
ఆరు దశాబ్దాల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (New Income Tax Bill) లోక్‌సభలో వచ్చే వారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ఎగువసభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో బడ్జెట్ అనంతర సంప్రదాయ సమావేశంలో ప్రసంగించిన తర్వాత సీతారామన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేసిన తర్వాత బిల్లు మళ్లీ కేబినెట్‌కు వెళ్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెడతారని మంత్రి చెప్పారు. బిల్లు విషయంలో తనకు ఇంకా మూడు క్లిష్ట దశలు ఉన్నాయని అన్నారు.
‘రెండు సంవత్సరాల క్రితం కూడా కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి కొన్ని హేతుబద్ధీకరించాం. భారత్‌ను మరింత పెట్టుబడిదారులు, వాణిజ్య స్నేహపూర్వకంగా మార్చాలనుకుంటున్నాం. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్‌తో సమతుల్యం చేయాలనుకుంటున్నాం. పరిశ్రమకు అవసరమైన విధంగా సుంకాల రక్షణను అందిస్తాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.
