రైతుల సంక్షేమాన్ని గాలికొదిలి..
‘హాకా’ పేరు మీద కాంట్రాక్టులు పొంది..
2 శాతం కమీషన్‌తో ఇతరులకు అప్పగింత
కాంట్రాక్టు పనుల నాణ్యతపై గందరగోళం
ప్రభుత్వానికి పట్టని వ్యవస్థ
దండుకుంటున్న దళారులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యాపారికి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కిరాణా సామాను సరఫరా పనులను ‘హాకా’ పేరుతో అధిక ధరలకు కొనుగోళ్ల కమిటీ కట్టబెట్టింది. ఆ తరువాత అవే రేట్లతో ‘హాకా’ పేరుతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిరాణా సామాను సరఫరా పనులను నామినేషన్‌పై జిల్లా యంత్రాంగం కట్టబెట్టింది.
ఇలా మొత్తంలో 200 విద్యాసంస్థల్లో కిరాణా సామాను సరఫరాను అధిక ధరలకు ఇచ్చేసింది. ఈ తతంగంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించాడు. అధిక ధరలతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లేలా ‘హాకా’ పేరుతో సదరు వ్యాపారే రూ.కోట్ల విలువైన పనులను దక్కించుకున్నట్లు, ‘హాకా’ కేవలం 2 శాతం కమీషన్‌పై ఈ పనులను సదరు వ్యాపారికి అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక్కడే కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మైనారిటీ గురుకులాల్లో స్టేషనరీ, బూట్లు, ఫరి్నచర్, ఎస్సీ గురుకులాల్లో బ్లాంకెట్లు, వైద్య, ఆరోగ్య శాఖలో సామగ్రి సరఫరా పనులను కూడా ‘హాకా’ పేరుతో తీసుకొని, 2 శాతం కమీషన్‌పై ఇతరులకు అప్పగించారన్న ఆరోపణలున్నాయి.
‘హాకా’కే ఇవ్వాలనుకుంటే టెండర్లు ఎందుకు?
ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ ద్వారానే విద్యా సంస్థలకు కిరాణా సామాను, ఇతరత్రా పరికరాలు, వివిధ శాఖలకు అవసరమైన ఫర్నిచర్ వంటివి సరఫరా చేయాలని ప్రభుత్వం అనుకుంటే టెండర్లు పిలువడం ఎందుకు? ‘హాకా’కే నేరుగా ఇచ్చేస్తే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయనే చర్చ సాగుతోంది.
పైగా టెండర్లు పిలిచినప్పుడు వాటిలో ప్రైవేట్ వ్యాపారులు పాల్గొనేలా చేసి, అధిక ధరకు ‘హాకా’ దక్కించుకుంటోందని, మళ్లీ కమీషన్లపై ప్రైవేట్ సంస్థలకు అప్పగించి సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ‘హాకా’కు సరఫరా చేసే సామర్థ్యమే లేదన్న చర్చ సాగుతున్న తరుణంలో ఈ పనులను పొందిన కాంట్రాక్టర్లు, సంస్థలు నాసిరకం కిరాణా సామాను, వస్తువులను సరఫరా చేస్తే దానికి బాధ్యులెవరు? 2 శాతం కమీషన్‌తో ఆ పనులను పొందిన వ్యాపారులు, సంస్థలు బాధ్యత వహిస్తాయా? ‘హాకా’ బాధ్యత వహిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాపారుల దందాతో నాణ్యత గాలికి..
ప్రభుత్వ సంస్థల్లో కొన్ని పనులను ‘హాకా’నే కాంట్రాక్టుకు తీసుకొని వ్యాపారం చేయొచ్చు.. కానీ అలా చేయడం లేదు. ‘హాకా’ పేరుతో కాంట్రాక్టు తీసుకుంటూ ఇతర వ్యాపారులకు కమీషన్‌పై పనులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో ‘హాకా’ పేరుతో వ్యాపారులే అధిక ధరలకు టెండర్లు దాఖలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిని సంస్థ కనీసం పరిశీలన చేయడం లేదు.
పైగా ఈ తతంగంలో అందులోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఆ పనులను పొందిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వస్తువుల నాణ్యతను పాటిస్తున్నారా? లేదా చూసే వారు లేకుండాపోయారు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన ‘హాకా’ పేరుతో వ్యాపారులు దర్జాగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో 200 విద్యాసంస్థల్లో దాదాపు రూ.కోట్ల విలువైన పనులను ‘హాకా’ పేరుతో టెండర్లలో అధిక ధరకు కోట్ చేసి వ్యాపారులు దక్కించుకొని ప్రభుత్వ ఖాజానాకు గండికొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నా స్పందించడం లేదు.
మూలాలను మరిచిన ‘హాకా’..
రైతుల సంక్షేమానికి పనిచేస్తూ.. రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ఏర్పడిందే హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ సొసైటీ (హాకా). గతంలో వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులు ఎరువులు, విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయే వారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేసేందుకు, ఎరువులు, విత్తనాలను సరఫరా చేసేందుకు, తద్వారా రైతు సంక్షేమానికి పాటు పడేందుకు ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ‘హాకా’ను ఏర్పాటు చేసింది.
ఆ తరువాత జిల్లాల్లోనూ తన కార్యాలయాలను విస్తరించి రైతులు నష్టపోయకుండా చూసేది. అలాంటి సంస్థ ఇప్పుడు తన ముఖ్య లక్ష్యాన్ని వదిలేసి గాడి తప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులతోపాటు ఆహారానికి సంబంధించిన ఇతర సంస్థల్లోనూ వ్యాపారం చేసే వెసులుబాటు ‘హాకా’కు ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రధానమైన రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్న చర్చ సాగుతోంది.
వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు పొంది 2 శాతం కమీషన్‌తో ఇతర వ్యాపారులకు ఆయా కాంట్రాక్టులను అప్పగిస్తోందన్న ఆరోపణలున్నాయి. పూర్తిగా కమీషన్ వ్యాపార దృక్పథంతోనే ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment