2,50,000, మంచిర్యాల జిల్లాకు 15వేలు, కుమురం భీం 20వేలు, నిర్మల్ జిల్లాకు సుమారు లక్ష వరకు గన్నీ బ్యాగులు సరఫరా చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా గన్నీ సంచుల సరఫరా లేకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు యార్డులో నిద్రించాల్సిన పరిస్థితి దాపురించింది. పప్పు దినుసుల సాగు పెంచాలని సూచనలు చేసిన ప్రభుత్వం ముందస్తుగా గన్నీ బ్యాగులు ఎందుకు ఉంచలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. దళారులకే ప్రాధాన్యం కంది పంట అధికంగా సాగు చేసిన రైతులు ఆయా మార్కెట్లకు పంటను విక్రయానికి తెస్తే దళారులు అంటున్నారని, అదే దళారులు బయట కొనుగోళ్లు చేసుకొని విక్రయానికి వస్తే అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు రైతులు అంటున్నారు. కానీ అసలైన రైతు అధిక మొత్తంలో కందిని తీసుకొస్తే లేనిపోని ఆరోపణలు చేస్తూ కొనగోలుకు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ సంచులు అందుబాటులో ఉంచి కందులు కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఫేస్ బుక్ లో కాక పుట్టిస్తున్న'హాకా'!
ప్రపంచ దేశాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో అనేక సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. సుమారుగా ప్రతి సంప్రదాయ పద్ధతిలోనూ అక్కడి వేడుకలో ఉత్సాహాన్ని నింపడం కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి సన్నివేశాలు ఉద్వేగాన్ని కూడ నింపుతుంటాయి. అటువంటి వివాహ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఫేజ్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. రెండు రోజుల క్రితం పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పటివరకూ సుమారు కోటీ అరవై లక్షలమందిని ఆకట్టుకుంది. న్యూజిల్యాండ్ లో వివాహ వేడుక సమయంలో ఉత్సాహంగా నిర్వహించే సంబరాల్లో సంప్రదాయ నృత్యం 'హాకా' ఒకటి. బంధు మిత్రులంతా కలసిన వేళ.. నిర్వహించిన ఆ వార్ డ్యాన్స్ సన్నివేశం ఇప్పుడు ఫేస్ బుక్ వినియోగదారులను లక్షలమందిని అమితంగా ఆకట్టుకుంది. ఎందరో హృదయాలను దోచిన ఆ హాకా డ్యాన్స్ వీడియో... బెన్, అలియా ఆమ్ స్ట్రాంగ్ ల పెళ్ళి సందర్భంలోనిది. వధూవరులు.. దంపతులైన వేళ న్యూజిల్యాండ్ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులంతా కలసి ఉత్సాహంగా హాకా డ్యాన్స్ చేస్తారు. ఇలా నిర్వహించే సంప్రదాయ నృత్యాన్ని ఆ కుటుంబ గౌరవానికి చిహ్నంగా చెప్తారు. ఈ వేడుకలో పెళ్ళి కొడుకుతోపాటు అతని పెద్దన్న కార్యక్రమానికి నాయకత్వం వహించారు. పాటలకు లయబద్ధంగా అడుగులు కలుపుతూ సంప్రదాయ పద్ధతిలో చేసే ఆ నృత్యం.. అక్కడి వారిని భావోద్వేగానికి లోను చేసింది. హాకా డ్యాన్స్ సమయంలో సందర్భానుసారంగా పాడే పాటలు... విన్నవారు సైతం కన్నీరు పెట్టకున్నారు. ఉత్సాహంగా అంతా కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఉద్వేగభరిత సన్నివేశం లక్షలమంది మనసులను దోచింది. వధూవరులిద్దరూ కూడ కన్నీటిని తుడుచుకొని ఆ వేడుకలో భాగం పంచుకోవడం అందరికీ ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఫేస్ బుక్ లో వీడియోను చూసిన వారంతా వధూవరులు సైతం డ్యాన్స్ చేసిన తీరును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తెలుగువారి వివాహ సంప్రదాయంలోని అప్పగింతల పాటలు కూడ ఇటువంటి సందర్భాన్ని స్ఫురింపజేస్తాయి. పెళ్ళి కుమార్తెను భర్తకు, వారి కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో పాడే పాటలు, వాయించే మ్యూజిక్ అక్కడున్నవారిని కన్నీరు పెట్టించడం కనిపిస్తుంది. న్యూజిల్యాండ్ హాకా డ్యాన్స్ లో కూడ అటువంటి సందర్భమే మనకు కళ్ళకు కడుతుంది.