Kandi farmer
-
యార్డుల్లో పడిగాపులు
► ఉమ్మడి జిల్లా అంతటా గన్నీ సంచుల కొరత ► ఆయా మార్కెట్లలో నిలిచిపోయిన కందుల కొనుగోళ్లు ► నాలుగేసి రోజులు యార్డుల్లోనే ఉంటున్న రైతులు కంది రైతులకు కష్టమొచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో గన్నీ సంచుల కొరత ఏర్పడడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు పంటను విక్రయించుకునేందుకు నిద్రహారాలు మాని రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులుకాయాల్సిన పరిస్థితి దాపురించింది. – ఆదిలాబాద్ రూరల్ ప్రభుత్వ సూచన మేరకు ఈ ఖరీఫ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు పత్తి సాగు తగ్గించి పప్పుదినుసుల సాగు పెంచారు. ప్రధానంగా కందిని వివిధ పంటల్లో అంతర పంటగా సాగు చేశారు. గత ఖరీఫ్ సీజన్ లో సుమారు ఉమ్మడి జిల్లాలో 46వేల హెక్టార్లు కది సాగైతే ఈ ఖరీఫ్‌లో 90వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోనే అధికంగా పంట సాగైంది. దిగుబడి బాగానే వచ్చింది. దీంతో కందులను ఆయా జిల్లాల్లో మార్క్‌ఫెడ్, హకా ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుండగా, నిర్మల్ జిల్లాలో హకా ఆధ్వర్యంలో కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు రైతులు పండించిన కంది పంటను విక్రయించేందుకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పలు మండల కేంద్రాల్లో కంది కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాని అధికారుల్లో ముందు చూపు కొరవడింది. కంది పంట కొనుగోళ్లుకు అవసరమైన గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు మార్కెట్ యార్డుల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లిలో కందులు కొనుగోళ్లు చేస్తున్నారు. కుమురం భీం జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లిలో, నిర్మల్ జిల్లాలో భైంసా, కాగజ్‌నగర్, ఖానాపూర్, కుభీర్‌లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. గన్నీ సంచుల కొరత.. కందులు కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా జిల్లాలకు సరిపడా గన్నీ సంచులు సరఫరా చేయలేదు. దీంతో అంతటా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాకు 2,50,000, మంచిర్యాల జిల్లాకు 15వేలు, కుమురం భీం 20వేలు, నిర్మల్ జిల్లాకు సుమారు లక్ష వరకు గన్నీ బ్యాగులు సరఫరా చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా గన్నీ సంచుల సరఫరా లేకపోవడంతో రైతులు నాలుగేసి రోజులు యార్డులో నిద్రించాల్సిన పరిస్థితి దాపురించింది. పప్పు దినుసుల సాగు పెంచాలని సూచనలు చేసిన ప్రభుత్వం ముందస్తుగా గన్నీ బ్యాగులు ఎందుకు ఉంచలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. దళారులకే ప్రాధాన్యం కంది పంట అధికంగా సాగు చేసిన రైతులు ఆయా మార్కెట్లకు పంటను విక్రయానికి తెస్తే దళారులు అంటున్నారని, అదే దళారులు బయట కొనుగోళ్లు చేసుకొని విక్రయానికి వస్తే అలాంటి వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు రైతులు అంటున్నారు. కానీ అసలైన రైతు అధిక మొత్తంలో కందిని తీసుకొస్తే లేనిపోని ఆరోపణలు చేస్తూ కొనగోలుకు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ సంచులు అందుబాటులో ఉంచి కందులు కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు. -
నాలుగైదు రోజుల్లో ‘కంది’ బకాయిల చెల్లింపు
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం • కంది సాగు పెరగడంతో ఆశించిన ధర రావడం లేదు • ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలూ కారణమే • పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలి • దిగుమతులపై సుంకాలు విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కంది రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ తదితర ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి కంది పంటను కొనుగోలు చేసినా సొమ్ము చెల్లించని వైనాన్ని వివరిస్తూ.. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పైసలేవి సారూ!’ కథనంపై ఆయన స్పం దించారు. కంది క్రయ విక్రయాలు, వ్యవ సాయ మార్కెట్లలో తాజా పరిస్థితిపై సమీక్షించారు. చిట్టచివరి గింజ వరకు కంది కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 90 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 74 వేల టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నాఫెడ్ సంస్థ 49వేల టన్నులు కొనుగోలు చేసిందని, ఎఫ్‌సీఐ 25 వేల టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగు పెరగడంతో.. రాష్ట్రంలో ఇంతకు ముందు 2.47 లక్షల హెక్టార్ల కంది సాగు జరిగేదని, ఇప్పుడు 4.35 లక్షల హెక్టార్లకు పెరగడంతో.. రైతులకు ఆశించిన ధర లభించడం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం దని చెప్పారు. కంది తదితర పంటల మార్కెట్ ధరలను కేంద్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయ న్నారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధిం చి మొజాంబిక్, టాంజానియా, మయన్మార్ తదితర ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తెలంగాణ కంది రైతులకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. 2016–17లో లక్ష టన్నులు, మరో మూడేళ్లలో 2 లక్షల టన్నుల కందిని దిగుమతి చేసు కోవడానికి కేంద్రం ఎంవోయూ చేసుకోవడం, శనగలు మినహా మిగతా పప్పు ధాన్యాల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వ 2006 ఎగుమతి విధానంలో నిషేధించడంతో ఈ సమస్య తలె త్తిందన్నారు. అంతేగాకుండా పప్పు ధాన్యాల దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని, దిగుమతులపై సుంకాన్ని పెంచితేనే దేశంలోని రైతులకు మంచి ధర లభిస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాను ఇదివరకే లేఖ రాశానని మంత్రి వెల్లడించారు. పప్పుధాన్యాల ఎగుమతి విధానాన్ని సులభతరం చేయాలని.. నిల్వలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ ఈసారి భారీగా కంది దిగుబడులు వచ్చినందున మార్కెట్లో ధర తగ్గినట్టు మంత్రి విశ్లేషించారు. కంది రైతుల సమస్యలు, ఫిర్యాదుల కోసం జనవరి 21న ప్రారంభించిన కాల్ సెంటర్ పనితీరును సమీక్షించారు. దీనికి ఇప్పటివరకు 305కు పైగా ఫిర్యాదులు అందినట్టు మార్కెటింగ్ అధికారులు మంత్రి దృష్టికి తీసు కొచ్చారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్య లు తీసుకోవాలని హరీశ్ ఆదేశించారు.