గుండాల: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కార ణంగా రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాల పాలవుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు.
అనంతరం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మాటముచ్చట సమావేశంలో మాట్లాడుతూ.. వరి కోతలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని పక్షం రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించినా చాలాచోట్ల మొదలుకాలేదన్నారు.
ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నా.. రైతులు నష్టపోకుండా వడ్ల సంగతి తేల్చాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఔరంగాబాద్‌లో కాదని.. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి చూడాలని, అక్కడ మార్కెట్లలోకి వచ్చిన ధాన్యాన్ని గంటలోనే మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ఇది నిజం కానట్లయితే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. నిజమైతే నీ పదవికి రాజీనామా చేస్తావా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సమ్మేళనాలు పెట్టి ప్రజల ప్రాణాలతో బీఆర్‌ఎస్ చెలగాటమాడుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment