- ధరల పరిస్థితిపై అధికార యంత్రాంగం ఆందోళన
- సాగు అధికమైతే ధరలు పడిపోయే ప్రమాదముందన్న నిపుణులు
- ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాగయిన వివిధ పంటలు (ఎకరాల్లో) 10.10 కోట్లు
- ఇందులో పత్తి సాగు(ఎకరాల్లో) 1.79 కోట్లు
- రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైన పత్తి (ఎకరాల్లో) 30 లక్షలు
- 2016–17లో దేశవ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) 1.69 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతులంతా పత్తి బాట పట్టారు. గతేడాది పత్తి పంటకు మార్కెట్లో మంచి ధర పలకడంతో ఇప్పుడు రైతులు తెల్ల బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది కంది, మిర్చి వంటి పంటల ధరలు పతనం కావడంతో పత్తి పంటే మేలన్న భావన రైతుల్లో నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10.10కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తెలంగాణ అన్నదాతలంతా మూకుమ్మడిగా పత్తి వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగు కాగా, అందులో 30.85 లక్షల ఎకరాల్లో పత్తి వేయడం విస్మయానికి గురి చేస్తోంది.
అధిక సాగుతో ధర పతనంపై ఆందోళన...
అంతర్జాతీయంగా పత్తి ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలని గతేడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీంతో రైతులు సోయా, పప్పుధాన్యాలు సాగు చేశారు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తారుమారైంది. గత ఏడాది పత్తికి మార్కెట్లో రెట్టింపు స్థాయిలో ధర పలకడంతో రైతులు, అధికారులు కంగుతిన్నారు. దానికి తోడు సోయా, కంది, పెసర పంటల ధరలు మార్కెట్లో పతనమయ్యాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు కాగా... 2015–16లో 41.71 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ప్రభుత్వం పత్తిని నిరుత్సాహపరచడంతో 2016–17లో 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. పరిస్థితి తిరగబడడంతో ప్రభుత్వం గతేడాది వద్దన్న పంటలనే ఈసారి ప్రోత్సహిస్తోంది.
ఇదిలా ఉండగా పత్తి విషయంలో ఇప్పుడు 2015–16 నాటి పరిస్థితి పునరావృతమవుతుందా అన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. అప్పట్లో పత్తి పెద్ద ఎత్తున సాగైంది. దీంతో ధర రూ.3,700 వరకు పడిపో యింది. కనీస మద్దతు ధర గరిష్టంగా క్వింటాలుకు రూ. 4,050 నిర్ణయించగా, వ్యాపారులు రూ. 3,600కు మించి కొ నుగోలు చేయలేదు. సీసీఐ కూడా చేతులెత్తేసింది. ఇలా ఒక ఏడాది సాగు పెరిగితే ధర పడిపోవడం, మరో ఏడాది సాగు తగ్గితే దాని ధర పెరగడంతో ఈ సారీ అలా జరుగుతుం దేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయంగా అదనపు పత్తి...
అంతర్జాతీయంగా పత్తి అధికంగా ఉత్పత్తి అవుతోంది. చైనా, అమెరికా దేశాల్లో ఉత్పత్తి అధికంగా ఉంది. మన దేశం నుంచి చైనా గతంలో పత్తి దిగుమతి చేసుకునేది కానీ క్రమంగా నిలిపివేసింది. అమెరికాలో ఎక్కువగా నాన్ కాటన్ బట్టలవైపే మొగ్గుచూపుతుండడతో అక్కడా ఇతర దేశాలకే ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు దేశంలో పత్తిసాగు రైతులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
అప్రమత్తమైన రాష్ట్రం
పత్తి సాగు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈసారి అధికంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఇటీవల కేంద్రానికి విన్నవించారు. పత్తి సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ఈసారి ధరలు తగ్గే ప్రమాదముందని రైతు సంఘం జాతీయ నేత సారంపల్లి మల్లారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణుడు నర్సింహారెడ్డి అభిప్రాయపడుతున్నారు.
పడిపోతున్న పప్పుధాన్యాల సాగు...
రైతులు పెద్ద ఎత్తున పత్తి వైపే మరలిపోతుండటంతో పప్పు ధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 7.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈసారి కేవలం 4.82 లక్షల ఎకరాలకే వాటి సాగు పరిమితమైంది.