ఆదిలాబాద్ అర్బన్ : మరో వారం రోజుల్లో వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. 2014-15 ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన వరిధాన్యం మరో వారంలో విక్రయించవచ్చు. ఈ ఖరీఫ్‌లో 92,500 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికోసం ఆయా కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్, రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం కొనుగోలు చేయనున్నారు.
మార్కెట్‌కు వచ్చే ధాన్యంలో మిల్లర్లు కొంత ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని అధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు కొనుగోలు చేసిన దాంట్లో 25శాతం లెవీ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ.1,400, కామన్ రకానికి రూ.1,360 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. గతేడాది రబీలో పండించిన వరి ధాన్యం నిల్వకు సరిపడా గోదాములు లేక పక్క నిజామాబాద్ రైస్‌మిల్లర్లకు కొనుగోలు బాధ్యత అప్పగించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్తగా గోదాముల కోసం పర్యవేక్షిస్తున్నారు.
179 కొనుగోలు కేంద్రాలు..
జిల్లా వ్యాప్తంగా 179 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 105 కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ 62, డీసీఎంఎస్ ద్వారా 12 కేంద్రాల్లో కొనుగోలు జరుపనున్నారు. గన్నీ బ్యాగులను సైతం సమకూర్చుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే.. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత రైస్ మిల్లర్లకు రవాణా చేయాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా సంబంధిత తహశీల్దార్లు, ఆర్డీవోలు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. దీంతోపాటు రైస్ మిల్లర్ల యజమానులు సైతం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. మిల్లర్లు ధాన్యం కొనేందుకు ఆయా రైస్‌మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెస్పీ ధర ప్రకారంగానే రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
నిబంధనలివీ..
క్వింటాల్ గ్రేడ్-ఏ వరిధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,400, కామన్ రకానికి రూ.1,360 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నాణ్యతకు సంబంధించి కూడా నిబంధనలు విధించింది. ధాన్యంలో తేమ 18 శాతానికి మించకూడదు.
వ్యర్థాలు ఒక శాతం, చెత్త, తప్పలు ఒక శాతం, రంగుమారిన, పురుగు తిన్న, మొలకెత్తిన ధాన్యం 4 శాతం, పూర్తిగా తయారు కానీ, కుంచించుకుపోయిన ధాన్యం 3 శాతం, కల్తీరకం ధాన్యం 6 శాతం వరకు కోత విధించాలనే నిబంధన ఉంది. వీటిలో ఏ ఒక్కశాతం పెరిగినా ప్రభుత్వం నిర్ణయించిన ధరలో కోత పడుతుంది.
వారంలో ధాన్యం కొనుగోళ్లు..
Published Thu, Nov 6 2014 2:21 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement