Hana-Rawhiti: అట్లుంటది ఆమెతోని..! | New Zealand Youngest MP, other Maori leaders perform war dance in Parliament | Sakshi
Sakshi News home page

Hana-Rawhiti: అట్లుంటది ఆమెతోని..!

Published Sat, Nov 16 2024 1:53 AM | Last Updated on Sat, Nov 16 2024 1:53 AM

New Zealand Youngest MP, other Maori leaders perform war dance in Parliament

‘కాంతారా’ లోని గుండె గుభిల్లుమనే ‘అరుపు’ ఆ సినిమాను చూసిన వారి చెవుల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుపే గురువారం నాడు న్యూజిల్యాండ్‌ పార్లమెంట్‌ హాల్లో ప్రతిధ్వనించింది! ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసు ఎంపీ అయిన 22 ఏళ్ల హానా రాహిటీ మైపీ–క్లార్క్‌ కంఠనాళాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా బయటికి వచ్చిన అరుపు అది. 123 మంది సభ్యులు గల ఆ నిండు సభను ఒక ఊపు ఊపిన ఆ అరుపు.. మావోరీ ఆదివాసీ తెగల సంప్రదాయ రణన్నినాదమైన ‘హాకా’ అనే నృత్య రూపకం లోనిది! 

న్యూజీలాండ్‌ ప్రభుత్వం తీసుకు రాబోతున్న కొత్త బిల్లుకు నిరసనగా, ఆ బిల్లు కాగితాలను రెండుగా చింపి పడేసి, తన సీటును వదిలి రుద్ర తాండవం చేసుకుంటూ పార్లమెంట్‌ హాల్‌ మధ్యలోకి వచ్చారు హానా! ఆమెతో జత కలిసేందుకు తమ సీట్లలోంచి పైకి లేచిన మరికొందరు ఎంపీలు ‘హాకా’ డ్యాన్స్ కు స్టెప్పులు వేయటంతో నివ్వెరపోయిన స్పీకర్‌ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేయవలసి వచ్చింది. 

హానా ‘మావోరీ’ పార్టీకి చెందిన ప్రతిపక్ష ఎంపీ. మావోరీ తెగల హక్కుల పరిరక్షకురాలు. బ్రిటిష్‌ ప్రభుత్వానికీ, మావోరీలకు మధ్య కుదిరిన 1840 నాటి ‘వైతాంగి ఒప్పందం’ ద్వారా మావోరీలకు సంక్రమిస్తూ వస్తున్న ప్రత్యేక హక్కులను మొత్తం న్యూజీలాండ్‌ ప్రజలందరికీ వర్తింపజేసేలా మార్పులు చేసిన తాజాబిల్లును మావోరీల తరఫున హానా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతకు సంకేతంగానే పార్లమెంటులో అరుపు అరిచారు. అధికార పక్షాన్ని ఓ చరుపు చరిచి బిల్లు కాగితాలను చింపేశారు.

ఈ ఏడాది జనవరిలో కూడా హానా ఇదే అరుపుతో పార్లమెంటు దద్దరిల్లిపోయేలా చేశారు. అంతకు ముందే డిసెంబరులో కొత్తగా ఏర్పాటైన న్యూజిలాండ్‌ ప్రభుత్వం తొలి పార్లమెంటు సమావేశం లో... మాతృభాషను నేర్చుకోవాలని తహతహలాడుతున్న మావోరీ పిల్లలకు మద్దతుగా ఆమె దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ‘హాకా’ వార్‌ క్రై నినాదాన్ని ఇచ్చారు. ‘‘నేను మీ కోసం చనిపోతాను. అయితే నేను మీకోసం జీవిస్తాను కూడా..’’ అని పార్లమెంటు సాక్షిగా ఆమె మావోరీ తెగలకు మాట ఇచ్చారు. 

పసిఫిక్‌ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం అయిన న్యూజీలాండ్‌లో 67.8 శాతం జనాభా ఉన్న యూరోపియన్ ల తర్వాత 17.8 శాతం జనాభాతో మావోరీలే ద్వితీయ స్థానంలో ఉన్నారు. తక్కిన వారు ఆసియా దేశస్తులు, పసిఫిక్‌ ప్రజలు, ఆఫ్రికన్ లు, ఇతరులు. తాజామార్పుల బిల్లులో అందరినీ ఒకేగాట కట్టేయటాన్ని మావోరీలకు మాత్రమే ప్రత్యేకమైన పెద్దగొంతుకతో హానా ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement