► ఉమ్మడి జిల్లా అంతటా గన్నీ సంచుల కొరత
► ఆయా మార్కెట్లలో నిలిచిపోయిన కందుల కొనుగోళ్లు
► నాలుగేసి రోజులు యార్డుల్లోనే ఉంటున్న రైతులు
కంది రైతులకు కష్టమొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో గన్నీ సంచుల కొరత ఏర్పడడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు పంటను విక్రయించుకునేందుకు నిద్రహారాలు మాని రోజుల తరబడి మార్కెట్‌లో పడిగాపులుకాయాల్సిన పరిస్థితి
దాపురించింది. – ఆదిలాబాద్ రూరల్
ప్రభుత్వ సూచన మేరకు ఈ ఖరీఫ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు పత్తి సాగు తగ్గించి పప్పుదినుసుల సాగు పెంచారు. ప్రధానంగా కందిని వివిధ పంటల్లో అంతర పంటగా సాగు చేశారు. గత ఖరీఫ్ సీజన్ లో సుమారు ఉమ్మడి జిల్లాలో 46వేల హెక్టార్లు కది సాగైతే ఈ ఖరీఫ్‌లో 90వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా పంట సాగైంది. దిగుబడి బాగానే వచ్చింది. దీంతో కందులను ఆయా జిల్లాల్లో మార్క్‌ఫెడ్, హకా ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుండగా, నిర్మల్ జిల్లాలో హకా ఆధ్వర్యంలో కొంటున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు
రైతులు పండించిన కంది పంటను విక్రయించేందుకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పలు మండల కేంద్రాల్లో కంది కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాని అధికారుల్లో ముందు చూపు కొరవడింది. కంది పంట కొనుగోళ్లుకు అవసరమైన గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు మార్కెట్ యార్డుల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లిలో కందులు కొనుగోళ్లు చేస్తున్నారు. కుమురం భీం జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లిలో, నిర్మల్ జిల్లాలో భైంసా, కాగజ్‌నగర్, ఖానాపూర్, కుభీర్‌లో కొనుగోళ్లు జరుగుతున్నాయి.
గన్నీ సంచుల కొరత..
కందులు కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా జిల్లాలకు సరిపడా గన్నీ సంచులు సరఫరా చేయలేదు. దీంతో అంతటా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాకు 2,50,000, మంచిర్యాల జిల్లాకు 15వేలు, కుమురం భీం 20వేలు, నిర్మల్ జిల్లాకు సుమారు లక్ష వరకు గన్నీ బ్యాగులు సరఫరా చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా గన్నీ సంచుల సరఫరా లేకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు యార్డులో నిద్రించాల్సిన పరిస్థితి దాపురించింది. పప్పు దినుసుల సాగు పెంచాలని సూచనలు చేసిన ప్రభుత్వం ముందస్తుగా గన్నీ బ్యాగులు ఎందుకు ఉంచలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
దళారులకే ప్రాధాన్యం
కంది పంట అధికంగా సాగు చేసిన రైతులు ఆయా మార్కెట్లకు పంటను విక్రయానికి తెస్తే దళారులు అంటున్నారని, అదే దళారులు బయట కొనుగోళ్లు చేసుకొని విక్రయానికి వస్తే అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు రైతులు అంటున్నారు. కానీ అసలైన రైతు అధిక మొత్తంలో కందిని తీసుకొస్తే లేనిపోని ఆరోపణలు చేస్తూ కొనగోలుకు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ సంచులు అందుబాటులో ఉంచి కందులు కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు.
యార్డుల్లో పడిగాపులు
Published Sat, Mar 4 2017 10:47 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
Advertisement