ఎన్‌ఎఫ్‌డీసీ–ఎఫ్‌ఐసీసీఐ ఆధ్వర్యంలో వేడుకలు
ఫ్రాన్స్‌లో ఈ నెల 14 నుంచి 25 వరకు జరగనున్న 77వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారతదేశం ప్రాతినిధ్యం ఉంటుందని భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని విభిన్నమైన సంస్కృతులు–సంప్రదాయాలను సెలబ్రేట్ చేసేలా ‘భారత్ పర్వ్’ పేరిట భారత పర్యాటక శాఖ దేశంలో వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ నిర్వహించనున్నారు.
‘భారత్ పర్వ్’ పేరిట కాన్స్ చిత్రోత్సవాల్లో ఓ విభాగం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఈ చిత్రోత్సవాల్లో భారత్ పెవిలియన్ పేరిట ఓ స్టాల్‌ను ఏర్పాటు చేస్తారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ఐసీసీఐ) ఈ స్టాల్‌ను నిర్వహిస్తాయి. అలాగే ఈ ఏడాది గోవాలో నవంబరు 20 నుంచి నవంబరు 28 వరకు జరగనున్న 55వ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) విశేషాలు, ఈ వేడుకల్లో జరగనున్న వరల్డ్ ఆడియో–విజువల్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్ సమ్మిట్ గురించిన వివరాలను కూడా ‘భారత పర్వ్’ సెలబ్రేషన్స్‌లో భాగంగా వెల్లడించనున్నామని భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార శాఖ పేర్కొంది.
భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ రంగానికి సంబంధించిన అన్ని విభాగాల ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. దేశానికి చెందిన ప్రతిభ గల ఫిల్మ్ మేకర్స్ ఈ వేడుకలను ఓ వారిధిగా చేసుకుని ప్రపంచ ఫిల్మ్ మేకర్స్‌కు ‘భారత్ పర్వ్’లో తమప్రాజెక్ట్స్‌ను, తమను మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. ఇందుకోసం భారత పెవిలియన్ స్టాల్‌లో భారతీయ సినీ సమాఖ్య ప్రతినిధులు ఉంటారు.
కాన్స్ వేదికపై భారత్ హవా...
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ప్రతిష్టాత్మక విభాగం ఫామ్ డి ఓర్‌లో భారత్‌కు చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ పోటీ పడుతోంది. అలాగే అన్ సర్టైన్ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ పోటీలో ఉంది. డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ విభాగంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్ కరణ్ గంధారి తీసిన ‘సిస్టర్ మిడ్‌నైట్’, అసోసియేషన్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా విభాగంలో మైసమ్ అలీ తీసిన ‘ఇన్ రీట్రీట్’ ఉన్నాయి.
అలాగే ‘ది ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘సన్ ఫ్లవర్స్ వేర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ పోటీలో ఉంది. జాతీయ అవార్డుగ్రహీత, కెమెరామేన్ సంతోష్ శివన్ ఈ చిత్రోత్సవాల్లో ‘పియర్ ఏంజెనీ’ అవార్డు అందుకోనున్నారు. దివంగత ప్రముఖ ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనెగల్ తీసిన ‘మంథన్’ (1976) చిత్రం ప్రదర్శితం కానుంది. ఇలా ఈ ఏడాది కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారత్ హవా బాగానే ఉంది.
కాన్స్‌లో భారతీయ మెరుపులు... కాన్స్ చిత్రోత్సవాలంటే గుర్తొచ్చే విషయాల్లో ‘రెడ్ కార్పెట్’పై తళుకులీనుతూ నటీమణులు అందంగా చేసే క్యాట్ వాక్ ఒకటి. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి పలువురు కథానాయికలు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. 2000వ సంవత్సరం నుంచి ఐశ్వర్యా రాయ్ హాజరవుతున్నారు. ఈసారి కూడా ఆమె కాన్స్ ఎర్ర తివాచీపై మెరవనున్నారు. అలాగే 2022లో జరిగిన చిత్రోత్సవాల్లో పాల్గొన్న అదితీ రావు హైదరి ఈసారీ హాజరవుతున్నారు. తెలుగు అమ్మాయి శోభితా దూళిపాళ కూడా పాల్గొంటారని టాక్. ఇటీవలే ఈ బ్యూటీ ‘మంకీ మేన్’ చిత్రం ద్వారా హాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఐశ్వర్య, అదితి, శోభిత... ఈ ముగ్గురూ కాకుండా ఇంకా ఏయే భారతీయ తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారనే విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment