లెక్క తప్పిన మక్క!
- క్వింటాలుకు ఉన్నట్టుండి రూ.400 తగ్గుదల
- కుమ్మక్కై రైతుల్ని ముంచుతున్న వ్యాపారులు
- ఏనుమాముల మార్కెట్‌లో ఆందోళనకు దిగిన రైతులు
- నిజామాబాద్‌లో మార్కెట్ కార్యాలయం ముట్టడి
సాక్షి, వరంగల్: మార్కెట్ మాయాజాలం రైతులను మళ్లీ ముంచేస్తోంది. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర గగనంగా మారింది. కష్టపడి పండించిన పంట చేతికి రాగానే ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. వ్యాపారులంతా కుమ్మక్కై ధరలు నిర్ణయించి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన మార్కెటింగ్ అధికారులు, పాలకవర్గం ప్రతినిధులు కన్నెత్తి కూడా చూడడం లేదు. కష్టపడి పండించిన పంటకు క్వింటాలుకు ఒక్కసారిగా రూ.400 మేర ధర తగ్గడంతో కడుపు మండిన రైతన్నలు ఆందోళనలకు దిగుతున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర కోసం సోమవారం ఆందోళన చేశారు.
ఎక్కువ పంట రాగానే ఒక్కటయ్యారు
ఖరీఫ్ వ్యవసాయ మార్కెట్ సీజన్ ఏటా అక్టోబర్ 1న మొదలై మరుసటి ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. 2016-17 ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.1,365 కనీస మద్దతు ధరను ఖరారు చేసింది. సెప్టెంబర్ ఆఖరు వరకు మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1,901 చొప్పున గరిష్ట ధర పలికింది. వారం క్రితం వరకు కూడా క్వింటాల్‌కు రూ.1,850 వరకు పలికిన మక్క ధర ఒక్కసారిగా తగ్గడంతో రైతులు ఆందోళనకు దిగారు.
అధికారులకు తప్పుడు సమాచారం
ప్రతిరోజు ఉదయం మార్కెట్ అధికారులు పంటల వారీగా ధరలు ఖరారు చేసి ఉన్నతా దికారులకు నివేదిస్తారు. వరంగల్ మార్కెట్ అధికారులు సోమవారం ఉదయం మొక్కజొన్న గరిష్టధర రూ.1,445, కనిష్ట ధర రూ.1,060గా పేర్కొన్నారు. కానీ సాయంత్రానికి గరిష్ట ధర రూ.1,445, కనిష్ట ధర రూ.1,375గా పేర్కొన్నారు. ఉదయం ఖరారైన కనిష్ట ధర విషయాన్ని ప్రభుత్వానికి, మార్కెటింగ్ ఉన్నతాధికారులకు తెలియకూడదనే ఉద్దేశంతోనే వరంగల్ మార్కెట్ అధికారులు ధరలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. అధికారుల ప్రకటనలు ఒకేరోజు రెండు రకాలుగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.
నిజామాబాద్ కార్యాలయం ముట్టడి
పంటలకు గిట్టుబాట ధర కల్పించడం లేదం టూ 500 మంది రైతులు సోమవారం నిజామాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సెక్రటరీని నిలదీశారు. కమిటీ ఆఫీసు ముందూ ధర్నా చేశారు.
జమ్మికుంటలో పెరుగుతున్న పత్తి ధర
కాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర పెరుగుతోంది. సోమవారం క్వింటాల్ లూజ్ పత్తికి గరిష్టంగా రూ.5,200, కనిష్టంగా రూ.5 వేలు పలికింది.