పొరుగు పాలు రుచెక్కువ!  | HAKA Not Buying Milk From Telangana Vijaya Dairy | Sakshi
Sakshi News home page

పొరుగు పాలు రుచెక్కువ! 

Published Mon, Dec 23 2019 2:57 AM | Last Updated on Mon, Dec 23 2019 2:57 AM

HAKA Not Buying Milk From Telangana Vijaya Dairy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అంగన్‌వాడీల్లోని లబ్ధిదారులకు అత్యుత్తమ పౌష్టికాహారం కింద పాలను అందిస్తున్న ప్రభుత్వం, పంపిణీ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన హాకా (హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కోఆపరేట్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌)కు అప్పగించింది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం తెలంగాణ విజయ డెయిరీ (తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పంపిణీ చేసే పాల బ్రాండు) పాలను హాకా కొనుగోలు చేసి క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలకు చేరవేయాలి. తెలంగాణ విజయ పాలు ఆశించిన మేర సరఫరా చేయని పక్షంలో స్థానిక కంపెనీలను ప్రోత్సహించే క్రమంలో ఇక్కడి డెయిరీలకు ప్రాధాన్యత ఇవ్వొచ్చని సూచించింది. 

కానీ స్థానిక ప్రోత్సాహం సంగతి అటుంచితే పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీ నుంచి ఎక్కువ ధర వెచ్చించి ‘హాకా’పాలను కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్‌ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం)ల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం ఈ కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నారు. మొత్తంగా 16.96 లక్షల మంది చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ నెలలో 17.04 లక్షల ప్యాకెట్లను హాకా సరఫరా చేసింది. ఇందులో కేవలం 1.19 లక్షల ప్యాకెట్లు తెలంగాణ విజయ పంపిణీ చేయగా... మిగతావి కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ సరఫరా చేసింది. 

రెండు లక్షలలోపే ఆర్డర్లు... 
తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రోజుకు సగటున 3 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. ఇందులో టెట్రా ప్యాక్‌ రూపంలో నెలకు సగటున 10 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసే వీలున్నప్పటికీ ప్రస్తుతం 7 లక్షల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విజయ పాలకు కేవలం 2లక్షల వరకే ఆర్డర్లు పెడుతున్న హాకా... మిగతా కోటా అంతా నందిని డెయిరీకే ఇస్తోంది. ఒకవైపు ఎక్కువ ధర చెల్లించడంతో పాటు, పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీని ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నందిని పాల కొనుగోలుతో ప్రభుత్వ ఖజానాపై భారం పడడంతో పాటు పొరుగు రైతులను ప్రోత్సహించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. నందిని డెయిరీ ఎక్కువ మొత్తంలో కమీషన్‌ ఇస్తుండడంతో ఆ పాలవైపే హాకా మొగ్గు చూపుతుందనే ఆరోపణలున్నాయి. తెలంగాణ విజయ బ్రాండు క్షేత్రస్థాయిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత కరీంనగర్‌ డెయిరీ ద్వారా ముల్కనూరు పాలు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తి దారుల సంఘం సరఫరా చేసే ‘నార్ముల్‌’పాలకు కూడా మంచి పేరే ఉంది. 

విజయ డెయిరీకి డిమాండ్‌కు సరిపడా పాలను సరఫరా చేసే సామర్థ్యం లేకుంటే స్థానిక ప్రోత్సాహం కింద ముల్కనూరు, నార్ముల్‌ పాలు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కొందరు రైతులు ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అది ప్రభు త్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement