Women MP
-
నిరసన డ్యాన్సులు..
-
Hana-Rawhiti: అట్లుంటది ఆమెతోని..!
‘కాంతారా’ లోని గుండె గుభిల్లుమనే ‘అరుపు’ ఆ సినిమాను చూసిన వారి చెవుల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుపే గురువారం నాడు న్యూజిల్యాండ్ పార్లమెంట్ హాల్లో ప్రతిధ్వనించింది! ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసు ఎంపీ అయిన 22 ఏళ్ల హానా రాహిటీ మైపీ–క్లార్క్ కంఠనాళాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా బయటికి వచ్చిన అరుపు అది. 123 మంది సభ్యులు గల ఆ నిండు సభను ఒక ఊపు ఊపిన ఆ అరుపు.. మావోరీ ఆదివాసీ తెగల సంప్రదాయ రణన్నినాదమైన ‘హాకా’ అనే నృత్య రూపకం లోనిది! న్యూజీలాండ్ ప్రభుత్వం తీసుకు రాబోతున్న కొత్త బిల్లుకు నిరసనగా, ఆ బిల్లు కాగితాలను రెండుగా చింపి పడేసి, తన సీటును వదిలి రుద్ర తాండవం చేసుకుంటూ పార్లమెంట్ హాల్ మధ్యలోకి వచ్చారు హానా! ఆమెతో జత కలిసేందుకు తమ సీట్లలోంచి పైకి లేచిన మరికొందరు ఎంపీలు ‘హాకా’ డ్యాన్స్ కు స్టెప్పులు వేయటంతో నివ్వెరపోయిన స్పీకర్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేయవలసి వచ్చింది. హానా ‘మావోరీ’ పార్టీకి చెందిన ప్రతిపక్ష ఎంపీ. మావోరీ తెగల హక్కుల పరిరక్షకురాలు. బ్రిటిష్ ప్రభుత్వానికీ, మావోరీలకు మధ్య కుదిరిన 1840 నాటి ‘వైతాంగి ఒప్పందం’ ద్వారా మావోరీలకు సంక్రమిస్తూ వస్తున్న ప్రత్యేక హక్కులను మొత్తం న్యూజీలాండ్ ప్రజలందరికీ వర్తింపజేసేలా మార్పులు చేసిన తాజాబిల్లును మావోరీల తరఫున హానా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతకు సంకేతంగానే పార్లమెంటులో అరుపు అరిచారు. అధికార పక్షాన్ని ఓ చరుపు చరిచి బిల్లు కాగితాలను చింపేశారు.ఈ ఏడాది జనవరిలో కూడా హానా ఇదే అరుపుతో పార్లమెంటు దద్దరిల్లిపోయేలా చేశారు. అంతకు ముందే డిసెంబరులో కొత్తగా ఏర్పాటైన న్యూజిలాండ్ ప్రభుత్వం తొలి పార్లమెంటు సమావేశం లో... మాతృభాషను నేర్చుకోవాలని తహతహలాడుతున్న మావోరీ పిల్లలకు మద్దతుగా ఆమె దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ‘హాకా’ వార్ క్రై నినాదాన్ని ఇచ్చారు. ‘‘నేను మీ కోసం చనిపోతాను. అయితే నేను మీకోసం జీవిస్తాను కూడా..’’ అని పార్లమెంటు సాక్షిగా ఆమె మావోరీ తెగలకు మాట ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం అయిన న్యూజీలాండ్‌లో 67.8 శాతం జనాభా ఉన్న యూరోపియన్ ల తర్వాత 17.8 శాతం జనాభాతో మావోరీలే ద్వితీయ స్థానంలో ఉన్నారు. తక్కిన వారు ఆసియా దేశస్తులు, పసిఫిక్ ప్రజలు, ఆఫ్రికన్ లు, ఇతరులు. తాజామార్పుల బిల్లులో అందరినీ ఒకేగాట కట్టేయటాన్ని మావోరీలకు మాత్రమే ప్రత్యేకమైన పెద్దగొంతుకతో హానా ప్రశ్నిస్తున్నారు. -
‘బహిష్కరణ’పై చర్చ జరగాల్సిందే
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సులు.. అఖిలపక్ష భేటీలో వేడిపుట్టించాయి. ఆ సిఫార్సులపై లోక్‌సభలో తుది నిర్ణయం తీసుకు నేలోపే పార్లమెంట్లో వాటిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీ వాడీవేడీగా జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రియాన్, ఎన్సీపీ నేతలు ఫౌజియా ఖాన్ తదితరులు హాజరయ్యారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో మహువా మొయిత్రాను బహిష్కరించేందుకు వీలుగా లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నివేదికపై పార్లమెంట్ తొలిరోజే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోస్తోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. బహిష్కరణపై తుది నిర్ణయం తీసుకునే ముందు నివేదికపై చర్చ చేపట్టాలని టీఎంసీ నేతలు డిమాండ్ చేశారు. సభలో చర్చ జరక్కుండానే ఎథిక్స్ కమిటీ నివేదిక బహిర్గతం కావడాన్ని వారు నిరసించారు. మహువాపై బహిష్కరణ వేటు తీవ్ర శిక్ష: అధీర్ రంజన్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలన్న యోచన అత్యంత తీవ్రమైనదని, దీని పర్యవసానాలు ఎన్నో రకాలుగా ఉంటాయని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి ఆగ్రహంవ్యక్తంచేశారు. పార్లమెంటరీ కమిటీ నిబంధనలు, ప్రక్రియలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నాలుగు పేజీల లేఖ రాశారు. అఖిలపక్షానికి హాజరుకాలేకపోయిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్ఇండి యా విమానం శనివారం దారి మళ్లింపు కారణంగా పార్లమెంటు అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరుకాలేకపో యింది. ఉదయం 8.10 నిమిషాలకు ఢిల్లీ రావాల్సిన విమానా న్ని విజిబిలిటీ లేని కారణంగా జైపూర్ మళ్లించారు. ఇదే విమానంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణించారు. విమానం దారి మళ్లింపు కారణంగా ఉదయం పార్లమెంటు లైబ్రరీ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకాలేకపోయారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఆమె ఒక్కరే!
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రక బిల్లును లోతుగా పరిశీలించే స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం)లో ఒకే ఒక్క మహిళా ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులో వచ్చింది. విప్లవాత్మకమైన, మహిళల జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకాంశంపై చర్చ జరిగే సమయంలో అతివలకు ఇంత తక్కువ భాగస్వామ్య ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలపై... ఉన్న శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులుండగా దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (రాజ్యసభ) సుస్మితా దేవ్ ఒక్కరే మహిళ. బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు (వైఎస్సార్సీసీ) ఒక్కరికే దీంట్లో ప్రాతినిధ్యం ఉంది. అమ్మాయిల కనీసం వివాహ వయసు పెంపుపై సమతా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం–2006కు మార్పులు తలపెట్టింది. యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్ల పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ (సవరణ) చట్టం–2021 బిల్లును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబరు 21న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. హడావుడిగా బిల్లు తెచ్చారని, లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో ప్రభుత్వం దీనిని స్టాండింగ్ కమిటీకి పంపింది. కమిటీలోని 31 సభ్యుల్లో మీరొక్కరే మహిళ అనే విషయాన్ని సుస్మితా దేవ్ దృష్టికి తీసుకెళ్లగా ‘ఈ బిల్లును పరిశీలించేటపుడు మరింత మంది మహిళా ఎంపీలు ఉంటే బాగుండేది. అయితే ఇదివరకే చెప్పినట్లు భాగస్వామ్యపక్షాల అందరి వాదనలూ వింటాం’ అని ఆమె ఆదివారం స్పందించారు. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే... అమ్మాయి కనీస వివాహ వయసు విషయంలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్ లా’ కూడా వర్తించదు. కనీస వివాహ వయసు 21 ఏళ్లు అన్ని మతాలకూ సమానంగా వర్తిస్తుంది. ఏకరూపత వస్తుంది. మతపరమైన ‘పర్సనల్ లా’ల్లో ఏం నిర్దేశించినా అది ఇక చెల్లుబాటు కాదు. ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ద పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద ఫారిన్ మ్యారేజ్ యాక్ట్‌లకు... బాల్య వివాహ నిషేధ (సవరణ)–2021 సవరణలు చేస్తుంది. ఏకరూపత ఉండేలా కనీస వివాహ వయసును 21 ఏళ్లుగా నిర్దేశిస్తుంది. స్టాండింగ్ కమిటీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగా నియమించలేదు నిజానికి ఈ స్టాండింగ్ కమిటీ బిల్లును పరిశీలించేందుకు ప్రత్యేకంగా నియమించిన కమిటీ కాదు. పార్లమెంటులో మొత్తం 24 శాఖాపరమైన కమిటీలు ఉన్నాయి. ఇవి శాశ్వత కమిటీలు. వీటిల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలిద్దరూ సభ్యులుగా ఉంటారు. ఆయా పార్టీలు తమకు పార్లమెంటులో ఉన్న బలానికి అనుగుణంగా స్టాండింగ్ కమిటీలకు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తాయి. కొన్నింటిని లోక్‌సభ, మరికొన్నింటిని రాజ్యసభ పర్యవేక్షిస్తుంది. సెలక్ట్ కమిటీ, జాయింట్ (సంయుక్త) కమిటీలను ఏదైనా అంశంపై చర్చించాల్సిన వచ్చినపుడు ప్రత్యేకంగా దాని కోసమే ఏర్పాటు చేస్తారు. మహిళల వివాహ వయసును పెంచే బిల్లును పరిశీలించనున్న కమిటీలో 2021 సెప్టెంబరులో రెండు విడతలుగా సభ్యులను నియమించారు. 10 లోక్‌సభ ఎంపీలు, 21 మంది రాజ్యసభ ఎంపీలు దీనిలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో నియామకాలు జరిగిన తర్వాత మహిళలకు సంబంధించిన ఈ కీలక బిల్లును డిసెంబరు 21 లోక్‌సభ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయడం గమనార్హం. సమంజసం కాదు ప్రతిపాదిత బిల్లును పరిశీలించే స్టాండింగ్ కమిటీలో 50 శాతం మంది మహిళలు లేకపోతే అది సమంజసం అనిపించుకోదు. నిబంధనలు అనుమతిస్తే.. ఈ ప్యానెల్‌లోని తమ పురుష ఎంపీలను మార్చి వారి స్థానంలో మహిళా ఎంపీలను నామినేట్ చేయాలని నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలా కుదరని పక్షంలో ఈ కీలకమైన బిల్లుపై చర్చించేటపుడు తమ పార్టీలోని మహిళా ఎంపీలను సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా. – జయా జైట్లీ మరింత మంది ఉండాలి నారీమణులకు సంబంధించిన అంశాలపై చర్చించే ఈ స్టాండింగ్ కమిటీలో మరింత మంది మహిళా ఎంపీలకు ప్రాతినిధ్యం ఉండాలి. సభ్యులు కాని వారినీ చర్చకు పిలిచే అధికారం కమిటీ ఛైర్మన్‌కు ఉంటుంది. భాగస్వామ్యపక్షాలందరినీ కలుపుకొని పోతూ, విస్తృత చర్చ జరగాలంటే ఛైర్మన్ మహిళా ఎంపీలను ఆహ్వానించవచ్చు. ఈ కీలక చర్చలో మహిళా ఎంపీల భాగస్వామ్యం మరింత ఉండాలని కోరుకుంటున్నాను. – సుప్రియా సూలే, లోక్‌సభ ఎంపీ -
ఖతర్నాక్ మహిళా ఎంపీ
ఢాకా : ప్రపంచవ్యాప్తంగా ఓ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతారు. కానీ బంగ్లాదేశ్ ఎంపీ తమన్నా నస్రత్ తన లాంటి పోలికలు కలిగిన ఎనిమిది మందిని వెతికి పట్టుకున్నారు. అందులోను ఒక్క బంగ్లాదేశ్‌లోనే. బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్శిటీలో ‘బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ’ చదువుతున్న తమన్నా తాను రాయల్సిన 13 పరీక్షల కోసం ఈ ఎనిమిదిని ఎంపిక చేసుకున్నారు. వారికి వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ కూడా ఇప్పించారు. తనకు బదులుగా తనలాగా పోలికలున్న వారిని ఓపెన్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్‌కు పంపిస్తూ వచ్చారు. ఎవరికి అనుమానం రాకుండా ఎంపీగా తనకుండే బాడీ గార్డులను కూడా తన నకిలీల వెంట పరీక్ష హాల్లకు పంపిస్తూ వచ్చారు. కొన్ని పరీక్షలు ఆ డూప్‌లు ఎలాంటి అవాంతరాలు లేకుండానే తమన్నా తరఫున రాయగలిగారు. ఎంత ఎంపీగారి పోలికలున్నా తోటి విద్యార్థులు గుర్తు పడతారుకదా! మొదట్లో ఎంపీకి డూపులు వస్తున్నారని విద్యార్థులు గుర్తించారు. ఉన్నత స్థానంలో ఉన్న ధనిక కుటుంబానికి చెందిన ఎంపీ జోలికి తామెళ్లడం ఎందుకులే అనుకొని ఊరుకున్నారు. చివరికి ఆ నోట, ఈనోట ఆ విషయం బంగ్లాదేశ్ ప్రభుత్వ ‘నాగరిక్ టీవీ’కి తెల్సింది. టీవీ సిబ్బంది పరీక్ష కేంద్రానికి వెళ్లి తమన్నా గెటప్‌లో పరీక్ష రాస్తున్న ఓ డూప్‌ను పట్టుకొని విచారించారు. ముందుగా తానే తమన్నా అంటూ సమర్థించుకున్న ఆ డూప్ టీవీ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరై నిజం చెప్పేశారు. తానే కాకుండా తనలాంటి వాళ్లు మొత్తం ఎనిమిది మంది ఉన్నారని ఆమె చెప్పారు. ఆ డూప్‌లపై ఎలాంటి చర్య తీసుకున్నారో తెలియదుగానీ, ఎంపీ తమన్నాను మాత్రం యూనివర్శిటీ నుంచి బహిష్కరించినట్లు యూనివర్శిటీ హెడ్ ఎంఏ మన్నన్ తెలిపారు. తమన్నా అధికారంలో ఉన్న అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అవడంతో ఆమెపై ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. -
తనలాగా ఉన్న 8మందితో పరీక్షలు
ఢాకా: బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు వర్సిటీ పరీక్షలను తన పోలికలతో ఉన్న 8మంది మహిళలతో రాయించారు. ఈ విషయం మీడియా బయటపెట్టడంతో ఆమెను వర్సిటీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ తమన్నా నుస్రత్ బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నారు. ఇందులో భాగంగా 13 సబ్జెకుల పరీక్షలు రాసేందుకు తన మాదిరిగానే ఉన్న 8 మంది మహిళలను వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని నాగరిక్ టీవీ అనే చానెల్ బయట పెట్టింది. పరీక్షలు రాస్తున్న సమయంలో వారికి ఎంపీ అనుచరులు కాపలాగా ఉన్నారని తెలిపింది. స్పందించిన వర్సిటీ అధికారులు ఎంపీ నుస్రత్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. -
చిక్కుల్లో మంత్రి, ఎంపీ
► ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని మంత్రి ప్రలోభం ► మహిళా ఎంపీ వాట్సాప్‌లో దుర్భాషలు ► ఆలయాల చుట్టూ తిరుగుతున్న శశికళ చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నిక లు సమీపిస్తున్న వేళ అన్నాడీఎంకేలో లుకలుకలు తరచూ తెరపైకి వస్తున్నాయి. మంత్రి రమణ ఉదంతం నుంచి ఇంకా తేరుకోకముందే మరో మంత్రి వివాదాల్లో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే టికెట్టు ఆశచూపి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో ఎడప్పాడి పళనిస్వామికి ముప్పు పొంచి ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే అన్నాడీఎంకే ఎంపీ సత్యభామ తన భర్తను దుర్భాషలాడినట్లుగా వాట్సాప్‌లో జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది. పాడిపరిశ్రమాభివృద్ధి మంత్రి రమణ తన సతీమణితో ఏకాంతంగా దిగిన ఫొటోలు వాట్సాప్‌లో హల్చల్ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జయలలిత ఆయనపై వేటువేశారు. మంత్రి పదవితోపాటు పార్టీ పదవిని సైతం రమణ కోల్పోయారు. మంత్రులు ఓ పన్నీర్ సెల్వం, నత్తం విశ్వనాథం అనుచరులపై అమ్మ వేటువేయడం ద్వారా పార్టీ వ్యవహారాల్లో తన కచ్చితమైన వైఖరిని తేటతెల్లం చేశారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే నుండి అసెంబ్లీకి పోటీచేయగోరు అభ్యర్దులు పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, వారికి తాను సిఫార్సు చేసి టిక్కెట్టు మంజూరు అయ్యేలా చూస్తానని మంత్రి ఎడప్పాడి పళనిస్వామి కొందరితో బేరాలు కుదుర్చుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చైన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఒక బృందం శుక్రవారం సాయంత్రం ఆత్తూరుకు చేరుకుని ఎడప్పాడి ముఖ్య అనుచరుడు, సహకార బ్యాంకు అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఒక నేత ఇంటిలో తనిఖీలు నిర్వహించింది. తనిఖీలు నిర్వహించన సమయంలో సదరు నేత ఇంటిలో లేడు. తనిఖీలు పూర్తిచేసుకున్న ఆ బృందం కొన్ని ఆధారాలతో కూడిన పత్రాలతో రాత్రికి రాత్రే చెన్నైకి చేరుకుంది. పార్టీ ప్రచార సభలో ఉన్న మంత్రి అనుచరుడు అత్యవసరంగా చెన్నై వెళ్లాలని చెప్పి కేవలం మూడు నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించాడు. సేలం జిల్లాలోని 11 నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారితో మంత్రి అనుచరులు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలియడం వల్లనే తనిఖీలు సాగాయని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. మహిళా ఎంపీ కలకలం తిరుప్పూరు పార్లమెంటు సభ్యురాలు (అన్నాడీఎంకే) సత్యభామ తన భర్త వాసుతో ఆస్తులు, అప్పులు, వాహనాల వ్యవహరంలో తగవులాడినట్లుగా వాట్సాప్‌లో సంభాషణ కలకలం సృష్టించింది. ‘నీవు హద్దుమీరి వ్యవహరిస్తున్నావు, ఎటువంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కొనేందుకు సిద్ధం... నా చేతిలో అధికారం ఉంది.. ఇలా సాగిన సంభాషణ శ్రుతి మించి వారిద్దరి సన్నిహితుల పట్ల పరస్పర ‘శీల’ విమర్శల స్థాయికి చేరుకుంది. ఎంపీ సత్యభామ, భ ర్త వాసుల మధ్య జరిగినట్లుగా భావిస్తున్న సంభాషణలు ఒక తమిళ సాయంకాల దినపత్రికలో ఎంపీ ఫొటోతోపాటు యథాతథంగా ప్రచారం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ నేతలుగా వ్యవహరిస్తున్నవారు ప్రతిష్టను బజారుకీడ్చడాన్ని సహించలేకనే రమణపై జయ వేటు వేసారు. మరి తాజాగా సాగుతున్న వివాదాస్పంద అంశాలపై అమ్మ ఏమి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతలు వణికిపోతున్నారు. శశికళ పూజలు తన స్నేహితురాలు, ముఖ్యమంత్రి జయలలిత కోసమా లేక తాను ఎమ్మెల్యే అయ్యేందుకా అనేది స్పష్టం కాకున్నా శశికళ ఇటీవల ఆలయాల చుట్టూ తీవ్రంగా తిరుగుతున్నారు. గతంలో మధురై, పళని ఆలయాల్లో పూజలు పూర్తిచేసుకున్న శశికళ తాజాగా తిరుచ్చిరాపల్లిలోని శ్రీరంగనాధస్వామి వారిని సేవించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత శ్రీరంగం నియోజకవర్గం నుండే గెలుపొంది, ఆస్తుల కేసులో జైలు శిక్ష కారణంగా ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. చెన్నై నగరం ఆర్కేనగర్ నుండి ప్రస్తుతం జయలలిత ప్రాతినిధ్యం వహిస్తుండగా జయ తాజా మాజీ నియోజకర్గంలోని శ్రీరంగంలో శశికళ పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీరంగం ఆలయంలో గడిపి సాయంత్రానికి శివగంగై జిల్లా తిరుగోష్ట్టియూరులోని ఆలయానికి చేరుకుని పెరుమాళ్, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ఇదే ఆలయానికి సమీపంలోని పురీశ్వరన్ ఆలయంలో బాల కాలభైరవ స్వామికి పూజలు చేశారు. ఈ ఆలయంలో శివుడు మూల విరాట్టుగా ఉన్నా బాల కాలభైరవ స్వామికే ప్రాధాన్యత ఎక్కువ. చోళరాజుల కాలంలో యుద్దాలకు బయలుదేరే ముందు విజయం కోసం పూజలు చేయడం ఆనవాయితీ ఉండేది. నేడు ఎన్నికల్లో అదే విజయాన్ని ఆశిస్తూ శశికళ పూజలు నిర్వహించడం గమనార్హం. అక్కడి నుంచి పిళ్లయార్ పట్టి వినాయకుని సన్నిధిలో పూజలు జరిపారు. శశికళతోపాటు ఆమె అన్నకుమార్తె ప్రభావతి కూడా ఉన్నారు. అన్ని ఆలయాల్లోనూ శశికళకు భారీ స్థాయిలో స్వాగత సత్కారాలు అందాయి. కేవలం ఒక్కరోజులో నాలుగు ఆలయాల్లో పూజలు నిర్వహించడం ఎన్నికల్లో గెలుపుకోసమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.