ఫేస్ బుక్ లో కాక పుట్టిస్తున్న'హాకా'!
ప్రపంచ దేశాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో అనేక సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. సుమారుగా ప్రతి సంప్రదాయ పద్ధతిలోనూ అక్కడి వేడుకలో ఉత్సాహాన్ని నింపడం కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి సన్నివేశాలు ఉద్వేగాన్ని కూడ నింపుతుంటాయి. అటువంటి వివాహ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఫేజ్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. రెండు రోజుల క్రితం పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పటివరకూ సుమారు కోటీ అరవై లక్షలమందిని ఆకట్టుకుంది.
న్యూజిల్యాండ్ లో వివాహ వేడుక సమయంలో ఉత్సాహంగా నిర్వహించే సంబరాల్లో సంప్రదాయ నృత్యం 'హాకా' ఒకటి. బంధు మిత్రులంతా కలసిన వేళ.. నిర్వహించిన ఆ వార్ డ్యాన్స్ సన్నివేశం ఇప్పుడు ఫేస్ బుక్ వినియోగదారులను లక్షలమందిని అమితంగా ఆకట్టుకుంది. ఎందరో హృదయాలను దోచిన ఆ హాకా డ్యాన్స్ వీడియో... బెన్, అలియా ఆమ్ స్ట్రాంగ్ ల పెళ్ళి సందర్భంలోనిది. వధూవరులు.. దంపతులైన వేళ న్యూజిల్యాండ్ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులంతా కలసి ఉత్సాహంగా హాకా డ్యాన్స్ చేస్తారు. ఇలా నిర్వహించే సంప్రదాయ నృత్యాన్ని ఆ కుటుంబ గౌరవానికి చిహ్నంగా చెప్తారు. ఈ వేడుకలో పెళ్ళి కొడుకుతోపాటు అతని పెద్దన్న కార్యక్రమానికి నాయకత్వం వహించారు. పాటలకు లయబద్ధంగా అడుగులు కలుపుతూ సంప్రదాయ పద్ధతిలో చేసే ఆ నృత్యం.. అక్కడి వారిని భావోద్వేగానికి లోను చేసింది.
హాకా డ్యాన్స్ సమయంలో సందర్భానుసారంగా పాడే పాటలు... విన్నవారు సైతం కన్నీరు పెట్టకున్నారు. ఉత్సాహంగా అంతా కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఉద్వేగభరిత సన్నివేశం లక్షలమంది మనసులను దోచింది. వధూవరులిద్దరూ కూడ కన్నీటిని తుడుచుకొని ఆ వేడుకలో భాగం పంచుకోవడం అందరికీ ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఫేస్ బుక్ లో వీడియోను చూసిన వారంతా వధూవరులు సైతం డ్యాన్స్ చేసిన తీరును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తెలుగువారి వివాహ సంప్రదాయంలోని అప్పగింతల పాటలు కూడ ఇటువంటి సందర్భాన్ని స్ఫురింపజేస్తాయి. పెళ్ళి కుమార్తెను భర్తకు, వారి కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో పాడే పాటలు, వాయించే మ్యూజిక్ అక్కడున్నవారిని కన్నీరు పెట్టించడం కనిపిస్తుంది. న్యూజిల్యాండ్ హాకా డ్యాన్స్ లో కూడ అటువంటి సందర్భమే మనకు కళ్ళకు కడుతుంది.