ఏడాది పూర్తయినా..
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు కొన్ని చోట్ల విత్తనాలు కూడా వేసేశారు. మరి కొంతమంది విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో చాలామంది రైతులు చేతిలో డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారు. గతేడాది రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ రాయితీ ఇంతవరకు చెల్లించలేదు. పంట ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ అయినా సకాలంలో ఇస్తే ఈ ఖరీఫ్‌కు సీజన్‌కు అవసరమైన విత్తనాలు కొనుగోలు చేసుకునేవారమని రైతులు అంటున్నారు.
గతేడాది ఖరీఫ్‌లో జిల్లాలోని ఆరు మండలాల్లో కరువు ఏర్పడింది. దీంతో ప్రభుత్వం గంట్యాడ, విజయనగరం, మెంటాడ, దత్తిరాజేరు, కొత్తవలస , వేపాడ మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2108.5 హెక్టార్లలో పంట పోవడంతో 73,057 మంది రైతులకు పంపిణీ చేయడానికి రూ. 3.16 కోట్లు అవసరమని వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పంపి ఏడాదవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు నిధులు విదల్చలేదు.
వెతుకులాట..
గతేడాది పరిహారం ఇంతవరకు అందకపోగా, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు చేతిలో చిల్లగవ్వ లేకపోవడంతో ఆరు మండలాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ముందు ఏడాది పండిన పంటలో కొంత ఉంచుకుని దాన్ని మరుచటి ఏడాది అమ్ముతారు. ఆ డబ్బును వ్యవసాయ ఖర్చులకు వినియోగిస్తారు. అయితే గతేడాది ఖరీఫ్‌లో పంట లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ప్రైవేట్ వ్యాపారుల వద్ద డబ్బులు అప్పులు తీసుకుని సాగు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిహారం మంజూరు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పలువురు రైతులు కోరుతున్నారు.