కరుణించేనా.. ఖరీఫ్ కలిసొచ్చేనా..!
ఆదిలాబాద్ అగ్రికల్చర్: ఖరీఫ్ సాగు కర్షకులను భయపెడుతోంది.. ఏటా అన్నదాతను ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్లుగా పంటలు నష్టపోతూనే ఉ న్నారు. దీంతో పంట పండితే పటే ల్.. పంట లేకుంటే పాలేరు అన్న చందంగా తయారైంది వారి పరిస్థి తి. ఏటా పెట్టుబడి కూడా ఎళ్లని ప రిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులు రూ.518 కోట్ల మేర అర్థికంగా నష్టపోయారు. 246 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ వర్షపా తం కంటే 32 శాతం లోటుగా న మోదైంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు పడుతున్నా.. వాటితో లాభం లేకుండాపోయింది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులు 4.50 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు.. ప్రధానంగా పత్తి, తరువాత సోయా, వరి పంటలు సాగు చేస్తారు. జిల్లాలో సాగు నీటి సౌకర్యాలు అవసరం మేరకు లేకపోవడంతో 80 శాతం వర్షాధారంగానే పంటలు సాగవుతాయి. ప్రకృతి కరుణిస్తే పండినట్లు.. లేకుంటే ఎండినట్లుగా ఐదేళ్లుగా ఆపసోపాలు పడుతున్నారు.
అయినా.. నేలనే నమ్ముకున్న రైతన్న ఈ ఏడాదైనా కలిసి వస్తుందేమోనని ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నాడు. రోహిణి కార్తె ప్రారంభం నుంచే పనులు ప్రారంభించారు. జిల్లాలో ఈ ఏడాది 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే మృగశిర కార్తె నుంచి వ్యవసాయ పనులు వేగవంతం అయ్యాయి. కొద్ది రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో 70 వేల హెక్టార్లలో పత్తి, 20 వేల హెక్టార్లలో సోయాబీన్, మరో 10 వేల హెక్టార్లలో తదితర పంటలు సాగు చేశారు. ఆరంభంలో అడపాదడపా వర్షాలు పడుతున్నా.. మున్ముందు ఎలా ఉంటాయో అని వారిలో ఆందోళన మొదలైంది.
కష్టాల కడలి నుంచి గట్టెక్కేనా..!
ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో పంట దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా కుంగిపోయారు. దీనికితోడు పరిహారం అందించడంలో జాప్యం.. అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన పంటలకు బీమా వర్తింకపోవడం.. బ్యాంకర్లు నామమాత్రంగా రుణాలు ఇవ్వడం.. మద్దతు ధర అంతంతమాత్రంగానే ఉండడం.. ఫలితంగా రైతులు సాగు కోసం ప్రైవేటు అప్పులే చేయాల్సి వస్తోంది. దీంతో ఆ అప్పులను తీర్చేదారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది రైతులు వ్యవసాయం దండగా అని కాడెడ్లను సైతం అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. పంట భూములను బీడుగా వదిలివేస్తున్న దృశ్యాలూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లోనైనా కాలం కనికరించాలని రైతులు కోరుతున్నారు.
నాలుగేళ్లుగా నష్టమే..
ఏటా పత్తి సాగు చేస్తునే ఉన్న ఒక ఏడాది తుఫాన్లు, అధిక వర్షాలతో పంట నీటిలో మునిగింది. మరో ఏడాది వర్షాలు లేక పంట ఎండిపోయింది. నాలుగేళ్లుగా నష్టమే మిగులుతోంది. ఈ ఏడాదైనా కాలం కరుణించి దిగుబడి వస్తే గట్టెక్కుతాం.
- మన్నె సంతోభ, దాబి(బి) ఇచ్చోడ.