ఈ దిశగా ప్రోత్సాహకానికి పథకం
దీనిపై ఉన్నత స్థాయి కమిటీ సంప్రదింపులు
న్యూఢిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్‌తో అంతర్జాతీయంగా భారత్ బ్రాండ్‌కు ప్రచారం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక పథకం ప్రకటించే అవకాశం ఉందని, దీనిపై అత్యున్నత స్థాయి కమిటీ పనిచేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. మేడ్ ఇన్ జపాన్, స్విట్జర్లాండ్ మాదిరే మేడ్ ఇన్ ఇండియాకు బలమైన బ్రాండ్ గుర్తింపు తీసుకురావాలన్నది ఇందులోని ఉద్దేశమ్యని తెలిపారు.
‘‘స్విట్జర్లాండ్ గురించి చెప్పగానే వాచీలు, చాక్లెట్లు, బ్యాంకింగ్ రంగం గుర్తుకొస్తుంది. ఇదే మాదిరిగా మనం ఏమి చేయగలం అన్న దానిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మనకు మెరుగైన సామర్థ్యాలు కలిగిన టెక్స్‌టైల్స్ తదితర కొన్ని రంగాలకే ఈ పథకాన్ని పరిమితం చేయాలా? తదతర అంశాలపై దృష్టి సారించాం’’అని ఆ అధికారి తెలిపారు. భారత్ బ్రాండ్‌కు ప్రచారం కల్పించే విషయంలో నాణ్యత కీలక అంశంగా ఉండాలన్నది నిపుణుల సూచన.
ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో ‘ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్’ (ఐబీఈఎఫ్) ఈ దిశగానే పనిచేస్తోంది. భారత ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయంగా అవగాహన, ప్రచారం కల్పించడం కోసం కృషి చేస్తుండడం గమనార్హం. ఇప్పుడు భారత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చే లక్ష్యంతో పథకంపై సమాలోచనలు చేస్తోంది.
నాణ్యతే ప్రామాణికంగా ఉండాలి..
‘‘భారత బ్రాండ్ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. నాణ్యతలో నిలకడ, మన్నిక ప్రాధాన్యంగా ఉండాలి. ఉదాహరణకు అధిక నాణ్యతతో కూడిన జనరిక్ ఔషధాల తయారీతో భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అంతర్జాతీయంగా మంచి నమ్మకాన్ని గెలుచుకుంది’’అని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) పేర్కొంది. భారత్ ప్రతిష్ట కాపాడుకునేందుకు నాణ్యతలేని ఉత్పత్తుల సరఫరాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment