సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం తలపెట్టిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడం రైతులను కలవరపెడుతోంది. చాలా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుకాకపోవ డంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఓవైపు రుతుపవనాలు సమీపిస్తుండటం, రబీ సీజన్ మొదలవుతుండటం.. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా అమ్ముడుపోకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. మిల్లర్లు కుమ్మక్కై చాలాచోట్ల క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోత పెడుతున్నారు. అయినా సరే రైతులు కోతలకు సమ్మతించినా.. మిల్లర్లు చాలా చోట్ల కొర్రీలు పెడుతుండటం, ధాన్యాన్ని మిల్లుల్లో దింపకుండా అలాగే ఉంచడంతో లారీలు కొనుగోలు కేంద్రాలకు సరిగా వెళ్లడం లేదు. దీంతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొంటోంది.
మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల దూరంలో..
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 62.16 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీలు) ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,192 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూన్ 6 నాటికి అందులో 3,181 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయింది.
కానీ, మధ్యలో మిల్లర్ల కొర్రీలు, అకాల వర్షాలు, లారీల కొరత తదితర కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 57.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, మరో 4.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ధాన్యం విలువ రూ.11,843 కోట్లుగా ఉంది.
ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా?
ఏరువాక ఉత్సవాలతో రబీ సీజన్ మొదలైంది. ఈసారి రబీని నవంబరు నాటికి పూర్తి చేసి, యాసంగి పంట కోతలను మార్చి నాటికి ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి వేసవిలో అకాల వర్షాలు రైతులకు గత వందేళ్లలో ఏనాడూ చూడని నష్టాన్ని కలగజేశాయి. దీనికితోడు వేసవిలో కోతలు ఏప్రిల్ వరకు సాగితే, వరి నుంచి మర ఆడిస్తే నూక అధికంగా వస్తుంది.
ఈ సమస్యలను అధిగమించి మార్చి నాటికి కోతలను ముగిస్తే.. రైతుకు ప్రకృతి విపత్తులు, నూకల బెడద తప్పుతుందన్నది ప్రభుత్వ వ్యూహం. కానీ, కొనుగోళ్ల ప్రక్రియ జాప్యమవడంతో రబీ, యాసంగి సీజన్‌ల పంట ఆలస్యమయ్యే ప్రమాదముందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడు రోజుల్లో పూర్తి
మరో మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. ఎక్కడా రైతులకు ఇబ్బంది రానీయం. 95% ధాన్యం కొనుగోలు చేశాం. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమవుతాయి. –మంత్రి గంగుల కమలాకర్
కొనుగోళ్ల వేగం పెంచాం
రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంగళవారం ఒక్కరోజే 1,31,703 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అకాల వర్షాలు, సాంకేతిక సమస్యల కారణంగా కొంచెం జాప్యమైన మాట వాస్తవమే. రెండు మూడు రోజుల్లో మిగిలిన 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సైతం కొనేస్తాం.
–సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల శాఖ, చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment