గ్యాస్ రాయితీ రద్దు
- ఆధార్‌తో అనుసంధానమైతేనే సబ్సిడీ
- 15 నుంచే అమలు
- డీబీటీఎల్‌కు జంటజిల్లాల్లో
- ఏడు లక్షల మంది దూరం
- మార్కెట్ ధరపైన సిలిండర్ సరఫరా
సాక్షి, హైదరాబాద్: మీ గ్యాస్ కనెక్షన్ ఆధార్‌తో అనుసంధానం కాలేదా? అయితే సిలిండర్‌పై రాయితీ ఆగిపోనుంది.. ఇక నుంచి మార్కెట్ ధరపైనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఆదివారం నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా, డీలర్ పేరు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు ఏడు లక్షల మంది వినియోగదారులు అదనపు భారాన్ని మోయనున్నారు. ప్రస్తుతం జంట జిల్లాల్లో సుమారు 29 లక్షల ఎల్పీజీ గృహా వినియోగదారులు ఉన్నారు.
అందులో బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన 22.24 లక్షల వినియోగదారులకు మార్కెట్ ధరపై సిలిండర్ సరఫరా జరుగుతోంది. సిలిండర్ సబ్సిడీ నగదు రూపంలో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. అనుసంధానికి దూరంగా 6.76 లక్షల వినియోగదారులకు మాత్రం వెసులుబాటు కారణంగా ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా అవుతూ వచ్చింది.
ఇప్పటి వరకూ వారు అనుసంధానం చేసుకోక పోవడంతో మార్కెట్ ధరకు సిలిండర్ కొనుగోలుచేసుకోవాలి. ప్రస్తుతం డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.675.50పైసలు. ఆధార్‌తో అనుసంధానం అయిన వారికి సబ్సిడీ రూ.219లు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సబ్సిడీ పొందాలనుకుంటే తప్పనిసరిగా ఎల్పీజీని ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవల్సిందే..
మరో మూడు నెలల గడువు..
డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ఎల్పీజీ (డీబీటీఎల్) పథకం గడువు ఫిబ్రవరి 14తో ముగిసింది. మే 15వ తేదీలోగా అనుసంధానం చేసుకుంటే మూడు నెలల్లో ఎన్ని సిలిండర్లు తీసుకున్నారో వాటికి ఒకేసారి సబ్సిడీ జమ అయ్యే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఎటువంటి రాయితీ పొందే అవకాశం ఉండదు.