gas subsidy
-
ఎన్నికల ముంగిట.. వంట గ్యాస్‌పై శుభవార్త!
లోక్‌సభ ఎన్నికల ముంగిట వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద భారత ప్రభుత్వం వంట గ్యాస్‌పై సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించవచ్చని సీఎన్‌బీసీ-టీవీ18 నివేదిక పేర్కొంది. కొత్త కనెక్షన్ల కోసం అందించే సొమ్మే కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అర్హులైన వినియోగదారులకు ప్రతి ఎల్పీజీ సిలిండర్‌కు రూ.300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ అందిస్తోంది. ఇది గతంలో రూ.100 ఉండగా 2023 అక్టోబరులో రూ.300కి పెంచారు. సబ్సిడీని ఒక సంవత్సరం పొడిగించడం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.12,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఉజ్వల పథకం ప్రయోజనాలు ఇలా.. ప్రభుత్వం అర్హులైన పేదలకు 14.2 కిలోల సిలిండర్‌తో ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్‌కు రూ.1600 నగదు బదిలీ చేస్తుంది. ఇదే 5 కిలోల సిలిండర్‌కైతే రూ.1150 అందిస్తోంది. ఇందులో సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ - 14.2 కిలోల సిలిండర్‌కు రూ.1250, 5 కిలోల సిలిండర్‌కైతే రూ.800, రెగ్యులేటర్ కోసం రూ.150, ఎల్పీజీ ట్యూబ్ కోసం రూ.100, డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డ్ కోసం రూ.25, ఇన్‌స్పక్షన్, ఇన్స్టాలేషన్ చార్జీ కింద రూ.75 ఉంటాయి. వీటన్నంటినీ ప్రభుత్వమే భరిస్తోంది. -
‘దీపం’ వెలగట్లే..!
సాక్షి,సిటీ బ్యూరో: విశ్వనగరం కోసం పరుగులు తీస్తున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రతి ఇంటా వంట గ్యాస్ లక్ష్యానికి గండి పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం నత్తలకు నడక నేర్పిస్తోంది. రెండున్నరేళ్లుగా ఢిల్లీ, చంఢీఘర్ తరహాలో హైదరాబాద్‌ను ‘కిరోసిన్ ఫ్రీ‘ సిటీగా తీర్చిదిద్దేందుకు పౌరసరఫరాల శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు..రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ఇంకా నిరుపేదలు కిరోసిన్‌పైనే ఆధారపడి వంటవార్పు కొన సాగించడం విస్మయానికి గురిచేస్తోంది. కనీసం ఆహార భద్రత (రేషన్) కార్డు లబ్ధిదారులనైనా గుర్తించి కనెక్షన్లు మంజూరు చేయించడంలో నగరంలోని పౌరసరఫరాల విభాగం పూర్తిగా విఫలమైంది. పౌరసరఫరాల శాఖ ఎల్పీజీ సిలిండర్ లేని కిరోసిన్ లబ్ధిదారులను గుర్తించి ప్రోసీడింగ్ జారీ చేస్తున్నా.. ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదీ పరిస్ధితి... మహా నగరంలో బీపీఎల్ కింద గుర్తించిన ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కుటుంబాలలో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలపై పౌర సరఫరాల విభాగాలు దృష్టి సారించాయి. దీపం పథకం కింద కిరోసిన్ లబ్ధిదారులను గుర్తించినప్పటికీ వాటిలోనే సగం మందికి కనెక్షన్లు అందని ద్రాక్షగా మారాయి. నగరంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పౌరసరఫరాల విభాగాలు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం కింద సుమారు 1,67,198 కుటుంబాలను గుర్తించాయి. అందులో 1,66,522 కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లకు ఆమోదం తెలిపాయి. ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం 84,713 కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన ఎల్పీజీ ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో పడిపోయాయి. పౌర సరఫరాల విభాగాలు సైతం జారీ చేసిన ప్రోసీడింగ్స్ గ్రౌండింగ్‌లను పర్యవేక్షించక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అదనపు బాదుడు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం కింద గ్యాస్ కనెక్షన్ల జారీ సమయంలో ఆయిల్ కంపెనీలు లబ్ధిదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ జారీ చేయాల్సి ఉంటుంది. గ్యాస్‌తో కూడిన సిలిండర్, పైపు, రెగ్యులేటర్లను అందించాల్సి ఉంటుంది. గ్యాస్ స్టౌవ్ కొనుగోలు లబ్ధిదారుడిపై ఆధారపడి ఉంటుంది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు బలవంతంగా గ్యాస్ స్టౌవ్‌లను అంటగట్టి రెండింతలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు దీపం లబ్ధిదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న పౌర సరఫరాల శాఖ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (దీపం) పథకం అమలు ఇలా.. పౌరసరఫరాల విభాగం గుర్తింపు ఆమోదం ఇచ్చిన కనెక్షన్లుజిల్లాల వారీగా) హైదరాబాద్ 1,13,992 1, 13,964 57,824 రంగారెడ్డి 32,018 31,753 18,469 మేడ్చల్ 21,188 20,805 8,420 -
గ్యాస్ సబ్సిడీ తిప్పలు ..!
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కలు చూపిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ డోర్ డెలివరీ జరిగి పక్షం రోజులు గడిచినా నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం పేదల పాలిట శాపంగా తయారైంది. డీబీటీ పథకం అమలు ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమవుతూ వచ్చింది. తాజాగా కొన్ని మాసాలుగా తిరిగి పాత పరిస్థితి పునరావృత్తం అవుతోంది. సబ్సిడీ సొమ్ము 25 రోజులు దాటినా జమ కాని పరిస్థితి నెలకొంది. కొందరికి అసలు సబ్సిడీ జమ నిలిచిపోయింది. సంబంధిత లబ్ధిదారులు డిస్ట్రిబ్యూటర్ను సంప్రదిస్తే సరైన స్పందన లభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ధర చెల్లించి... వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీపై డోర్ డెలివరీ జరుగుతున్న పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్సిడీ సిలిండర్ ధర మినహాయించి మిగిలిన సొమ్ము నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇదీ కేవలం ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. బ్యాంక్‌లో సైతం నగదు జమ కాదు. ఇదీలా ఉండగా సబ్సిడీ సిలిండర్‌కు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేయడం పేదలకు ఆర్థిక భారంగా తయారైంది. ఆ తర్వాత సబ్సిడీ ధరపోనూ మిగిలిన నగదు తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ అయినా ముందు చెల్లింపు కష్టతరంగా తయారైంది. తాజా గా ఆ డబ్బు కూడా జమకాకపోవడంతో వినియోగదారులకు మరింత ఆర్థిక ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. 29.21లక్షల పైనే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్త 125 ఏజెన్సీల ద్వారా ప్రతిరోజు డిమాండ్ ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అవుతోంది. అక్కడి నుంచి బుకింగ్ ద్వా రా వినియోగదారులకు డోర్ డెలివరీ జరుగుతోంది. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు, హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో వంట గ్యాస్ ధర ఎల్పీజీ సిలిండర్ ధర : రూ.762.35 బ్యాంకులో జమ : రూ. 257.79 -
సబ్సిడీ గాయబ్!
వంట గ్యాస్ వినియోగదారుల్లో కొందరికి సబ్సిడీ సొమ్ము అందని ద్రాక్షగానే మిగిలింది. అన్ని వివరాలు సమర్పించినా సబ్సిడీ సొమ్ము మాత్రం ఖాతాల్లో జమ కావడం లేదు. ఏజెన్సీల్లోనూ సరైన సమాధానం రావడం లేదు. సబ్సిడీ సొమ్ము అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 2.27 లక్షల కుటుంబాలు ఉండంగా 1,90,742 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందరికీ గ్యాస్ సిలిం డర్లు సరఫరా చేయడానికిగాను జిల్లాలో 20 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. గతంలో సబ్సిడీపోను మిగ తా సొమ్ము చెల్లించి సిలిండర్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం గ్యాస్ సబ్సిడీని వినియోగదారుడి ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి వినియోగదారులు సిలిండర్ పూర్తి ధర చెల్లిస్తున్నా రు. అనంతరం సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే ఏడాది కాలంగా చాలామంది వినియోగదారుల ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ సొమ్ము జమ కావడం లేదు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీల చు ట్టూ తిరుగుతున్నారు. వినియోగదారునికి రావాల్సిన సబ్సిడీ సొ మ్మును వేరే ఖాతాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణ లు వచ్చాయి. అయితే సబ్సిడీ విషయంలో తమ కేం సంబంధం లేదని, అదంతా ఆన్లైన్లోనే జరిగిపోతుందని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 703 ఉండగా.. సబ్సిడీ రూ. 213.50 రావా ల్సి ఉంది. అంటే వినియోగదారునికి సిలిండర్ రూ. 489.50కే అందుతుందన్నమాట. అయితే చాలామంది వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ ఖాతాలకు చేరడం లేదు. గ్యాస్ వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోనే సబ్సిడీ జమ అవుతుందని ఏజెన్సీల నిర్వాహకులు స్పష్టం చేస్తుండగా.. చాలా మంది వినియోగదారులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని ఆరోపిస్తున్నారు. సరాసరిన ఒక్కో వినియోగదారులు ఆరునుంచి ఏడు సిలిండర్లను వినియోగించినా.. ఏడాదికి రూ. 1,500 వరకు నష్టపోతున్నాడు. ఆపై అదనపు వసూళ్లు... గ్యాస్ సిలిండర్‌పై రావాల్సిన సబ్సిడీ సొమ్ము అందకపోగా.. గ్యాస్ సిలిండర్ డోర్‌డెలివరీ చేసిన వారు సిలిండర్ వెంట రవాణా చార్జీ అంటూ రూ. 20 నుంచి రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి డబ్బులు గుంజుతున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్లను వినియోగదారుడి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపైనే ఉంటుంది. కానీ చాలా ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్‌ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. వాళ్లు చెప్పినన్ని డబ్బులు ఇవ్వకుంటే సిలిండర్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు డెలివరీ బాయ్స్ అడిగినంత చెల్లిస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ వినియోగదారుల ఖాతాలకు చేరే విషయంలోనే కాక, రవాణా చార్జీల పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్న వ్యవహారంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీ సొమ్ము ఎటుపోతోంది? గ్యాస్ సబ్సిడీ సొమ్ము ఏమవుతోంది, ఎవరి ఖాతాలో చేరుతుందన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. అప్పట్లో ఓ సెల్యూలర్ కంపెనీ తన వినియోగదారులకు తెలియకుండానే బ్యాంకు అకౌంట్లు తెరిపించి, సబ్సిడీ సొమ్మును ఆ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదిస్తే ఆధార్ కార్డు అనుసంధానం అయిన తరువాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకే సబ్సిడీ సొమ్ము చేరుతుందంటున్నారు. వినియోగదారుడు కొత్తగా ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిస్తే.. ఆ ఖాతాలో సబ్సిడీ సొమ్ము చేరే అవకాశం ఉంటుందంటున్నారు. ఆధార్ అను సంధానం పూర్తయినా తమ ఖాతాల్లో డబ్బులు చేరడం లేదని వినియోగదారులంటున్నారు. సబ్సిడీ ఎటుపోతుందో తెలియక.. చెప్పేవారూ లేక అయోమయానికి గురవుతున్నారు.గ్యాస్ కంపెనీలే చూసుకుంటాయి.. ప్రతి గ్యాస్ వినియోగదారుడికి లెక్క ప్రకారం సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిందే.. అయితే సబ్సిడీ సొమ్ము విషయం మా పరిధిలోకి రాదు. గ్యాస్ సబ్సిడీ అనేది అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ కంపెనీలే చూస్తాయి. అయినా ఒకసారి పరిశీలిస్తాం. – రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
వినియోగదారుడి ఆమోదం తప్పనిసరి
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ తరహా ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆధార్ నిర్వహణ సంస్థ యూఐడీఏఐ రంగంలోకి దిగింది. వంటగ్యాస్ సిలిండర్లపై సబ్సిడీనీ కస్టమర్ల ఖాతాకు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సబ్సిడీ జమ చేసుకోవడానికి ముందుగానే ఖాతాదారుల ఆమోదం తప్పకుండా తీసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. సబ్సిడీ జమకు సంబంధించి మార్పు చోటు చేసుకుంటే ఆ విషయాన్ని ఖాతాదారులకు వెంటనే 24 గంటల్లోపు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని, అవసరమైతే పూర్వపు ఖాతాకు మార్చుకునే అవకాశం కూడా కల్పించాలని ఆదేశిస్తూ యూఐడీఏఐ ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేని ఖాతాదారుల నుంచి సబ్సిడీ జమ విషయమై లిఖిత పూర్వకంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏ బ్యాంకు ఖాతాకు చివరిగా ఆధార్ అనుసంధానించుకుంటే ఆ ఖాతాలో వంటగ్యాస్ సబ్సిడీ జమ అవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో యూఐడీఏఐ ఈ చర్యలు తీసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) సబ్సిడీ పొందే అకౌంట్ల మార్పు అభ్యర్థనను ఖాతాదారుల ఆమోదంతో బ్యాంకుల నుంచి వస్తేనే అనుమతించాలని నోటిఫికేషన్లో యూఐడీఏఐ పేర్కొంది. ఈ విషయమై యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే సమాధానమిస్తూ వినియోగదారుల ఆమోదం లేకుండా బ్యాంకు ఖాతాలను మార్పు చేయడాన్ని నిలిపివేసేందుకే మరింత సురక్షిత విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. దీని ప్రకారం బ్యాంకులు ఖాతాదారుల ఆమోదం తీసుకున్న అనంతరమే సబ్సిడీ జమ చేయాల్సిన ఖాతాల మార్పు అభ్యర్థలను ఎన్‌పీసీఐకు పంపించాల్సి ఉంటుందని పాండే తెలిపారు. ఒకవేళ కొత్త ఖాతాలకు సబ్సిడీ జమ చేయడం వినియోగదారులకు ఇష్టం లేకపోతే దాన్ని రివర్స్ చేసుకునే సదుపాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ‘ఎయిర్టెల్’ అనుభవంతోనే భారతీ ఎయిర్టెల్ తన ఖాతాదారుల ఆమోదం లేకుండానే వారి పేరిట భారతీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో ఖాతాలు తెరిచి ఆధార్‌తో అనుసంధానించుకోవడం ద్వారా వారి వంటగ్యాస్ సబ్సిడీలను జమ చేసుకున్నట్టు వెలుగు చూడడంతో ఇదో పెద్ద వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. రూ.190 కోట్ల మేర సబ్సిడీ మొత్తం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో యూఐడీఏఐ ఏకంగా ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఆధార్ ఈకేవైసీ ధ్రువీకరణ అధికారాన్ని నిలిపివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే యూఐడీఏఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. రూ. 2.5 కోట్ల పెనాల్టీ కట్టిన ఎయిర్టెల్ న్యూఢిల్లీ: పేమెంట్స్ బ్యాంక్‌లో అనధికారికంగా ఖాతాలు తెరిచిన వివాదానికి సంబంధించి ఎయిర్టెల్ సంస్థ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు (యూఐడీఏఐ) మధ్యంతర జరిమానా కింద రూ. 2.5 కోట్లు కట్టింది. కంపెనీ బేషరతుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 31 లక్షల కస్టమర్ల ఖాతాల్లో జమయిన రూ. 190 కోట్ల గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని కూడా 24 గంటల్లోగా వారి అసలు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని ఎయిర్టెల్ హామీ ఇచ్చినట్లు వివరించాయి. ఎయిర్‌టెల్‌కి పేమెంట్స్ బ్యాంక్ కూడా ఉంది. మొబైల్ కనెక్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం కస్టమర్ల నుంచి ఆధార్ వివరాలను సేకరించిన ఎయిర్టెల్.. అనుమతి తీసుకోకుండానే వారి పేరిట పేమెంట్స్ బ్యాంక్‌లో కూడా ఖాతాలు తెరిచిందని ఆరోపణలున్నాయి. ఆ యూజర్లకు రావా ల్సిన గ్యాస్ సబ్సిడీ మొత్తాలు కూడా ఈ ఖాతాల్లోకి చేరడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూఐడీఏఐ.. ఎయిర్‌టెల్‌కి ఇచ్చిన ఈ–కేవైసీ లైసెన్సును తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. -
ఎయిర్టెల్ బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్... లాంఛనంగా కస్టమర్ల అనుమతి తీసుకోకుండా తెరిచిన ఖాతాల్లో భారీ స్థాయిలో గ్యాస్ సబ్సిడీ మొత్తాలు జమయ్యాయి. 37.21 లక్షల వినియోగదారులకు చెందిన రూ. 167.7 కోట్ల సొమ్ము ఈ ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు (ఐవోసీ)కి 17.32 లక్షల మంది వినియోగదారుల ఖాతాల్లో రూ.88.18 కోట్లు జమయ్యాయి. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ వినియోగదారులు 10.06 లక్షల మందికి చెందిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో రూ.40 కోట్లు, 9.8 లక్షల మంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) వినియోగదారులకు చెందిన ఖాతాల్లో రూ. 39.46 కోట్లు డిపాజిట్ అయ్యాయి. 37.21 లక్షల ఖాతాదారుల అకౌంట్లన్నీ కూడా... ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తెరిచినవేనని సదరు అధికారి పేర్కొన్నారు. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్.. సిమ్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించాల్సిన ఆధార్ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియను దుర్వినియోగం చేసిందని, వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండా.. వారి అనుమతి తీసుకోకుండానే తన పేమెంట్స్ బ్యాంక్‌లో వారి పేరిట ఖాతాలను తెరిచిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ సంస్థల ఈకేవైసీ లైసెన్స్‌లను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది కూడా. ఆ డబ్బు తిరిగిచ్చేస్తాం: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లోకి చేరిన గ్యాస్ సబ్సిడీ నిధులను వాపసు చేయాలంటూ చమురు సంస్థలు ఎయిర్‌టెల్‌పై ఒత్తిడి పెంచడం ప్రారంభించాయి. హెచ్‌పీసీఎల్ దీనిపై ఇప్పటికే ఎయిర్‌టెల్‌కి లేఖ కూడా రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చిన రూ. 190 కోట్ల గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని.. లబ్ధిదారుల అసలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామంటూ ఎయిర్టెల్ వెల్లడించింది. వడ్డీతో సహా ఈ మొత్తాన్ని చెల్లిస్తామంటూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి లేఖ రాసింది. మరోవైపు నగదు బదిలీ ప్రక్రియను కూడా మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
కారు ఉందా? సబ్సిడీ కట్
న్యూఢిల్లీ : సొంత కారు ఉందా? అయితే ఇక ఎల్పీజీ సిలిండర్లపై పొందుతున్న సబ్సిడీ విషయాన్ని మర్చిపోవాల్సిందే. దశల వారీగా గ్యాస్‌పై సబ్బిడీ ఎత్తివేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా ఈ నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. నేరుగా నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.6 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను ఏరేసింది. ఇక రెండో దశలో కారున్న వాళ్లపై సబ్సిడీ ఎత్తివేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రయోగం తొలి దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. దీనికోసం కొన్ని జిల్లాలో ఆర్టీఓ కార్యాలయాల నుంచి కారు యజమానుల సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇది సఫలమైతే, సబ్సిడీలో పెద్ద మొత్తంలో ఆదా పొందవచ్చని ప్రభుత్వం చూస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం చాలామందికి రెండు లేదా మూడు కార్లు ఉన్నప్పటికీ గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. అదేవిధంగా వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందా లేదా చూస్తున్నారు. ఈ లెక్కల్లో ఎక్కువ మంది ఆదాయాలు పది లక్షలు దాటినట్లయితే వారికి ఒక్కవేటున గ్యాస్ సబ్సిడీని ఎత్తేస్తారు. తమకు అంత ఆదాయం లేదని ఎవరైనా నిరూపించుకుంటే మళ్లీ సబ్సిడీని పునరుద్ధరిస్తారు. దీనికోసం ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎల్పీజీ కస్టమర్ల ఆదాయపు సమాచారాన్ని కూడా పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ సేకరిస్తోంది. దీనిలో పాన్, రెసిడెంటల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఉండనున్నాయి. అయితే వాహన రిజిస్ట్రేషన్ వివరాలను పొందడం చాలా కష్టమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అడ్రస్‌తో కౌంటర్ చెక్ చేసుకోవాల్సినవసరం ఉందంటున్నారు. గివ్ఇట్అప్ క్యాంపెయిన్ లాంచింగ్ తర్వాత గ్యాస్ సబ్సిడీ ఎత్తివేతపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలో ఇప్పటి వరకు 75 లక్షల నకిలీ కనెక్షన్లను గుర్తించామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. -
గ్యాస్ బాంబు!
ఉరుము లేకుండా పడిన పిడుగులా వంటగ్యాస్ సిలెండర్ల సబ్సిడీకి భవిష్యత్తులో మంగళం పాడదల్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా ధరల నియంత్రణ వ్యవస్థను ఎత్తేసినట్టే ఇకపై వంటగ్యాస్‌పై కూడా తొలగించబోతున్నట్టు తెలిపింది. వాస్తవానికి నిరుడు జూలైలోనే సబ్సిడీ సిలెండర్ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచమని చమురు సంస్థలను కేంద్రం ఆదే శించింది. దాన్ని ఇప్పుడు నెలకు రు. 4 చేసింది. సబ్సిడీ పూర్తిగా పోయేవరకూ లేదా వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలా పెంచుకుంటూ పోవాలని కూడా కోరింది. ఒక్కసారిగా ధర పెంచితే అందువల్ల జనంలో ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వాలకు అర్ధమై చాలా కాలమైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ ‘కాలజ్ఞానం’ మొదలైంది. 2010లో తొలిసారి పెట్రోల్ ధరపై నియంత్రణ ఎత్తేసింది. సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉండే డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌ల జోలికి మాత్రం వెళ్లబోమని వాగ్దానం చేసింది. 2013లో ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించి డీజిల్‌పై ‘పాక్షికం’గా నియంత్రణ ఎత్తేస్తున్నట్టు ఆనాటి కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ప్రకటించారు. ఎన్డీఏ సర్కారు వచ్చాక 2014లో ఆ ముచ్చట కూడా ముగిసిపోయింది. ఈసారి వంటగ్యాస్ వంతు వచ్చింది. ముందూ మునుపూ కిరోసిన్‌ను సైతం ధరల నియంత్రణ వ్యవస్థ నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదు. నిరుడు మే నెలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దారిద్య్ర రేఖకు దిగువునున్న కుటుంబాలకు మహిళల పేరిట ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. ఇప్పటికే ఈ పథకంలో 2.5 కోట్ల మంది మహిళలు వంటగ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సంప్రదాయ పొయ్యిల వల్ల వాతా వరణ కాలుష్యం, మహిళల ఆరోగ్యం దెబ్బతినడం వగైరా జరుగుతున్నాయి గనుక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. నిజానికి యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి తోడ్పడిన అంశాల్లో ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ల అంశం కూడా ప్రధానమైదని అంటారు. ఈ పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్ లభించిన కుటుంబాలు సెక్యూరిటీ డిపాజిట్గానీ, కనెక్షన్‌కి సంబంధించిన ఇతర చార్జీలుగానీ చెల్లించనవసరం లేదు. మొదటి సిలెండర్ ధరనూ, స్టౌ ధరనూ వాయిదాల్లో కట్టొచ్చునన్న నిబంధన కూడా ఉంది. కనుక ఉచిత వంటగ్యాస్ కనె క్షన్లు చాలా కుటుంబాలే తీసుకున్నాయి. కానీ రెండో సిలెండర్ నుంచి వాయిదాల పద్ధతి ఉండదు. పర్యవసానంగా కనెక్షన్ తీసుకున్నవారిలో చాలామంది కొత్త సిలెండర్ కోసం రాలేదని ఒక సర్వేలో తేలింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు సబ్సిడీ సిలెండర్ ధర రూ. 450 చెల్లించలేని స్థితిలో ఉన్నారని దీన్నిబట్టే అర్ధమ వుతోంది. ఇప్పుడు ఆ సబ్సిడీని కాస్తా ఎత్తేస్తే సహజంగానే ఆ ధర మరింత పెరు గుతూ పోతుంది. ఏతావాతా అలాంటి కుటుంబాలన్నీ వంటగ్యాస్ సౌకర్యానికి దూరం కాక తప్పదు. ఆర్ధిక సంస్కరణలు మొదలైనప్పటినుంచీ సంక్షేమ భావన క్రమేపీ కొడిగడుతోంది. దేనికైనా ‘తగిన ధర’ చెల్లించి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే వంటగ్యాస్ జోలికి ప్రభుత్వాలు చాలా ఆలస్యంగా వచ్చినట్టే లెక్క. దేశంలో సబ్సిడీ సిలెండర్లు ఉపయోగించే వారి సంఖ్య 18.11 కోట్లు. సబ్సిడీయేతర సిలెండర్ల వినియోగదారులు 2.66 కోట్లున్నారు. అసలు వంటగ్యాస్‌లో సబ్సిడీ, సబ్సిడీయేతర తరగతుల్ని తీసుకొచ్చింది యూపీఏ సర్కారే. రెండింటికీ రెండు రకాల ధరలు నిర్ణయించి... పెంచినప్పుడు చెరో రకంగా పెంచుతూ జనాన్ని అయోమయంలోకి నెట్టడం అప్పుడే మొదలైంది. వంటగ్యాస్ కనెక్షన్లలో 89 శాతం మంది ఏడాదికి 9 సిలెండర్లు మాత్రమే వాడతారని... తాము వారి జోలికి పోకుండా అంతకుమించి వాడేవారిపై భారం పడేలా పదో సిలెండర్ నుంచి సబ్సిడీని తీసేస్తున్నట్టు ఆనాటి ప్రభుత్వం చెప్పింది. దీని ప్రభావమేమిటో త్వరలోనే వారికి అర్ధమైంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్ర హావేశాలు రగిలాయి. దాంతో 2014 ఎన్నికలకు ముందు దాన్ని కాస్తా సవ రించారు. ఏడాదికి 12 సిలెండర్లను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రక టించారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో మూడేళ్లక్రితం చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గాయి. నిరుడు ఇందులో స్వల్ప పెరుగుదల కనిపించినా అది 2014కి ముందున్న ధరలతో పోలిస్తే చాలా తక్కువే. నిజానికి దీన్ని ఆసరా చేసుకునే ప్రస్తుతం వంటగ్యాస్కిచ్చే సబ్సిడీని భవిష్యత్తులో ఎత్తేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఉదాహరణకు సబ్సిడీయేతర సిలెండర్ ధర ప్రస్తుతం రూ. 737. 2013లో దాని ధర రూ. 1,250. మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పుంజుకుంటే ఇది తారుమారు కావొచ్చు. ఆ పరిస్థితే తలెత్తితే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెను ప్రభావం చూపే వంటగ్యాస్ సబ్సిడీ జోలికి వెళ్లడం ధర్మం కాదు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గాయని సంబరపడి ధరల నియంత్రణ వ్యవస్థ నుంచి వంటగ్యాస్‌ను తొలగిస్తే రేపన్న రోజున పరిస్థితులు వేరే రకంగా ఉండొచ్చు. నిజానికి చమురు సంస్థలపై కేంద్రం విధిస్తున్న అమ్మకం పన్ను, దిగుమతి సుంకం... ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ వగైరాలు లేనట్టయితే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఈ స్థాయిలో ఉండవు. వీటి ధరలు పెంచాల్సి వచ్చినప్పుడల్లా ప్రభుత్వం తామిస్తున్న సబ్సిడీల గురించి మాట్లాడుతుంది తప్ప ఈ పన్నుల ఊసెత్తదు. మన దేశంలో వంటిల్లు భారం మోస్తున్నది మహిళలే. వంటగ్యాస్ సబ్సిడీ తీసేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలకు అది పెను భారమవుతుంది. పర్యవసానంగా ఆ కుటుంబాలు తిరిగి పాత పద్ధతుల్లో పొయ్యి రాజేసుకుంటాయి. అందువల్ల ప్రధానంగా దెబ్బతి నేది మహిళల ఆరోగ్యమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. -
3.56 కోట్ల నకిలీ అకౌంట్లు గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యక్ష్ హన్స్తంత్రి లాభ్(పీఏహెచ్‌ఎల్) పథకం అమలు తర్వాత దేశవ్యాప్తంగా 3.56 కోట్ల నకిలీ అకౌంట్లను గుర్తించారు. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 3.56 కోట్లు నకిలీ బ్యాంకు అకౌంట్లను గుర్తించినట్లు చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ సబ్సిడీ కింద రూ.40,569 కోట్లు, 2015-16 ఆర్థిక సంత్సరానికి రూ.16,074 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం వల్ల(పీఏహెచ్‌ఎల్ పథకం ద్వారా), అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం తదితర కారణాల వల్ల 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,495 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. 2017 జనవరి నెల వరకూ కోటి ఐదు లక్షల మంది ఎల్పీజీ వినియోగదారులు స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు తెలిపారు. -
ఆదాయ పన్ను ఎగ్గొడితే జైలుకే!
రుణాలు పుట్టవు, గ్యాస్ సబ్సిడీ అందదు ♦ ఆస్తుల క్రయ విక్రయాలకూ చెక్ ♦ ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ♦ కఠిన చర్యలకు ఐటీ శాఖ సన్నద్ధం ♦ ముక్కుపిండి వసూలు చేసే కార్యాచరణ ♦ రిటర్నులు దాఖలు చేయకపోయినా చిక్కులే న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారికి అరదండాలు విధించే దిశగా తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకునేందుకు ఆ శాఖ అస్త్రాలను సిద్ధం చేసింది. ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులకు రుణాలు లభించకుండా, ఆస్తుల క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా చేయనుంది. ఇందుకోసం పాన్ నంబర్‌ను బ్లాక్ చేయడం సహా వారికి వంట గ్యాసు సబ్సిడీ అందకుండా చేయడం వంటి పలు చర్యల ద్వారా వారిని దారికి తేవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పన్ను ఎగవేతదారుల విషయంలో అనుసరించాల్సిన చర్యలతో ఆదాయపన్ను (ఐటీ) శాఖ ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇటీవల జరిగిన ఐటీ అధికారుల వార్షిక సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టారు. కార్యాచరణ ప్రణాళిక... దేశంలో ఆదాయపన్ను పరిధిలోకి వచ్చికూడా రిటర్నులు దాఖలు చేయని వారి సంఖ్య 2014లో 22.09లక్షలుగా ఉండగా ఈ సంఖ్య 2015 నాటికి 58.95 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతదారుల పాన్ నంబర్లను రిజిస్ట్రేషన్ల శాఖకు పంపడం ద్వారా సంబంధిత వ్యక్తుల పేరుతో ఎలాంటి ఆస్తుల లావాదేవీలకు అవకాశం లేకుండా చేయాలని కార్యాచరణ ప్రణాళికలో ఐటీ శాఖ ప్రతిపాదించింది. ఎగవేతదారులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి సమాచారాన్ని దేశవ్యాప్తంగా ఐటీ అధికారులందరికీ పంపనుంది. ఎగవేతదారుల నుంచి బకాయిల వసూలు, వారికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసేందుకు వీలుగా ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సిబిల్ నుంచి తెలుసుకోవాలని కూడా నిర్ణయించింది. సీబీడీటీ మార్గదర్శనం ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాలని ఐటీ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సైతం మార్గదర్శనం చేసింది. అరెస్ట్‌లు, నిర్బంధంతోపాటు వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు వెనుకాడవద్దని సూచించింది. ఈ మేరకు సీబీడీటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విధాన పత్రంలో ఆదాయపన్ను అధికారులను ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 276 సీ(2) ప్రకారం ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు, జరిమానాకూ అవకాశం ఉంది. పన్ను వసూలు అధికారి (టీఆర్వో) ఐటీ చట్టంలో ఉన్న ఈ అధికారాలను వినియోగించుకుని పన్నులు రాబట్టాలి. కానీ, ఈ దిశగా చర్యలు తక్కువగా ఉంటున్నాయని, టీఆర్వోల వ్యవస్థను మరింత పటిష్టపరిచి, మరిన్ని సౌకర్యాల కల్పనతోపాటు వారికి సిబ్బందిని కేటాయించాలని సీబీడీటీ సూచించింది. కావాలని పన్ను ఎగవేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతోపాటు అవసరమైన కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడానికి కూడా వెనుకాడవద్దని కోరింది. పన్ను ఎగవేతదారుల ఆస్తులను అటాచ్ చేసి వాటిని ఏడాదిలోపు విక్రయించేందుకు వీలుగా టీఆర్వోల పనితీరును పర్యవేక్షణ అధికారులు పరిశీలించాలని ఆదేశించింది. రూ. కోటి బకాయి ఉన్నా, పేర్లు బహిర్గతమే... ప్రస్తుతం రూ.20కోట్లకు పైగా పన్ను బకాయి పడిన వ్యక్తులు, సంస్థల పేర్లను వెల్లడిస్తూ ఆదాయపన్ను శాఖ జాతీయ దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది. అలాగే, తన వెబ్సైట్లోనూ ప్రముఖంగా పేర్కొంటోంది. ఇకపై రూ.కోటి ఆ పైన బకాయి ఉన్న వ్యక్తులు, సంస్థల పేర్లను కూడా ఇలానే బహిరంగ పరచాలని నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 271 ఎఫ్ ప్రకారం పన్ను వర్తించే ఆదాయం పొందుతున్న వారు తప్పనిసరిగా గడువులోపు రిటర్నులు దాఖలు చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 276సీసీ ప్రకారం ఆదాయ వివరాలతో రిటర్నులు దాఖలు చేయని వారికి ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో రిటర్నులు దాఖలు చేయని ప్రతీ కేసును ప్రత్యేకంగా పరిశీలించి ఈ చట్టాల కింద చర్యలు చేపట్టాలని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఆదాయపన్ను కమిషనర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2,58 లక్షలకు పెరిగినట్టు ప్రణాళిక తెలియజేస్తోంది. వీటిలో ఈఏడాది 1.33 లక్షల కేసులను పరిష్కరించాలన్న లక్ష్యాన్ని విధించారు. -
ప్లీజ్... సబ్సిడీ వదులుకోండి
‘మీ వార్షిక ఆదాయం రూ.10లక్షలు దాటిందా, అయితే వంటగ్యాస్ సబ్సిడీని వదులుకోండి’ అంటూ ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్లు పంపుతున్నాయి. చెన్నై: భారత దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా సబ్సిడీని అందజేస్తోంది. సబ్సిడీపై సరఫరా అవుతున్న వంటగ్యాస్ సిలిండర్లు డీలర్ల సాక్షిగా పక్కదారి పట్టిపోయేవి. బ్లాక్‌లో అమ్ముకోవడం, గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు సరఫరా చేయడం ద్వారా డీలర్లు భారీగా అక్రమాలకు పాల్పడేవారు. అలాగే ఒకే ఇంటి యజమాని పేరున అనేక కనెక్షన్లు ఉండేవి. ఇలాంటి అక్రమాల కారణంగా వంట గ్యాస్ సబ్సిడీ మొత్తం అయిల్ కంపెనీలకు, ప్రభుత్వానికి భరించలేని భారంగా మారింది. ఈ భారం నుండి తప్పించుకునేందుకు ఏడాదికి పరిమితమైన సంఖ్యలోనే సిలిండర్లను సరఫరా చేస్తామని గత యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వినియోగదారుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తరువాత కేంద్రంలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ సబ్సిడీ దుర్వినియోగంపై దృష్టి సారించింది. అక్రమ కనెక్షన్లు అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. వంటగ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసే విధానాన్ని గత ఏడాది జనవరిలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వానికి భారంగా పరిణమించిన వంటగ్యాస్ సబ్సిడీ నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేదలు, మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని మంజూరు చేస్తున్న సబ్సిడీని ధనవంతులు పొందడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా వినియోగదారులు తమ సబ్సిడీ నుండి స్వచ్చందంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ సబ్సిడీ నుంచి మరింతమంది వైదొలగాలని కేంద్రం ఆశిస్తోంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలను దాటిన వినియోగదారులను వంటగ్యాస్ సబ్సిడీ నుంచి మినహాయించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం మేరకు ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్లు పంపడం ప్రారంభించాయి. రూ.10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి వంట గ్యాస్ సబ్సిడీ సౌకర్యం లేదు, ఈ పరిధిలోకి వచ్చిన వారు తమ వివరాలను గ్యాస్ డీలర్‌కు సమర్పించి సబ్సిడీ నుంచి వైదొలగండి అంటూ ఎస్ఎమ్ఎస్ల ద్వారా అయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంపై ఇండియన్ ఆయిల్ చెన్నై శాఖ జనరల్ మేనేజర్ సబితా నటరాజన్ మాట్లాడుతూ, వంటగ్యాస్ వినియోగదారులకు ముంబయిలోని తమ కేంద్ర కార్యాలయం నుండి ఈ మేరకు ఎస్ఎమ్ఎస్లు పంపడం బుధవారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమం ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారం జరుగుతోందని చెప్పారు. -
గ్యాస్ సబ్సిడీ కట్ నిర్ణయించడం ఎలా?
♦ 10 లక్షల పన్ను ఆదాయం ఉండే వినియోగదారులు ఎవరు? ♦ వివరాల సేకరణ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగించాలని కేంద్రం యోచన సాక్షి, హైదరాబాద్: పన్ను విధించదగ్గ ఆదాయం (టాక్సబుల్ ఇన్కమ్) ఏడాదికి రూ. 10 లక్షలకు మించి ఉన్నవారికి వంటగ్యాస్ రాయితీని నిలిపివేయాలని నిర్ణయించిన కేంద్రం.. అధికాదాయ వర్గాల వారిని గుర్తించే బృహత్తర బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగించే అవకాశముంది. వంటగ్యాస్ వినియోగదారుల్లో ఆ తరహా ఆదాయం ఉన్నవారు ఎంతమంది ఉన్నారన్న అంచనాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని ఆదాయపు పన్ను విభాగాల నుంచి రూ. 10 లక్షల పన్ను ఆదాయం మించి ఉన్న వారి వివరాలను తీసుకుని, దాన్ని గ్యాస్ వినియోగదారుల డేటాతో సరిపోల్చి రాయితీకి అనర్హమైన వారిని తొలగించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. స్థూల ఆదాయం నుంచి పీఎఫ్, హెచ్ఆర్ఏ తదితరాలను తీసేసిన తర్వాత పన్ను విధించదగ్గ ఆదాయం వస్తుంది. ఈ లెక్కల బాధ్యతను ఎన్ఐసీకి కట్టబెడితే ఫలితం ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదాయంతో నిమిత్తం లేకుండా ఎవరైనా 14.2 కిలోల వంటగ్యాస్‌ను రాయితీ ధరపై ఏడాదికి 12 సిలిండర్లు తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పిలుపుతో రాష్ట్రంలో ఇప్పటికే సుమారు లక్ష మంది స్వచ్ఛందంగా రాయితీని వదులుకునేందుకు ముందుకొచ్చారు. ఒక్క హెచ్‌పీ గ్యాస్ కంపెనీ పరిధిలోనే రాయితీ వదులుకున్న వారి సంఖ్య 53,558 ఉండగా, ఇండేన్, భారత్ గ్యాస్ కంపెనీలను కలుపుకుంటే లక్ష వరకు ఉంటుందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పన్ను విధించతగ్గ ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి గ్యాస్ సబ్సిడీ కోత పడనుంది. గతంలో ఒకరి పేరు మీద రెండు మూడు కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్‌ను ఉంచి మిగిలిన వాటిని తొలగించాలని నిర్ణయించినప్పుడు ఆ బాధ్యతను ఎన్ఐసీకే అప్పగించారు. ఇప్పుడు కూడా గ్యాస్ కంపెనీల వద్ద వినియోగదారుల ఆధార్ వివరాలే ఉన్నాయి తప్పితే పాన్‌కార్డు వివరాలు లేవు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ బాధ్యతను ఎన్ఐసీకి కట్టబెట్టాలని యోచిస్తోంది. -
ఇక సబ్సిడీలన్ని బ్యాంకు ఖాతాలోకె
-
రూ.10 లక్షల ఆదాయం ఉంటే గ్యాస్ సబ్సిడీ కట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడాదికి రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై చర్చించి.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ‘‘దేశంలో లక్షల సంఖ్యలో అక్రమ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వారందరికీ అక్రమంగా గ్యాస్ సబ్సిడీ అందుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే అక్రమంగా సబ్సిడీని పొందుతున్న వారితో పాటుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేట్ దిగ్గజాలకూ సబ్సిడీని నిలిపివేయనున్నాం’’ అని వెంకయ్య వివరించారు. ఇప్పటికే దేశంలో 30 లక్షల మంది తమంతట తాము గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీఏపీసీసీఐ) ఆధ్వర్యంలో శనివార ం ఇక్కడ ఎఫ్టీఏపీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... దేశ ప్రగతిలో కీలకభూమిక పోషిస్తున్న వ్యవసాయ రంగాన్ని, అన్నదాతలను ఆదుకునేందుకు ఎరువులకు కూడా నగదు రూపంలో సబ్సిడీని అందించనున్నట్లు వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీ తరహాలోనే ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి వేస్తామని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాలది కీలకపాత్ర అంటూ... ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. మొత్తం దేశ జీడీపీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల వాటా 8.17 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపు ఉందన్నారు. ‘‘చైనా, యూరప్, అమెరికా దేశాలు ఆర్థికమాంద్యంలో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే రైల్వే, రిటైల్, నిర్మాణం, రక్షణ వంటి 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించాం. దీంతో వివిధ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తరలి వస్తాయి’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీఏపీసీసీఐ అధ్యక్షులు అనిల్ రెడ్డి వెన్నం, ఉపాధ్యక్షులు గౌర శ్రీనివాస్, అవార్డు కమిటీ చైర్మన్ శేఖర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలు వీరే హిందుస్తాన్ ఏరోనాటికల్స్ (పారిశ్రామిక ఉత్పాదన), ఏజీఐ గ్లాస్‌ప్యాక్ (ఆల్‌రౌండ్ పనితీరు), గుబ్బా కోల్డ్ స్టోరేజ్ లి. (వ్యవసాయాధారిత పరిశ్రమ), మెటల్క్రాఫ్ట్ రోల్ ఫార్మింగ్ ఇండస్ట్రీస్ (మార్కెటింగ్ ప్రణాళికలు), టాటా కాఫీ లి. (ఎగుమతుల పనితీరు), కోస్టల్ కార్పొరేషన్ (ఎగుమతుల పనితీరు (చిన్న తరహా), ప్రీమియర్ సోలార్ సిస్టమ్స్ (సంప్రదాయేతర), బీహెచ్ఈఎల్ (ఉద్యోగుల సంక్షేమం),కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీ కార్పొరే షన్(కార్పొరేట్ సామాజిక బాధ్యత), ఫస్ట్ఆబ్జెక్ట్ టెక్నాలజీస్ (వినూత్న ఉత్పాదన), కాల్టెక్ ఇంజనీరింగ్ (వినూత్న ఉత్పాదన (చిన్నతరహా), రెయిన్ బో స్త్రీ, పిల్లల ఆసుపత్రి (ఆరోగ్య సేవలు), నిమ్రా కేర్గ్లాస్ టెక్నిక్స్ (పరిశోధన, అభివృద్ధి (చిన్నతరహా), సీటీఆర్ఎల్ డేటా సెంటర్స్ (ఐటీ కంపెనీ), తెలంగాణ, ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖలు (టూరిజం ప్రమోషన్), మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె) (ఉత్తమ అసోసియేషన్), డీఆర్డీవో ‘హెచ్’ ప్రొగ్రామ్ డెరైక్టర్ అదాలత్ అలీ (శాస్త్రవేత్త / ఇంజనీర్). -
‘గివ్ ఇట్ అప్’లో తెలంగాణకు 13వ స్థానం
* దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నట్లు కేంద్రం వెల్లడి * తెలంగాణలో రాయితీ వదులుకుంది 33,777 మంది * 2.45 లక్షల మందితో యూపీకి మొదటి స్థానం * ఏపీలో గ్యాస్ రాయితీ వదులుకుంది 45,559 మంది.. దేశంలో 12వ స్థానం సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని.. వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్రం ఆరంభించిన ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,777 మంది వినియోగదారులు తమ గ్యాస్ రాయితీని వదులకున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 14,960, హిందుస్థాన్ పెట్రోలియం 8,768, భారత్ పెట్రోలియం 10,049 మంది వినియోగదారులు రాయితీ వదులుకున్నారని వెల్లడించింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగ చేరడంతో మహిళలు, పిల్లలు ఆనారోగ్యం బారిన పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రభుత్వం రూ.6 వేల రాయితీని అందిస్తోందని, మార్కెట్ ధరకు గ్యాస్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్న సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని, దీనివల్ల మరింతమంది పేదలు రాయితీ సిలెండర్లు పొందే అవకాశం ఉంటుందని పదేపదే చెబుతోంది. కేంద్రం పిలుపునకు స్పందించి దేశవ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారని కేంద్ర పెట్రోలియం శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గివ్ ఇట్ అప్’లో 2.45 లక్షల మంది రాయితీని వదులుకోవడంతో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, మహారాష్ట్రలో 2.26 లక్షల మంది గ్యాస్ రాయితీ వదులుకున్నట్లు తెలిపింది. ఇక ఏపీలో 45,559 మంది వినియోగదారులు రాయితీ వదులకోగా.. అందులో ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 23,318 మంది, హిందుస్థాన్ పెట్రోలియం 16,400 మంది, భారత్ పెట్రోలియం 5,841 మంది ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ కంటే మెరుగ్గా ఏపీ 12వ స్థానంలో ఉంది. -
గ్యాస్ సబ్సిడి వినియోగంపై కేసు నామోదు
భైంసా(ఆదిలాబాద్ జిల్లా): భైంసా పట్టణంలోని కృపా ఇండియన్ గ్యాస్‌లో పని చేసే కంప్యూటర్ సిబ్బందిపై వంట గ్యాస్ సబ్సిడి దుర్వినియోగం చేయడంపై గురువారం చిటింగ్ కేసు నామోదు చేసినట్లు పట్టణ సీఐ వాసుదేవరావు తెలిపారు. భైంసా గ్యాస్ ఏజెన్సిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే కీర్తిరతన్ వంట గ్యాస్ వినియోగదారుల భ్యాంక్ ఖాతాల్లో జమ చేయవలసిన సబ్సిడి నగదును తన బందువుల ఖాతాల్లోకి మళ్ళించారని పిర్యాదు అందిందన్నారు . రూ.ఒక లక్షకు పైగానే వినియోగదారుల సబ్సిడి సోమ్మును తన సంబందికుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించిన వైనంపై భైంసా ఆశాఖ మేనేజర్ అజేయ్‌కుమార్ పిర్యాదు అందజేశారని తెలిపారు. ఈ పిర్యాదు మేరకు చిటింగ్ కేసు నామోదు చేసి దర్యాప్తును చేస్తున్నట్లు వివరించారు. -
గ్యాస్ రాయితీ వదిలించండి!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పేదలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు వీలుగా... సంపన్న వర్గాలు పొందుతున్న గ్యాస్ రాయితీని వదిలించుకొనేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఏటా రాయితీ సిలిండర్ల ద్వారా ఒక్కో కనెక్షన్‌పై దాదాపు రూ.6వేల వరకు సబ్సిడీ భారం పడుతోందని, సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతోద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఆర్థికంగా ఉన్నవారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖపై ఒత్తిడి తెస్తోంది. తాజాగా ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. విస్తృతంగా ప్రచారం: కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయిల్ కంపెనీలు.. ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రచారం మొదలెట్టాయి. మొబైల్ యాప్, ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎస్సెమ్మెస్ ద్వారా అయితే... ‘గీవ్ ఇట్ అప్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి భారత్‌గ్యాస్ వినియోగదారులు 773829899కు, హెచ్‌పీ గ్యాస్ అయితే 9766899899కు, ఇండియన్ గ్యాస్ అయితే 8130792899కు పంపి రాయితీని వదులుకోవచ్చు. హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా, లేదా డిస్ట్రిబ్యూటర్ల వద్ద దరఖాస్తు చేసుకుని సబ్సిడీని వదులుకునే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీల రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్ తెలిపారు. వదులుకున్నది 17వేల మంది ఇప్పటికే కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, ప్రముఖులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 మంది కలిపి 16,964 మంది రాయితీని వదులకున్నారు. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 3,194 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో మరో 2,566 మంది ఉన్నారు. రాయితీని వదులుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల రాజేందర్, పరిటాల సునీత, ఎంపీలు కవిత, కేవీపీ రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పార్వతమ్మ, ఐఏఎస్‌లు కె.పున్నయ్య, రతన్ప్రకాశ్, పింగళి రామకృష్ణారావుతో పాటు ఇతర ప్రముఖుల్లో వైఎస్ భారతి, రామోజీరావు, వి.చాముండేశ్వరినాథ్ తదితరులు ఉన్నారు. వీరి తరహాలో మరింత మంది ముందుకు రావాలని ఆయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. -
సబ్సిడీకి ఎసరు!
- గ్యాస్ సబ్సిడీ రూ.200 రద్దుకు ప్రభుత్వ పన్నాగం - వినియోగదారులకు నచ్చజెప్పి దరఖాస్తులు పూర్తిచేయించాలని హుకుం - గ్యాస్ ఏజెన్సీలకు టార్గెట్లు - త్వరలో స్పెషల్ డ్రైవ్‌లు - ఆసక్తి చూపని వినియోగదారులు విజయవాడ : చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో విలవిల్లాడుతున్న వినియోగదారుడిని మరింత కుంగదీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. వంటగ్యాస్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము రద్దుచేసే ఎత్తుగడ వేసింది. గ్యాస్ సబ్సిడీ సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోండంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రభుత్వం నెమ్మదిగా పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకుంటున్నట్లు దరఖాస్తులు సేకరించాలని గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గ్యాస్ కంపెనీల అధికారులు ఏజెన్సీలకు దరఖాస్తులు పంపి సబ్సిడీ కనెక్షన్లను తగ్గించాలని లోపాయికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో హెచ్పీసీ, ఐవోసీ, బీపీసీ కంపెనీలకు చెందిన 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో 11 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో సంపన్న, ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలకు నచ్చజెప్పి సబ్సిడీ వదులుకునేలా చూడాలని గ్యాస్ కంపెనీలు టార్గెట్ విధించినట్టు సమాచారం. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ నెలకు 200 నుంచి 500 మంది గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా దరఖాస్తులు సేకరించాలని మౌఖిక ఆదేశాలు గ్యాస్ డీలర్లకు అందాయి. టార్గెట్ విధించి సబ్సిడీ దరఖాస్తులు పూర్తి చేయించాలని ఆదేశించడంలో డీలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల అనాసక్తి వినియోగదారులు మాత్రం గాస్ సబ్సిడీ వదులుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రధానమంత్రి పేరుతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఏర్పాటుచేస్తున్న దరఖాస్తులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం సిలిండర్ ఒక్కింటికీ రూ.700 వసూలు చేస్తుండగా, అందులో రూ.200 సబ్సిడీని వినియోగదారుడి ఖాతాకు జమ చేస్తున్నారు. దీనిద్వారా ప్రభుత్వంపై సబ్సిడీ భారం పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ భారం తడిసి మోపెడవటంతో కేంద్రప్రభుత్వం రానున్న కొద్దినెలల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసి సబ్సిడీని ఎత్తివేసే కార్యక్రమం అమలు చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చట్టం చేయకుండా గ్యాస్ సబ్సిడీని రద్దు చేయటానికి పన్నాగం పన్నుతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. -
గ్యాస్ రాయితీ గోవిందా..!
► ప్రభుత్వ సంస్థలకు అందని సబ్సిడీ ► ఆధార్ అనుసంధానంతోనే ఇబ్బందులు ► భారంగా మారిన అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ ► విద్యార్థుల వసతి గృహాల్లోనూ ఇదే సమస్య ► ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్న నిర్వాహకులు సాక్షి, కర్నూలు : గ్యాస్ రాయితీ పొందాలంటే వినియోగదారులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా సంఖ్యలను ఆయిల్ కంపెనీలకు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం రాయితీ నిధులు వారి ఖాతాలకు జమ చేస్తుంది. ఇప్పుడు ఈ నిబంధన ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారి.. గ్యాస్ రాయితీని దూరం చేస్తోంది. ప్రభుత్వమే దీనిపై మళ్లీ ఆలోచించి సడలింపు ఇవ్వకుంటే భారం తప్పని పరిస్థితి నెలకొంది. గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న విషయం విదితమే. గతంలో చమురు సంస్థలకు నేరుగా ఈ రాయితీ నిధులు చేరేవి. నగదు బదిలీ పథకం వచ్చిన తరువాత రాయితీ సొమ్ము వినియోగదారుల ఖాతాల్లోకే చేరుతోంది. పూర్తి ధర పెట్టి గ్యాస్ కొనుగోలు చేసిన తరువాత రాయితీ నిధులు వినియోగదారులిచ్చిన బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అలాగని గ్యాస్ విడుదల చేసిన ప్రతీ వినియోగదారునికి, ప్రతిసారి రాయితీ ఇవ్వడం లేదు. ఏడాదికి 12 సిలిండర్లు మాత్రమే రాయితీ ఇస్తున్న ప్రభుత్వం, ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారికే ఈ లబ్ధి అందిస్తోంది. రాయితీకి దూరం... ప్రభుత్వరంగ సంస్థలైన మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాలు, ఇతర సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. జిల్లాలో సుమారు 2,935 మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు, 196 ఎస్టీ, ఎస్సీ, బీసీ వసతిగృహాలకు, 56 కళాశాల వసతిగృహాలకు, 5,438 అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరితోపాటు చిన్నతరహా వసతిగృహాలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వంట గ్యాస్ అవసరం ఉంది. ఇందుకు వీరంతా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇలా చూస్తే జిల్లాలో సుమారు 6 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 8,600 పైగా ప్రభుత్వ రంగ సంస్థలవే ఉన్నాయి. నగదు బదిలీ పథకం రాకముందు వరకు వీరికి రాయితీపైనే గ్యాస్ అందించారు. కొన్ని నెలలుగా రాయితీపై సిలిండర్లు రావడం లేదు. ఈ కనెక్షన్ల ఆధార్ సంఖ్యలు, బ్యాంకు ఖాతాలు ఇవ్వకపోవడం వల్లే రాయితీ నిధులు విడుదలవ్వడం లేదని చమురు సంస్థల డీలర్లు చెబుతున్నారు. ఆధార్ ఎలా..? రాయితీ రావాలంటే వ్యక్తులు మాదిరిగా బ్యాంకు ఖాతాలు, ఆధార్ సంఖ్యలు ఇవ్వాలి. సంస్థలకు ఇదే పెద్ద సమస్య. బ్యాంకు ఖాతా అయితే సంబంధిత ఏజెన్సీ పేరున ఉంటుంది. లేకుంటే తెరిచి ఇచ్చేయొచ్చు. ఆధార్ సంఖ్య ఇవ్వడమే కష్టమే. గ్యాస్ సిలిండర్లకు మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకురాలు. వసతిగృహాల సంక్షేమాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఆధార్ సంఖ్యలు ఇవ్వాలి. వారి ఆధార్ సంఖ్యలు ఇస్తే వారి సొంత అవసరాలకు ఇబ్బంది ఏర్పడతాయి. పోనీ స్వీయ ప్రయోజనాలను త్యజించి ఇచ్చినా బ్యాంకు ఖాతా ఏజెన్సీ, సంబంధిత ఉద్యోగి పేరున ఉంటే ఆధార్ వ్యక్తి సంఖ్యగా ఉంటుంది. ఈ రెండూ లంకెకుదరకపోతే పరిగణలోకి తీసుకోరు. చాలా కనెక్షన్లు వ్యక్తుల పేరున కాకుండా సంస్థల పేరున ఉండడంతో ఆధార్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా అయితే నష్టమే... రాయితీ ఇవ్వకపోవడం వల్ల మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు, వసతిగృహాల వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగదు బదిలీ వర్తించకపోవడం వల్ల కొన్ని నెలలుగా రాయితీ పొందలేకపోతున్నారు. పూర్తిస్థాయి ధరకు సిలిండరు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో సిలిండర్ రూ. 300కు వరకు నష్టపోతున్నామని ఆయా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం మోపుతోంది. గ్యాస్ రాయితీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, సిలిండరు విడుదలకు రాష్ట్రం నిధులు ఇస్తోంది. కొన్ని ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ నిమిత్తం కొంత నిధులు అందిస్తోంది. అలాంటి ఏజెన్సీలు అదనపు నిధుల భారం మోయకతప్పదు. కాబట్టి రాయితీ వర్తింపుపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని, ఆయిల్ కంపెనీలను ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు. ఇదే అంశాన్ని పౌరసరఫరాల అధికారుల దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ‘గృహవినియోగదారులకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఆధార్ ఇవ్వలేవు. కాబట్టి వారికి రాయితీ వర్తించదు. దీంతో వారు కొంత నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకోవాలి’ అని సమాధానం చెబుతున్నారు. -
'గ్యాస్ సబ్సిడీపై పన్ను లేదు'
న్యూఢిల్లీ: వంటగ్యాస్‌పై ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్న సొమ్ముపై సాధారణ వ్యక్తులకు పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2015 ఆర్థిక బిల్లు సవరణపై పన్ను నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలపై స్పష్టతనిచ్చింది. ఎల్పీజీ సహా సంక్షేమ సబ్సిడీలు సాధారణ వ్యక్తులకు పన్నుల పరిధిలోకి రావని ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. వ్యాపారాలు, ఇతర వృత్తుల ద్వారా ఆదాయాలు పొందే కంపెనీలకు ఎల్పీజీ సబ్సిడీ పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపింది. -
'స్తోమత' ఉంటే గ్యాస్ రాయితీ వదులుకోండి
న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ను మార్కెట్ ధరకు కొనుగోలుచేసే స్తోమత ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే రాయితీని వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎల్పీజీ వినియోగదారులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశంలో 2.80 లక్షల మంది రాయితీని వదులుకుని 'గివ్ ఇట్ ఆప్'లో భాగస్వాములయ్యారని, తద్వా రా రూ.100 కోట్ల ప్రజా ధనం మిగిలిందని ప్రధాని చెప్పారు. ఈ నిధుల ద్వారా మరింత మంది పేదలకు సిలిండర్లు అందజేస్తామన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఇంధన సంగమం(ఉర్జా సంగమ్) సదస్సులో మోదీ మాట్లాడారు. సిలిండర్లపై వదులుకునే రాయితీ పేదల సంక్షేమానికి పనికొస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రభుత్వం ఇంధన భద్రత, పొదుపునకు చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకాన్ని వంద రోజుల్లో పూర్తి చేశామని, 12 కోట్ల మంది బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రాయితీవెళుతోందని తెలిపారు. రాయితీ మిగులు ఫలాల్ని పేదలకు అందజేయడంతోపాటు, సంచార జాతుల వారికి 5 కేజీల సిలిండర్లు అందచేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇంధన రంగం బలోపేతం చేసే దిశగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని, ఇథనోల్‌కు కనీస మద్దతు ధర కల్పించామని చెప్పారు. బంజరు భూముల్లో జట్రోపా సాగు చేసి బయోడీజిల్ రూపంలో అభివృద్ధి చేయాలని రాష్ట్రాలను కోరామన్నారు. గ్యాస్ గ్రీన్ నెట్వర్క్ విస్తరణ చేపట్టి పట్టణాల్లోని కుటుంబాలకు పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. నాలుగేళ్లలో కోటి మందికి పైపులైన్ల ద్వారా గ్యాస్ అందజేస్తామని చెప్పారు. -
ఉన్నత వర్గాలకు గ్యాస్ రాయితీ ఎత్తివేత
న్యూఢిల్లీ : ఉన్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే ఎంపీలు స్వచ్ఛందంగా గ్యాస్ రాయితీని వదులుకోవాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో సూచించారు. ఇప్పటివరకూ పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాలకు కూడా కేంద్రం వంట గ్యాస్‌లో రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం ఇచ్చే రాయితి ఇక నుంచి ఎంపీలు వదులుకోవాల్సిందే. -
గ్యాస్ రాయితీ రద్దు
- ఆధార్‌తో అనుసంధానమైతేనే సబ్సిడీ - 15 నుంచే అమలు - డీబీటీఎల్కు జంటజిల్లాల్లో - ఏడు లక్షల మంది దూరం - మార్కెట్ ధరపైన సిలిండర్ సరఫరా సాక్షి, హైదరాబాద్: మీ గ్యాస్ కనెక్షన్ ఆధార్‌తో అనుసంధానం కాలేదా? అయితే సిలిండర్‌పై రాయితీ ఆగిపోనుంది.. ఇక నుంచి మార్కెట్ ధరపైనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఆదివారం నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా, డీలర్ పేరు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు ఏడు లక్షల మంది వినియోగదారులు అదనపు భారాన్ని మోయనున్నారు. ప్రస్తుతం జంట జిల్లాల్లో సుమారు 29 లక్షల ఎల్పీజీ గృహా వినియోగదారులు ఉన్నారు. అందులో బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన 22.24 లక్షల వినియోగదారులకు మార్కెట్ ధరపై సిలిండర్ సరఫరా జరుగుతోంది. సిలిండర్ సబ్సిడీ నగదు రూపంలో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. అనుసంధానికి దూరంగా 6.76 లక్షల వినియోగదారులకు మాత్రం వెసులుబాటు కారణంగా ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా అవుతూ వచ్చింది. ఇప్పటి వరకూ వారు అనుసంధానం చేసుకోక పోవడంతో మార్కెట్ ధరకు సిలిండర్ కొనుగోలుచేసుకోవాలి. ప్రస్తుతం డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.675.50పైసలు. ఆధార్‌తో అనుసంధానం అయిన వారికి సబ్సిడీ రూ.219లు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సబ్సిడీ పొందాలనుకుంటే తప్పనిసరిగా ఎల్పీజీని ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవల్సిందే.. మరో మూడు నెలల గడువు.. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ఎల్పీజీ (డీబీటీఎల్) పథకం గడువు ఫిబ్రవరి 14తో ముగిసింది. మే 15వ తేదీలోగా అనుసంధానం చేసుకుంటే మూడు నెలల్లో ఎన్ని సిలిండర్లు తీసుకున్నారో వాటికి ఒకేసారి సబ్సిడీ జమ అయ్యే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఎటువంటి రాయితీ పొందే అవకాశం ఉండదు. -
‘ఉన్నతం‘గా వదులుకునేలా చేయండి
గ్యాస్ సబ్సిడీ వదులుకునేలా ఉన్నతవర్గాల్లో ప్రచారం చేయాలి మరింతమంది పేదలకు అందేలా అవగాహన కల్పించాలి రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియంశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నతవర్గాలూ గ్యాస్ సబ్సిడీ ని వదులుకోండి..జాతి నిర్మాణానికి సహకరించండి’ అనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఉన్నతవర్గాలు వదులుకునే సబ్సిడీతో మరింతమంది పేదలకు ఎల్పీజీని అందించే అవకాశం ఉంటుందని, దీనిద్వారా దీర్ఘకాలంలో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలతో కూడిన లేఖను పంపింది. దేశంలో 36 శాతం కుటుంబాలు ఇప్పటికీ వంటచెరుకు, పిడకలపై ఆధారపడి వంట చేసుకుంటున్నాయని, దీనివల్ల ఇంట్లో పొగచూరడంతో పిల్లలు, మహిళలు కాలుష్యం బారినపడుతున్నారని పేర్కొంది. ప్రతి ఏటా సబ్సిడీ సిలిండర్ ద్వారా రూ.6 వేల రాయితీని ప్రభుత్వం అందిస్తోందని, ఉన్నతవర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకువస్తే ఆర్థికంగా వెనుకబడిన మరింతమందికి గ్యాస్ సిలిండర్ అందే అవకాశం ఉంటుందని తెలిపింది. ఎల్పీజీ సబ్సిడీని వదులకునే విధానాన్ని సైతం ప్రభుత్వం సరళీకృతం చేసిందని, సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి... లేదా డిస్ట్రిబ్యూటర్లకు తెలిపైనా సబ్సిడీని వదులుకోవచ్చని పేర్కొంది. పొగవచ్చే పొయ్యిలతో వంట చేసుకుంటున్న పేద ప్రజల సంక్షేమం, జాతి నిర్మాణం కోసం ఉన్నతవర్గాలు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా ప్రచారం చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. -
గ్యాస్ సబ్సిడీని వదులుకుంటున్నా:కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌కు ఇస్తున్న సబ్సిడీని తాను వదులుకుంటున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్యాస్ వినియోగదారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇంధనశాఖకు తెలియజేస్తానన్నారు. -
నగదు బదిలీలో గోల్మాల్..!
చిత్తూరులో కొంగారెడ్డిపల్లెకు చెందిన సంజీవరెడ్డి(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 28 6509) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. అదే రోజున ఒక నెల రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.568 బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం వచ్చింది. చిత్తూరులో బీవీ రెడ్డి కాలనీ కి చెందిన రామ్మోహన్‌రాజు (గ్యాస్ కనెక్షన్ నెంబర్ 35 09) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నా రు. ఆ తర్వాత కొద్ది నిముషాలకే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.468 జమా చేస్తున్నట్లు సెల్‌ఫోన్‌కు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. చిత్తూరులో మార్కెట్ వీధికి చెందిన ధనశేఖర్(గ్యాస్ కనెక్షన్ నెంబర్ 16292) ఈనెల 3న సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన బ్యాంకు ఖాతాలో గ్యాస్ రాయితీ అడ్వాన్సు రూపంలో రూ.343 జమ అయినట్లు ఎస్ఎంఎస్ రూపంలో సెల్‌ఫోన్‌కు సమాచారం వచ్చింది. గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో గోల్‌మాల్‌కు ఇదో తార్కాణం. అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తామన్న సర్కారు.. అధికశాతం మందికి రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారని మండిపడుతున్నారు. * నగదు బదిలీ పేరుతో గ్యాస్ రాయితీలో కోత వేస్తున్న ప్రభుత్వం * తొలి నెల అడ్వాన్సుగా రూ.568 జమ చేస్తామంటూ ప్రకటనలు * కానీ అధికశాతం లబ్ధిదారులకు రాయితీలో రూ.200కు పైగా కోత * రాయితీలో భారీగా కోత వేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన! సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాత కథే పునరావృత్తమవుతోంది..! గ్యాస్ రాయితీకి వర్తింపజేస్తున్న నగదు బదిలీ పథకంలో లోపాలు బహిర్గతమవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలో రూ.200 వరకు కోత విధిస్తుండ డంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ప్రజల పొట్టకొట్టి గ్యాస్ రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికే నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తున్నారన్న విమర్శలకు ఇది బలం చేకూర్చుతోంది. విపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని అమలుచేయడం రద్దు చేయాలంటూ ఉద్యమించిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే ‘యూ’టర్న్ తీసుకున్నాయి. నగదు బదిలీ పథకమే ముద్దంటున్నాయి. పనిలో పనిగా నవంబర్, 2014 నుంచే గ్యాస్ రాయితీకి నగదు బదిలీని వర్తింపజేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా పథకాన్ని అమలుచేశారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేసుకున్న ఏ ఒక్క లబ్ధిదారునికి రాయితీని ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు. జనవరి 1 నుంచి గ్యాస్ రాయితీకి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్(14.2 కిలోల) పూర్తి ధర రూ.768.50 కేంద్రం ఇచ్చే రాయితీ రూ.450. నవంబర్ ముందు వరకూ లబ్ధిదారుడు సిలిండర్ డెలివరీ చేసేటపుడు రూ.318.50 చెల్లించేవారు. జూన్ 1 నుంచి నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తున్న నేపథ్యంలో రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారులకు తొలి నెల అడ్వాన్సు రాయితీ కింద రూ.568 జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. నాలుగు రోజులుగా రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారుల్లో 90 శాతం మందికిపైగా సగటున రూ.343 మాత్రమే అడ్వాన్సు రాయితీ రూపంలో జమ కావడం గమనార్హం. ప్రభుత్వం చేసిన ప్రకటనకూ.. క్షేత్ర స్థాయిలో అమలు తీరుకూ భారీ వ్యత్యాసం ఉండటంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఆందోళనలో లబ్ధిదారులు.. నిరుపేద లబ్ధిదారులు ముందే పూర్తి ధర వెచ్చించి సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేయించుకోలేరనే భావనతో ప్రభుత్వం తొలి అడ్వాన్సుగా రాయితీ కింద రూ.568 జమ చేస్తామని పేర్కొంది. కానీ.. అడ్వాన్సును జమ చేయడంలోనే గోల్మాల్ చోటుచేసుకోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికీ కొంత మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు లేకపోవడంతో గ్యాస్ రాయితీ వారికి దక్కకుండా పోతోంది. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ.. ఇప్పటిదాకా 6.79 లక్షల మంది లబ్ధిదారుల గ్యాస్ సర్వీసు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం(సీడింగ్‌ను) పూర్తిచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. అంటే.. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. దీన్నెప్పుడు పూర్తిచేస్తారన్న అంశంపై అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడంలేదు. ఇక ఆధార్ సీడింగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల అధికశాతం మంది లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కావడం లేదు. లబ్ధిదారుడి గ్యాస్ కనెక్షన్ నంబర్.. ఆధార్ నంబర్.. బ్యాంకు ఖాతా నంబరును అనుసంధానం చేయడంలో తప్పులు దొర్లడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోగానే.. ముంబయిలోని ప్రధాన కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఆ వెంటనే ఆన్లైన్లో సంబంధిత లబ్ధిదారుని ఖాతాలో రాయితీని జమ చేస్తారు. సీడింగ్‌లో తప్పులు దొర్లడం వల్ల లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ జమ కావడం లేదు. ఈ తప్పులను సరిదిద్దడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. నాటి ఉద్యమాలు దేనికో.. యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2013 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు రాయితీని నగదు బదిలీ రూపంలో జమ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అప్పట్లోనే లబ్ధిదారుల గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలను సీడింగ్ చేశారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ నగదు బదిలీ రూపంలోనే గ్యాస్ రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. సీడింగ్‌లో లోపాలు ఉండడం వల్ల అధికశాతం మందికి రాయితీ జమ కాకపోవడం.. ఆధార్ లేకపోవడం వల్ల గ్యాస్ రాయితీ దక్కకుండా పోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఇదే అదునుగా తీసుకున్న టీడీపీ, బీజేపీలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజాగ్రహానికి దిగివచ్చిన యూపీఏ సర్కారు డిసెంబర్, 2013 నుంచి నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసిన విషయం విదితమే. అప్పట్లో నగదు బదిలీకి వ్యతిరేకంగా ఉద్యమించిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడు అదే అమలుచేస్తోండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గ్యాస్ ‘కష్టాలు’ బదిలీ
నేటి నుంచి నగదు బదిలీ పథకం అమలు గ్యాస్ సిలిండర్ ధర రూ.752 కేంద్రం ఇచ్చే రాయితీ రూ.568 బుక్ చేయగానే అడ్వాన్స్ జమ తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర కానుకగా గ్యాస్ లబ్ధిదారులకు కష్టాలను బదిలీ చేశారుు. గ్యాస్ రాయితీ నగదు గురువారం నుంచి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రీ ఫిల్లింగ్ కోసం లబ్ధిదారుడు బుక్ చేసుకోగానే ఖాతాలో అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తారు. పూర్తి ధర వెచ్చించి రీ ఫిల్లింగ్ చేయించుకున్నాకనే రాయితీని ఖాతాలో జమ చేస్తారు. అంటే ఇకపై గ్యాస్ సర్వీసు నంబరు, ఆధార్ కార్డు నంబరు, బ్యాంకు ఖాతా నంబరును అనుసంధానం చేసుకోని లబ్ధిదారులకు అందదు. అనుసంధానం చేసుకున్నా సాంకేతిక మార్పులు తలెత్తితే రాయితీ దక్కదు. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇదే పద్ధతిని అనుసరించినప్పుడు బీజేపీ, టీడీపీలో ఉద్యమాలు చేశారుు. నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని పట్టుబట్టారుు. ఇప్పుడు పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు పట్టుబట్టి నగదు బదిలీ పథకాన్ని అమలుచేస్తోండటం గమనార్హం. అప్పుడు ఉద్యమాలు.. ఇప్పుడు నీతులా..? గ్యాస్ రాయితీకి నగదు బదిలీని వర్తింపజేయడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జనానికి దన్ను బీజేపీ, టీడీపీలు భారీ ఎత్తున ఉద్యమాలు చేశాయి. డిసెంబర్ 3, 2013న గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. కేంద్రం అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఆదిలోనే గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేస్తామని నవంబర్ 10, 2014న ప్రకటించింది. జిల్లాలో జనవరి 1, 2015 నుంచి గ్యాస్ రాయితీని నగదు బదిలీ రూపంలో లబ్ధిదారులకు నేరుగా అందిస్తామని స్పష్టం చేసింది. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 6.79 లక్షల మంది లబ్ధిదారుల గ్యాస్ సర్వీసు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం పూర్తిచేశారు. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో లబ్ధిదారులు పూర్తి ధర వెచ్చించి గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేయించుకున్నారు. ఆ రెండు నెలల రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జనవరిలో జమ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. బుక్ చేసుకోగానే అడ్వాన్సు జమ .. సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోగానే లబ్ధిదారుడి ఖాతాలో అడ్వాన్సు రూపంలో రూ.568 ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ పూర్తి ధర రూ.752. కేంద్రం ఇచ్చే రాయితీ రూ.568. తొలి నెల మాత్రమే ప్రభుత్వం అడ్వాన్సు రూపంలో రాయితీని జమ చేస్తుంది. రెండో నెల నుంచి లబ్ధిదారుడు పూర్తి ధర వెచ్చించి గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేసుకోవాలి. సంబంధిత డీలర్ సిలిండర్ డెలివరీ పత్రాన్ని ఆన్లైన్లో పొందుపరిచితేనే లబ్ధిదారుడి ఖాతాలో రాయితీ జమ అవుతుంది. డీలర్ డెలివరీ పత్రాన్ని ఆన్లైన్లో పొందుపర్చకపోయినా.. సీడింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా లబ్ధిదారుడికి రాయితీ దక్కదు. విపక్షంలో ఉన్నప్పుడు వద్దన్న బీజేపీ, టీడీపీలు అధికారాన్ని చేజిక్కించుకోగానే నగదు బదిలీ ప్రవేశ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేటి నుంచి గ్యాస్ సబ్సిడీ బ్యాంకు ఖాతాకే
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్‌ను గృహావసరాల కోసం ఇప్పటి వరకు సబ్సిడీపై అందిస్తున్న కేంద్రం ఇకపై ఆ సబ్సిడీని వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో ఇది అమలవుతుండగా గురువారం(జనవరి 1) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దీంతో వినియోగదారులు మార్కెట్ ధర ఎంతుంటే, అంత చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాలి ఉంటుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం 568 రూపాయలను సబ్సిడీగా అందిస్తోంది. సిలిండర్ ధర (ఢిల్లీ మార్కెట్) రూ.752గా ఉంది. -
మేం వ్యతిరేకం
గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే(నగదు బదిలీ) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం లేఖాస్త్రం సంధించారు. ఈ విధానం నుంచి తమిళనాడును మినహాయించాలని విన్నవించారు. సాక్షి, చెన్నై: గ్యాస్ సబ్సిడీకి ఆధార్ లింక్ పెట్టడం, వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీని జమ చేసే విధంగా గత యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ ప్రయత్నాలు ఆగాయి. కేంద్రంలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన మోడీ ప్రభుత్వం పాత పాటను అందుకుంటోంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ గ్యాస్‌కు లింకు పెట్టే పనిలో పడింది. అలాగే గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ రెండో వారం నుంచి కొన్నిచోట్ల ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. మిగిలిన చోట్ల వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లను డీలర్లు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత వ్యతిరేకించారు. తాజాగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం లేఖ రాశారు. ఇదీ సారాంశం: గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేసే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో గ్యాస్ విని యోగదారులు అధికంగా ఉన్నారని, కేంద్రం లాగే తామూ సబ్సిడీని అందిస్తున్నామని వివరించారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారి తీస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఖాయం అన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తారో వినియోగదారులకు తెలియని పరిస్థితులు ఏర్పాడతాయని వివరించారు. అలాగే సబ్సిడీ పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యూపీఏ చర్యను గతంలో వ్యతిరేకించిన వారు నేడు అదే బాటలో నడవడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమిళనాడులో బ్యాంక్ సేవలు లేని గ్రామాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈ ప్రజలకు సబ్సిడీ ఎలా ఇవ్వగలరని ప్రశ్నిం చారు. బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ పథకం తమిళనాడులో అమలుకు సాధ్యం కాదని, ఈ దష్ట్యా తమకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. -
ఆధార్ లేకున్నా గ్యాస్ నగదు బదిలీ
* మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం * ఆధార్ లేకున్నా బ్యాంక్ ఖాతాలో రాయితీ జమ * మొదటి మూడు నెలలు యథావిధిగా రాయితీ * తర్వాత మూడు నెలలకు బ్యాంకు ఖాతా ఇచ్చాకే రాయితీ * పథక పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు, జనవరి నుంచి మిగతా జిల్లాల్లో ప్రారంభం కానున్న గ్యాస్ నగదు బదిలీకి సంబంధించి ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారధి వాటిని విడుదల చేశారు. దీనిప్రకారం కేంద్రం చేసిన కొన్ని మార్పులు చేర్పులను అందులో వివరించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం పథక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర కమిటీలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఛైర్మన్‌గా బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, ఆయిల్ కంపెనీల స్టేట్ లెవల్ కో-ఆర్డినేటర్, ఐఓసీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్, బీపీసీఎల్ ప్రాంతీయ మేనేజర్, మీ సేవ డెరైక్టర్, ఆధార్ ప్రాజెక్టు మేనేజర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఎస్ఓలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కో-ఆర్డినేటర్, లీడ్ బ్యాంకు మేనేజర్, డీఎస్ఓ, మీసేవా మేనేజర్, ఆయిల్ కంపెనీల నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరంతా కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి. మార్గదర్శకాలు ఇవీ.. * ఎల్పీజీ, బ్యాంక్ ఖాతాల్లో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాల్లోకి వెళుతుంది. ఆధార్ లేకున్నా డీలర్‌కు బ్యాంక్ అకౌంట్ ఇస్తే సంబంధిత బ్యాంక్ అకౌంట్‌కు రాయితీ జమ అవుతుంది. * మొదటి మూడు నెలల పాటు ఈ పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా తొలి మూడు నెలలు రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారు. అయితే తర్వాత మూడు నెలలపాటు రాయితీ ఇవ్వరు. అయితే బ్యాంక్ ఖాతాను ఇవ్వగానే రాయితీ మొత్తాలు అన్నీ ఆ ఖాతాలో జమ అవుతాయి. పథకంపై కేంద్రం చేసిన సూచనలు * పథకంపై ప్రజల్లో అవగాహ కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి. * ఆధార్ సంఖ్య కోసం కొత్త ఎన్రోల్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. * కలెక్టర్లు ఆయిల్ కంపెనీల కో ఆర్డినేటర్లకు తగిన సహాయ సహకారాలు అందించాలి. * ఆధార్,ఎల్పీజీ, బ్యాంకు కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం ఇలా..
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సబ్సిడీకి ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో గ్యాస్ బుక్ చేసిన వెంటనే సబ్సిడీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తారు. గతంలో ఆధార్‌ను లింక్ చేసుకున్న వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ కోసం ఆధార్ అనుసంధానం చేసుకోని వారు సంబంధిత గ్యాస్ డీలర్ వద్ద ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలి. లేదంటే నాన్ సబ్సిడీ కింద సిలెండర్ వస్తుంది. దీని ధర రూ.969గా ఉంటుంది. -కుత్బుల్లాపూర్ ఆధార్‌తో గ్యాస్ అనుసంధానం ఇలా... ఇందుకు డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ఆఫ్ ఎల్పీజీ సబ్సిడీ ఫామ్‌ను పూర్తి చేయాలి. ఇందులో మీ ఆధార్ నంబరు, కంజుమర్ గ్యాస్ నంబరు, రిజిష్టర్ ఫోన్ నంబరు తదితర అంశాలు పొందుపర్చాలి. ఆధార్ కార్డు జిరాక్స్, గ్యాస్ పాస్ బుక్ జిరాక్స్, తాజాగా పొందిన బిల్ రశీదును జత చేయాలి. బ్యాంక్ అనుసంధానం ఇలా... ఇందుకు బ్యాంక్ అకౌంట్-ఆధార్ లింకేజ్ ఫామ్ పూర్తిచేయాలి. ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, మీ ఆధార్ నంబరు పొందుపర్చి, దాని జిరాక్స్ జత చేయాలి. ఆధార్ కార్డు లేని వారు ఇలా... మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి సంబంధిత దరఖాస్తును తీసుకోండి. అందులో నిర్దేశిత కాలంలో వివరాలు నింపండి. అన్ని పూర్తయ్యాక మీ దరఖాస్తును ఏజెన్సీ వారికి ఇస్తే వారు ఒక ఎల్పీజీ ఐడిని కేటాయిస్తారు. రెండో ఫామ్‌లో కేటాయించిన ఎల్పీజీ ఐడిని పేర్కొని దాన్ని బ్యాంక్‌లో అందించండి. ఈ నంబరుతో మీ ఎకౌంట్‌ను అనుసంధిస్తారు. నోట్: బ్యాంక్, ఆధార్ లింక్ చేసే దరఖాస్తులు ఫామ్-1, ఫామ్-2 సంబంధిత వెబ్‌లో అందుబాటులో ఉంటాయి. కానీ ఫామ్-3, ఫామ్-4లు మాత్రం ఏజెన్సీల వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అందించడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఆధార్ కార్డు లేనివారు ఈలోగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొని, కార్డు వచ్చిన వెంటనే గ్యాస్ ఏజెన్సీ వారికి అందజేయాలి. టోల్ ఫ్రీ నంబర్: 1800 233 3555 -
దేశం కోసం సబ్సిడీ వదులుకో!
-
దేశం కోసం సబ్సిడీ వదులుకో!
► స్వచ్ఛందంగా ముందుకు రావాలని గ్యాస్ కంపెనీలతో కేంద్రం ప్రచారం ► దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపు ► ఆధార్ వివరాల ఆధారంగా వినియోగదారులకు సందేశాలు ► ఆన్లైన్లోనే సబ్సిడీని వదులుకునే ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌పై సబ్సిడీని పేద వర్గాలకే పరిమితం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై గ్యాస్ సబ్సిడీ పెనుభారంగా మారిన నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారితోనే ‘స్వచ్ఛంద గ్యాస్ సబ్సిడీ ఉపసంహరణ’ హామీని పొందే దిశగా తొలి అడుగు వేసింది. ‘మాతో కలిసి రండి.. దేశ నిర్మాణం దిశగా’ అంటూ ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా గ్యాస్ సబ్సిడీ నుంచి అధికాదాయవర్గాలను స్వచ్ఛందంగా దూరం చేయాలని చూస్తోంది. ఈ మేరకు చమురు సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. తదనుగుణంగా ఆయా కంపెనీలు గ్యాస్ వినియోగదారులను ‘చైతన్యం’ చేసే దిశగా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇప్పటి కే ఆధార్ కార్డులు పొంది, గ్యాస్ కనెక్షన్లతో అనుసంధానం చేసుకున్న వినియోగదారుల నుంచి అధికాదాయ వర్గాలను గుర్తిస్తున్నాయి. వారి మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు(ఎస్ఎంఎస్) పంపిస్తున్నాయి. ఆయా గ్యాస్ కంపెనీల వెబ్సైట్లలోనూ ఈ మేరకు ‘ఆప్ట్ అవుట్ సబ్సిడీ’ పేరుతో కేటగిరీని ఏర్పాటు చేశాయి. సబ్సిడీ అవసరం లేదనుకునే వినియోగదారులు ఇందులో స్వచ్ఛందంగా తమ గ్యాస్ కనెక్షన్ నంబర్, గ్యాస్ కంపెనీ డీలర్ పేరును పొందుపరిస్తే, మరుసటి నెల నుంచి సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్‌ను అందించే ఏర్పాట్లు చేశాయి. దేశభక్తిని ప్రేరేపిస్తూ...: ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపిస్తూ సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు తమ వెబ్సైట్లను వేదికగా మార్చుకున్నాయి. స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తూ ‘గివ్ అప్ సబ్సిడీ’ లింక్‌ను ఆప్షన్‌గా ఇచ్చాయి. ఈ లింక్‌ను క్లిక్ చేసి ఎవరైనా స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవచ్చు. అలా చేసిన వారి పేర్లను ‘స్క్రోల్ ఆఫ్ ఆనర్’ కింద గ్యాస్ కంపెనీలు తమ వెబ్సైట్లలో పొందుపరిచి గౌరవించనున్నాయి. స్పందన అంతంత మాత్రమే! సబ్సిడీని వదులుకోవాలంటూ ఆయిల్ కంపెనీల ప్రచారం ఇటీవలే మొదలైంది. అయితే దేశవ్యాప్తంగా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మొబైల్ఫోన్ల ద్వారా ‘చైతన్యం’ తీసుకొచ్చే కార్యక్రమానికి ఆ సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇండేన్ గ్యాస్ వినియోగదారుల్లో 1,470 మంది నాన్ సబ్సిడీకి స్వచ్ఛందంగా ముందుకు రాగా, రూ. 88.20 లక్షలు ఆదా అయినట్లు ఆ కంపెనీ పేర్కొంది. భారత్ గ్యాస్ వినియోగదారుల్లో 406 మంది సబ్సిడీని వదులుకోవడంతో రూ. 24.36 లక్షలు మిగిలాయి. హెచ్‌పీ గ్యాస్‌కు సంబంధించి 368 మంది వల్ల రూ. 22.08 లక్షలు ఆదా అయ్యాయి. కాగా, సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ ప్రస్తుతం రూ. 450కి లభిస్తుండగా, సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 1,100గా ఉంది. మొత్తానికి ఆయిల్ కంపెనీల సంక్షిప్త సమాచారాలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. -
ఆధార్ పడాల్సిందే
అన్ని పథకాలకు వర్తింపు జాడలేని నమోదు కేంద్రాలు ఆందోళనలో ప్రజానీకం విజయవాడ : ఆధార్ అవస్థలు తొలిగిపోయాయన్న సంబరం ప్రజలకు ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ అన్ని పథకాలకు ఆధార్ వర్తింపజేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో మళ్లీ ఆధార్ పాట్లు మొదలయ్యాయని జనం ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో ఆధార్ నమోదు కేంద్రాల జాడ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నెల నుంచి వృద్ధాప్య పింఛను పొందడానికి తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే ఆగస్టు 15వ తేదీ నాటికి రేషన్ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. నమోదు కేంద్రాలేవీ.. జిల్లాలో 45,17,398 మంది జనాభా ఉంటే 43,83,120 మంది ఆధార్ కార్డు కోసం ఐరిస్ తీయించుకున్నారు. మరో 1,34,278 మంది ఆధార్ దిగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఆధార్ కేంద్రాలు బాగానే పనిచేశాయి. కానీ ఇప్పుడు ఎక్కడా కానరావడం లేదు. గ్యాస్ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి అని నిబంధన విధించడంతో ప్రజలు ఆధార్‌కు ఐరిస్ తీయించుకునేందుకు పరుగులు తీశారు. వారి నుంచి ఒత్తిడి రావడంతో యూపీఏ సర్కారు గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అక్కర్లేదని ఉత్తర్వులు ఇవ్వడంతో తీయించుకోనివారికి కాస్త ఊరట లభించింది. ఆధార్ ఉంటేనే పింఛను.. వచ్చే నెల నుంచి ఆధార్ కార్డు ఉంటేనే పింఛను ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛనుదారులు 3,14,910 మంది ఉన్నారు. వీరిలో 2,50,749 మందికి ఆధార్ కార్డులున్నాయి. ఇంకా 64,161 మంది పింఛనుదారులకు ఆధార్ నంబర్లు లేవని అధికారులు గుర్తించారు. ఆధార్ లేని వారికి జూలై నెలలో పింఛను ఇస్తున్నా, ఆగస్టు నుంచి ఇవ్వబోమని సిబ్బంది చెబుతున్నారు. దీంతో పింఛనుదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆధార్ కేంద్రాల జాడ కోసం ఆరాతీస్తున్నారు. మళ్లీ గ్యాస్‌కు ఆధార్ లింకు.. వంటగ్యాస్ సరఫరాకు కూడా ఆధార్ నంబరు తప్పనిసరి అనే నిబంధనలు రానున్నాయని చమురు కంపెనీల అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అన్ని కంపెనీలకు సంబంధించి 10,94,104 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 8,59,071 మంది ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 2,35,033 మంది గ్యాస్ వినియోగదారులకు ఆధార్ కార్డు లేదని అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల్లో గ్యాస్ సరఫరాకు కూడా ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. త్వరలో 35 శాశ్వత కేంద్రాలు.. త్వరలో జిల్లా వ్యాప్తంగా 35 శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి పి.బి.సంధ్యారాణి చెప్పారు. ఆధార్ లేని వారందరూ వెంటనే ఐరిస్ తీయించుకోవాలని పేర్కొన్నారు. గతంలో ఆధార్ దిగి కార్డులు రాని వారు దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి కార్డులు తీసుకోవాలని చెప్పారు. -
‘ఆధార్ కట్’ తాత్కాలికమేనట!
డీలర్లకు అందని ఆధార్ లింకు తొలగింపు సమాచారం సాఫ్ట్వేర్ మార్పు చేయూలంటే ఐదు రోజులు అవసరం 8.60 లక్షల మంది వినియోగదారులకు ఊరట ఈ విధానాన్ని శాశ్వతంగా తొలగించాలంటున్న వినియోగదారులు సాక్షి, ఏలూరు : గ్యాస్ సబ్సిడీపై ఆధార్ లింకును తొలగిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ చమురు సంస్థలకు ఆదేశాలివ్వడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అరుుతే, ఇదంతా తాత్కాలిక ఊరటేనని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల అనంతరం ఈ నిబంధన తిరిగి అమలులోకి వచ్చే అవకాశం లేకపోలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ.440 చెల్లిస్తే చాలు గ్యాస్ సిలెండర్ ధర రూ.1,324కు చేరింది. ఇటీవలే ఈ ధరలో రూ.107 తగ్గించారు. కేంద్ర పెట్రోలియం శాఖ తాజా నిర్ణయంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను ఒక్కొక్క సిలిండర్‌కు సుమారు రూ.440 చొప్పున నేరుగా చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఆధార్ లింకును తొలగిస్తున్నట్టు ప్రభుత్వం చమురు సంస్థలకు ఆదేశాలిచ్చినప్పటికీ.. జిల్లాలోని గ్యాస్ డీలర్లకు ఆ సమాచారం అందలేదు. ఇదిలావుండగా సాఫ్ట్‌వేర్‌ను కొత్త ధరకు తగ్గట్టుగా మార్చిన తర్వాత నుంచే పాత పద్ధతిలో గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా డీలర్లకు అదేశాలు అందే అవకాశం ఉంది. ఈ తతంగం పూర్తికావడానికి ఐదు నుంచి వారం రోజుల సమయం పట్టవచ్చంటున్నారు. ఈ లోగా సిలిండర్ తీసుకోవాలనుకునే వారు పూర్తి ధర చెల్లించాల్సిందే. -
గ్యాస్ సబ్సిడీ గల్లంతు
సగం మందికి ఎగనామం సబ్సిడీ లేకుండా సొమ్ము వసూలు 10 వేల మంది బాధితులు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వ్యవహారం రోజురోజుకూ గందరగోళంగా మారుతోంది. ఆధార్ నంబరు ఇచ్చినా బ్యాంకుల్లో అనుసంధానం కాని పరిస్థితి కొందరిది.. ఆధార్ అనుసంధానమైనా సబ్సిడీ సొమ్ము బ్యాంకుల్లో పడని స్థితి మరికొందరిది. అసలు ఆధార్ అనుసంధానమే అక్కర్లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా దానిని నేటికీ అమలులోకి తీసుకురాకపోవడంతో వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ప్రక్రియను సమీక్షించేందుకు ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసే నాథుడే కరువయ్యారు. సబ్సిడీ లేకుండా వసూళ్లు... సబ్సిడీ గ్యాస్‌కు ఆధార్ లింక్ తీసేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆ మేరకు ఉత్తర్వులు ఏజెన్సీలకు నేటికీ అందలేదు. ఫలితంగా ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాని వినియోగదారుల నుంచి ఏజెన్సీలు సబ్సిడీ లేకుండా రూ.1210 వసూలు చేస్తున్నాయి. ఆధార్ నంబరు రానివారు, బ్యాంకులతో అనుసంధానం కానివారు సబ్సిడీ లేకుండా గ్యాస్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా నానా ఇక్కట్లు... జిల్లాలో గత వారం రోజులుగా ఆధార్ నంబర్లు ఇచ్చిన వారికి కూడా సబ్సిడీ సొమ్ము బ్యాంకులకు సరిగా పడటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సబ్సిడీ సొమ్ము వినియోగదారుల ఖాతాల్లో పడిపోయిన ట్లు చూపిస్తోంది. వాస్తవానికి అవి ఖాతాల్లో జమపడటం లేదు. జిల్లాలో 74 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా విజయవాడ నగరంలో 21 ఉన్నాయి. ఒక్కో గ్యాస్ ఏజెన్సీలో ఫిబ్రవరిలో 100 నుంచి 200 మంది వరకు వినియోగదారులకు బ్యాంకులో సబ్సిడీ సొమ్ము జమ కాలేదు. ఈ లెక్కన జిల్లాలో 74 ఏజెన్సీలలో పదివేల మందికిపైగా వినియోగదారులకు సబ్సిడీ జమకాలేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వహణ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వినియోగదారులు సబ్సిడీ సొమ్ము కోసం నానా ప్రయాసలు పడుతున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు. -
గ్యాస్‌కు ఆధార్ అక్కర్లేదు
-
‘లింక్’ తెగింది
కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్‌తో ఉన్న లింక్‌ను తెంచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో ఇంకా నమోదు చేసుకోని 2,84,372 మందికి మేలు చేకూరింది. ఈ నమోదుకోసం ఇన్నాళ్లూ ఒత్తిడికి గురైన వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సబ్సిడీ సిలిండర్లను కూడా 9నుంచి 12కు పెంచడం కూడా అన్ని వర్గాలకూ ఉపశమనం లభించే చర్యే. ఫిబ్రవరి 1 నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమలుల్లోకి రా నుంది. దీంతో ఆధార్ కార్డు ఉన్న వారికే సబ్సిడీ, లేదంటే నాన్ సబ్సిడీ సిలిండర్లను పొందుకోవాల్సి ఉంటోంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం జిల్లాలో ఆధార్ నమోదు చేసుకోని వారందరికి విముక్తి కలిగింది. గత 8నెలలుగా ఆధార్ ఉంటేనే సబ్సిడీ గ్యాస్ ఇస్తామని అధికారులు, డీలర్లు సైతం వినియోగదారుల్ని భయబ్రాంతులకు గురిచెయ్యడంతో ఆధార్ కార్డులున్న వారంతా నమోదు చేసుకోవడంలో నానా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇక చాలా మందికి ఆధార్ కార్డుల్లేక వారి బాధలు చెప్పుకోలేనివిగా మారాయి. 38శాతం పూర్తి...... జిల్లా వ్యాప్తంగా బ్లాక్ అయిన నెంబర్లను మినహాయిస్తే ఇప్పటి వరకు భారత్, హెచ్‌సి, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల్లో 4,62,144మందిపైగా వినియోగదారులున్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,77,772 మంది వరకు ఆధార్ కార్డుల్ని గ్యాస్ ఆయా గ్యాస్ ఏజెన్సీల్లో, బ్యాంక్‌లో నమోదు చేసుకొన్నారు. న మోదు పుణ్యమా అంటూ వీరంతా గ్యా స్ రీఫిల్లింగ్‌కు రూ.1368చెల్లించి తీసుకొన్న తరువాత వారికి మాత్రం కేవలం రూ.645మాత్రమే సబ్సిడీగా వారి ఖా తాలో జమఅవుతోంది. ఇక రూ.723వినియోగదారులకు పడుతోంది. అంటే సబ్సిడీ సిలిండర్ ధర రూ.440 ఉండగా,అదనంగా రూ..283రూపాయలను చెల్లించాల్సి వచ్చేది.తాజా నిర్ణయంతో సిలిండరుకు నిర్ణీత ధరనే ఇంటివద్ద చెల్లిస్తే సరిపోతుంది. -
గ్యాస్‌కు ఆధార్ అక్కర్లేదు
నగదు బదిలీ నుంచి తాత్కాలిక మినహాయింపు న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు ఊరట! ఇక ఆధార్ తిప్పలు తొలగనున్నాయి. సిలిండర్‌ను మార్కెట్ రేటుకు కొనడం, తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ సొమ్ము కోసం ఎదురుచూడడం వంటి బాధలు తప్పనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం నుంచి వంటగ్యాస్‌ను తాత్కాలికంగా మినహాయించనుంది. అంటే ఎప్పట్లాగే సబ్సిడీ ధరకు వినియోగదారులకు గ్యాస్ బండ అందనుంది. సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం చమురు సంస్థలకు చెల్లించనుంది. అలాగే ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రస్తుతం ఉన్న తొమ్మిదికి బదులు ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. గురువారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 12కు పెంచడం వల్ల ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.5 వేల కోట్ల భారం పడనుందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ‘‘వంటగ్యాస్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. అయితే ఇది పథకం అమలులో విఫలమైనట్టు ఎంత మాత్రం కాదు. ఇప్పటిదాకా దీన్ని చక్కగా అమలు చేసినందుకు గర్వపడుతున్నాం. చిన్న తప్పు ఉన్నా దాన్ని సరిచేయాల్సిందే. అందుకే వినియోగదారులకు కలుగుతున్న ఇబ్బందులపై పూర్తిస్థాయిలో సమీక్ష జరిపేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేశాం. అప్పటిదాకా వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాత విధానమే అమలవుతుంది’’ అని మొయిలీ వివరించారు. అయితే కమిటీకి సంబంధించిన విషయాలుగానీ, ఆ కమిటీ ఎంత గడువులోగా నివేదిక ఇస్తుందన్న అంశాన్నిగానీ ఆయన వెల్లడించలేదు. సబ్సిడీ సిలిండర్ల పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత విధానం ప్రకారం మార్చి వరకు తొమ్మిది సిలిండర్లే వాడుకునే అవకాశం ఉండగా.. మరో సిలిండర్‌ను అదనంగా ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. 2012 సెప్టెంబర్‌లో వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను ప్రభుత్వం ఆరుకు కుదించడంతో దీనిపై విమర్శలు రావడంతో 2013 జనవరిలో వాటిని 9కి పెంచారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సదస్సులో వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ‘ప్రత్యక్షం’గా తెలిసిసొచ్చింది.. వివిధ పథకాల్లో సబ్సిడీ సొమ్ము పక్కదారి పడుతోందని, దీన్ని నివారించేందుకు లబ్ధిదారులకే నేరుగా సబ్సిడీని అందించాలన్న ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్నితీసుకువచ్చింది. దీన్ని వంటగ్యాస్‌కు వర్తింపజేయడంతో వినియోగదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. తొలుత ఆధార్ నమోదు చేయించుకోవడం, తర్వాత వారి బ్యాంకు ఖాతాలను దానికి అనుసంధానం చేసుకోవడానికి జనం అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ చాలాచోట్ల పూర్తిస్థాయిలో ఆధార్‌ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తికాలేదు. తీరా అనుసంధానం చేసుకున్నా తమ ఖాతాల్లోకి గ్యాస్ సబ్సిడీ రావడం లేదంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం నుంచి వంటగ్యాస్‌ను తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 18 రాష్ట్రాల్లోని 289 జిల్లాల్లో వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీని వర్తింపజేస్తున్నారు. ‘వక్ఫ్’ బిల్లుకు ఓకే: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పింది. అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను ముస్లింలు తిరిగి చేజిక్కించుకునేందుకు ఈ బిల్లు (ద వక్ఫ్ ప్రాపర్టీస్-ఎవిక్షన్ ఆఫ్ అన్ ఆథరైజ్డ్ ఆక్యుపెంట్స్) దోహదపడనుంది. అంతేగాక వీటిని ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓబీసీ జాబితాకు సవరణ ఓబీసీ జాబితాలో కొత్తగా మరో 60 కులాలను చేర్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, హిమాచల్ప్రదేశ్లతోపాటు 13 రాష్ట్రాల్లో తాము గుర్తించిన కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కమిషన్ సిఫారసుల మేరకు జాబితాలో 115 మార్పు చేర్పులు చేయనున్నారు. ఇప్పటివరకు జాబితాలో మార్పుల కోసం 30 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజా సవరణ కోసం కోసం 31వ నోటిఫికేషన్ విడుదల కానుంది. -
అదే ఆధార్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. వాస్తవానికి డిసెంబర్ 31వ తేదీ గడువు ముగిసినా ఆధార్‌పై స్పష్టత లేకపోవడంతో ఎవరూ నగదు బదిలీకి ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికీ కేవలం 25 శాతం మంది వినియోగదారులు మాత్రమే నగదు బదిలీకి ఆధార్, గ్యాస్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 6.18 లక్షల మంది చేయించుకోవాల్సి ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్యాస్ సలిండర్ను మార్కెట్ ధర రూ.1327కు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డును తప్పని సరి చేయడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. నిన్న మొన్నటి వరకు నగదు బదిలీ పథకానికి ఆధార్ తప్పని సరా?.. కాదా? అన్న మీమాంస కొనసాగినా ప్రస్తుతం మాత్రం ఆధార్ లేకపోతే నగదు బదిలీ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ కారణంగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు వెలుగులోకి వస్తాయని, తద్వారా ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఆధార్‌పై ప్రాంతీయ సదస్సు ఆధార్‌పై మరో పది రోజుల్లో జిల్లాలో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. వాస్తవానికి గత నెలలో ఈ సమావేశం జరగాల్సి ఉన్నా తుపాను కారణంగా వాయిదా పడింది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ సమావేశం జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆధార్‌పై స్పష్టతతో పాటు నగదు బదిలీని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆధార్ కేవలం నగదు బదిలీ పథకానికి మాత్రమే కాకుండా అన్ని సంక్షేమ పథాకలకు తప్పనిసరి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
బండడు కష్టాలు
ఆధార్ అనుసంధానం, బుకింగ్ ఇబ్బందులతో గ్యాస్ వినియోగదారుల బెంబేలు ధర పెరగడంతో సగం మంది వెనకడుగు పల్లెలవైపు వెళ్లేందుకు జంకుతున్న ఏజెన్సీలు ఒంగోలు, న్యూస్‌లైన్: గ్యాస్ ఏజెన్సీలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకునే దగ్గర నుంచి డెలివరీ వరకు...వినియోగదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను ‘న్యూస్‌లైన్’ బృందం గురువారం పరిశీలించింది. గ్యాస్ సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డులు అనుసంధానం చేయాలని, బ్యాంకు అకౌంట్లకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఏజెన్సీలు పట్టుబట్టాయి. దీంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల్లో, బ్యాంకుల్లో ఆధార్ నమోదు చేసుకున్నా.. కొందరికి సబ్సిడీ నగదు అకౌంట్లలో జమ కావడం లేదు. దీంతో వారు ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కొందరు ఏజెన్సీల నిర్వాహకులు ఆధార్ నంబరు అనుసంధానమైతేనే గ్యాస్ బుక్ చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకోవాలనుకునే వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. నేరుగా ఫోన్ చేసి బుక్ చేసుకుందామన్నా.. ఏజెన్సీల్లో ఓ పట్టాన ఫోన్ ఎత్తకపోవడంతో మళ్లీ కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి. ఆధార్‌తో బెంబేలు... జిల్లాలో మొత్తం 5.67 లక్షల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరిలో ఇప్పటివరకు 3.20 లక్షల మంది ఆధార్‌ను గ్యాస్ కంపెనీల వద్ద అనుసంధానం చేసుకున్నారు. అంటే దాదాపు 56.43 శాతం మాత్రమే ఏజెన్సీల వద్ద వినియోగదారుల ఆధార్ నంబర్లు కనెక్ట్ అయ్యాయి. 43.57 శాతం మంది ఇంత వరకు ఆధార్ నమోదు చేసుకోలేదు. ప్రస్తుతం ఆధార్ నమోదు చేసుకోని వారు ఏకంగా సిలిండర్ రూ. 1327.50ల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే జిల్లాలో 2.47 లక్షల మంది ఆధార్ ప్రక్రియ పూర్తిచేసుకునేంత వరకు అదనపు భారం భరించక తప్పని పరిస్థితి నెలకొంది. = ఆధార్ నమోదు చేసుకున్న వారిలో కూడా 2.40 లక్షల మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్‌కు అనుసంధానం అయ్యారు. బ్యాంకుల్లో కూడా అనుసంధానం అయితేనే వారికి గ్యాస్ సబ్సిడీపై వస్తుంది. అంటే 2.47 లక్షలకు అదనంగా మరో 73 వేల మందికి సబ్సిడీ ప్రస్తుతం అందే అవకాశం లేదు. = జిల్లాలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలకు నూతన సాఫ్ట్వేర్ ముంబై నుంచి లోడ్ చేస్తుండడంతో చాలా ఏజెన్సీలు పనిచేయలేదు. పెరిగిన ధరతో బెంబేలు.. సిలిండర్లు, బిల్లులు తీసుకొని మార్కెట్లోకి వెళితే డెలివరీ తీసుకోవడానికి జనం ముందుకు రావడంలేదు. గ్యాస్ ధర పెరిగిందని డెలివరీ బాయిస్ చెబుతున్నా అంత రేటా.. అయితే మాకొద్దు అంటూ ఒంగోలు నగర పరిధిలోని శివారు కాలనీల్లోని జనం తిప్పి పంపారు. కొంతమంది అయితే తరువాత పడే డబ్బుల సంగతేమో కానీ అంత పెద్ద మొత్తం మా దగ్గర లేదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో సగం సిలిండర్లు తిరిగి గ్యాస్ కంపెనీలకే చేరాయి. = ఆధార్‌తో అనుసంధానం కాని గ్యాస్ కనెక్షన్ల వారు సిలిండర్లు తీసుకుంటారో లేదో అర్థంకాక డెలివరీ ఇవ్వడం లేదు. తమకు ఫోన్‌చేసి సిలిండర్ తెమ్మంటేనే పంపుతామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు డెలివరీ చేయడానికి ఏజెన్సీల వారు సైతం జంకుతున్నారు. = జిల్లాలో యర్రగొండపాలెం, టంగుటూరు, వెలిగండ్ల, దొనకొండ, సంతనూతలపాడు, తాళ్లూరుల్లోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలు, కనిగిరి, కొండపి హెచ్‌పీ ఏజెన్సీలు, కొనకనమిట్ల, ముండ్లమూరు భారత్ గ్యాస్ ఏజెన్సీల్లో 50 శాతం కంటే తక్కువగా గ్యాస్ బుక్ చేసుకున్నారు. = జిల్లాలోని దాదాపు 20 గ్యాస్ ఏజెన్సీలు ఫోన్‌చేసినా ఎత్తకపోతుండడంతో దూరాభారమైనా గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు జనం వస్తున్నారు. -
అమల్లోకినగదు బదిలీ!
సాక్షి, చెన్నై : గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారులకు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే, దీనికి ఆధార్ కార్డును లింక్ పెట్టడం వివాదానికి దారి తీసింది. సుప్రీం కోర్టు సైతం అక్షింతలు వేయడంతో కేంద్రం కాస్త వెనక్కు త గ్గింది. పూర్తి స్థాయిలో ఆధార్ కార్డుల జారీ అనంతరం, ఆ నెంబరు ఆధారంగా గ్యాస్ సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో పడే విధంగా చర్యలు చేపట్టారు. అయితే, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో తన నిర్ణయాన్ని అమలు చేయించడం లక్ష్యంగా ముందుకెళుతోంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఫొటోలు, వేలి ముద్రల సేకరణ చేసినప్పటికీ, కార్డుల జారీలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డులు నామమాత్రంగానే అందాయి. అమలు: ఇటీవల మదురై, శివగంగై జిల్లాల్లో లాంఛనంగా నగదు బదిలీ పథకాన్ని ఆరంభించారు. తాజాగా ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో పథకం అమల్లోకి వచ్చింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తేని, దిండుగల్, రామనాధపురం, కన్యాకుమారి జిల్లాల్లో కొత్త సంవత్సరం కానుకగా బుధవారం నుంచి నగదు బదిలీ అమల్లోకి తెచ్చారు. గ్యాస్ సబ్సిడీని ఆధార్ నెంబర్లు, బ్యాంక్ ఖాతా నెంబర్లకు ముడి పెట్టడాన్ని ఆ జిల్లాల్లోని వినియోగదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ బ్యాంకు ఖాతాలో పడేనా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నగదు బదిలీలీ దక్షిణాదిలోని మారుమూల గ్రామీణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి మదురై, శివగంగై కాకుండా మరో ఆరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో నగదు బదిలీ ఆరంభమైందో లేదో, విల్లుపురం, వేలూరు, కాంచీపురం జిల్లాల్లో ఆధార్ నెంబర్లను తప్పని సరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు ఆధార్ నెంబర్లను తప్పనిసరిగా గ్యాస్ నెంబర్లకు జత పరచాలని, బ్యాంకు ఖాతా నెంబర్లను అందజేయాలని ప్రకటించారు. అయితే, ఈ జిల్లాల్లో ఇంత వరకు ఆధార్ కార్డుల శిబిరాలు సక్రమంగా కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతలోపు కార్డుల నెంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనన్న హుకుం జారీ కావడంతో, ఈ నగదు బదిలీకి అడ్డుకట్ట వేసే రీతిలో రాష్ర్ట ముఖ్యమంత్రి జే జయలలిత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువే. -
వంద శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా?
హైదరాబాద్: గ్యాస్ రాయితీ, నగదు బదిలీ పథకం చట్టవిరుద్దమంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. గ్యాస్ రాయితీ, నగదు బదిలీపై చమురు సంస్థలు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 100 శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా అని చమురు కంపెనీలను ధర్మాసనం ప్రశ్నించింది. అసంబద్ద విధానాల వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. రాయితీ బదిలీ కోసం ఎంత మంది బ్యాంకు ఖాతాలు కలిగివుంటారని చమురు సంస్థలను ప్రశ్నించింది. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ పేట్ల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. నంబర్ పేట్ల కాంట్రాక్టును ఒక్కరికే ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈవిధంగా స్పందించింది. -
పాతపద్ధతిలోనే గ్యాస్ ఇప్పించండి
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు సాక్షి, హైదరాబాద్: ఆధార్‌తో సంబంధం లేకుండా రాయితీ గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బాలాజీ వధేరా శుక్రవారం దీన్ని దాఖలు చేశారు. ఆధార్ కార్డుతో అనుసంధానిస్తూ గ్యాస్ రాయితీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమచేసే విధానంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్ పిల్లో నివేదించారు. చమురు సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్‌కు రూ. 1,050 వసూలు చేస్తున్నాయని, సబ్సిడీ మొత్తాన్ని తర్వాత బ్యాంక్ ఖాతాలో వేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే సబ్సిడీ కింద రూ. 412లకే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా చమురు సంస్థలను ఆదేశించాలని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
ఆధార్ కార్డు లేకుండా గ్యాస్ ఇవ్వండి: హైకోర్టు
-
అన్నింటికీ ఆధార్ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: ఆధార్.. దేశంలోని ప్రతి పౌరుడికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య (యూఐడీ)ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న కార్డు. ఈ కార్డు జారీ ప్రక్రియ ప్రారంభించి ఏళ్లవుతున్నా రాష్ర్టవ్యాప్తంగా లక్షలాదిమందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. వీరిలో కొందరు అసలు ఆధార్ కోసం దరఖాస్తే చేసుకోలేదు. మరికొంతమందికి వివరాలు నమోదు చేసుకున్నా వివిధ కారణాల రీత్యా కార్డులు అందలేదు. దీంతో లక్షలాదిమంది ఆధార్ కోసం ఎదురుతెన్నులు చూస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనూ.. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు, ప్రత్యక్ష నగదు బదిలీకి, గుర్తింపు.. చిరునామా ధ్రువపత్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్‌ను తప్పనిసరి చేయడం వివాదాస్పదమవుతోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వ శాఖలు మాత్రం అన్నింటికీ ‘ఆధార్’ తప్పనిసరి అంటున్నాయి. అంతేకాదు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలంటూ ఉత్తర్వులిస్తున్నాయి. వంటగ్యాస్ సబ్సిడీకి, విద్యార్థుల స్కాలర్‌షిప్పుకు, చివరకు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘బంగారుతల్లి’ పథకానికి సైతం ఆధార్‌తో లంకె పెట్టడంతో ఈ కార్డులు అందని ప్రజలు ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్ నమోదును తప్పనిసరి చేశారు. ఆయా జిల్లాల్లో ఆధార్ లేనివారు పూర్తిమొత్తం చెల్లించి గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు. కొన్నిచోట్ల ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ నగదు బదిలీ కింద తమ బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ కావడం లేదని లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఈ కష్టాలు ఇలావుండగానే ప్రభుత్వ శాఖలు వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఆధార్ నమోదును తప్పనిసరి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యకు 7 లక్షల మంది దూరం! ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ‘ఆధార్’ నిబంధన పెద్ద తలనొప్పిగా మారింది. అర్హులైన మొత్తం విద్యార్థుల్లో 40 శాతం మందికి పైగా విద్యార్థులకు ఇప్పటివరకు ఆధార్ కార్డులు లేకపోవడంతో వారు కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. నగదు బదిలీ పథకానికి ఆధార్ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయకముందే ఫీజుల పథకానికి ఈ నిబంధనను వర్తింపజేయడం వల్ల అర్హులైన లక్షలాది మంది పేద విద్యార్థులు ఈ ఏడాది ఉన్నత విద్యకు దూరం కానున్నారు. ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే కానీ ఫీజుల పథకం దరఖాస్తు ఈపాస్ వెబ్సైట్లో కనిపించకుండా సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ నిబంధన ప్రకారం విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలంటే యూఐడీ నంబర్ ఇప్పించాలన్న ఆలోచన మాత్రం ఉన్నతాధికారులకు రాలేదు. ఏదోవిధంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో కొంతమందికి ఎన్రోల్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఈఐడీ) నంబర్ మాత్రం వచ్చింది. ఈ నంబర్‌ను పేర్కొంటున్న విద్యార్థుల దరఖాస్తులు చెల్లవని ఆధార్ వెబ్సైట్ చెబుతోంది. అంటే ఈవిద్యార్థులంతా మళ్లీ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం యూఐడీ నంబర్ వచ్చే ఫిబ్రవరి లోగా అందుతుందని ఆధార్ వర్గాలే చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కనీసం 7లక్షల మంది ఫీజుల పథకానికి దూరమయ్యే ప్రమాదముందని విద్యార్థి, కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పింఛన్లు, ‘ఉపాధి’కీ లింకుసామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులు, ఉపాధి హామీ కూలీలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలని ఆ శాఖల ఉన్నతాధికారులు నిర్ణయించారు. పెన్షనర్ల జాబితా డిజిటైజేషన్‌తోపాటు, అందరికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరని స్పష్టం చేశారు. సామాజిక భద్రతా పింఛన్ల పథకంలో భాగంగా వృద్ధాప్య, వితంతు, వైకల్య లబ్దిదారుల జాబితా డిజిటైజేషన్‌తో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్ రెండిటి అనుసంధానం తప్పనిసరి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 22 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసింది. ఏటా దాదాపు రూ.475 కోట్ల మేర సాయం అందిస్తోంది. అయితే 22 లక్షల మంది పెన్షన్ లబ్దిదారుల్లో కేవలం 3.36 లక్షల మంది లబ్దిదారులకు సంబంధించిన ఆధార్ నంబర్లు మాత్రమే ఇప్పటివరకు అనుసంధానం కావడం గమనార్హం. ఇక ఉపాధి కూలీలకు బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి ప్రస్తుతం వేతనాలు చెల్లిస్తున్నా.. వీరికి కూడా విధిగా ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేయాలని కేంద్రా గ్రామీణాభివృద్ది శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 15వ తేదీ నాటికి ఆధార్‌కార్డు నంబర్లను పరిశీలించాలని, డిసెంబర్ 31వ తేదీ నాటికి అనుసంధానం చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అన్ని సంక్షేమ పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గురించి ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శులకు రాసిన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో దాదాపు 1.20 కోట్ల మందికి ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉంటే.. అందులో ప్రతి సంవత్సరం ఉపాధి పనులకు హాజరయ్యే వారి సంఖ్య 70 లక్షల వరకు ఉంటుందని అధికారవర్గాలు వివరించాయి. ఇందులో ఆధార్‌ను అనుసంధానం చేసినవారి వివరాలను అధికారులు చెప్పలేకపోతున్నారు. ‘బంగారుతల్లి’కీ తప్పని ఇక్కట్లు : బంగారుతల్లులకూ ‘ఆధార్’ తిప్పలు తప్పడం లేదు. అన్ని పథకాల్లాగానే ఈ పథకానికి కూడా ఆధార్ నిబంధన అనేక అడ్డంకులు కల్పిస్తోంది. ఇప్పటివరకు బంగారుతల్లి పథకం కింద లక్ష మందికి పైగా చిన్నారులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 30 శాతం మంది తల్లులకు ఆధార్ కార్డులు లేవు. దీంతో ఆయా తల్లులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు జాప్యం అవుతోంది. ఆధార్ నమోదుకు సంబంధించి గ్రామీణ, పట్టణప్రాంతాలలో దాదాపు ఒకే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో 67శాతం మంది ఆధార్ నమోదు చేసుకోగా, పట్టణ ప్రాంతాల్లో 75 శాతం మంది నమోదు చేసుకున్నారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లెక్కలు చెపుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్, అనంతపురం లాంటి పేద జిల్లాల్లోని అర్హుల సంఖ్యలో సగం మంది కూడా ఆధార్‌ను సమర్పించలేకపోయారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు 9వేల మంది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 5వేల మంది మాత్రమే ఆధార్ నమోదు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలోనూ అర్హులైన 6,200 మందికి గాను 3,900 మంది మాత్రమే ఆధార్ ఇచ్చారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఐటీడీఏ కేంద్రాల పరిధిలో కూడా ఆధార్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో అక్కడి గిరిజనులు కూడా ఆధార్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు చిన్నారుల తల్లిదండ్రులకు ఉండాల్సిన బ్యాంకు అకౌంట్లు పెద్ద సమస్యగా మారింది. 25 శాతం మందికిపైగా ఇవి లేనట్లు తెలుస్తోంది. ఆధార్‌పై సుప్రీంలో మరో పిటిషన్ న్యూఢిల్లీ:ఆధార్ ‘ఇబ్బంది’పై సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. నాగరిక్ చేతన మంచ్ అనే ఎన్జీవో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన బీఎస్ చౌహాన్ నే తృత్వంలోని ధర్మాసనం కేంద్రం, ఆర్బీఐలను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. -
‘ఆధార్’పై హైకోర్టులో పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకున్న వారికే గ్యాస్ సబ్సిడీ లభిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను నిలుపుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న అభ్యర్ధనను సైతం తోసిపుచ్చింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మహ్మద్ అబ్దుల్ గఫార్ ఆధార్‌పై గతవారం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సోమవారం ధర్మాసనం విచారించింది. ఆధార్ కార్డుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నందున, తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆధార్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున, ఈ వ్యాజ్యాన్ని కూడా అక్కడకు బదలాయించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం పిటిషనర్‌కు రూ.500 జరిమానా విధించింది. -
పాత పద్ధతిలోనే గ్యాస్ ఇచ్చేలా ఆదేశించండి
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకున్నవారికే వంటగ్యాస్ సబ్సిడీ లభిస్తుందని పేర్కొంటూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మహ్మద్ అబ్దుల్ గఫార్ దీన్ని గురువారం దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఐ) చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్లను పాత పద్ధతిలోనే పంపిణీ చేపట్టేలా సంబంధిత సంస్థలను ఆదేశించాలని ఆ పిటిషన్లో అభ్యర్థించారు. -
ఇంధన పొదుపుపై ప్రచారం: పనబాక లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆయిల్, గ్యాస్ పొదుపుపై భారీ ప్రచార కార్యక్రమాన్ని గురువారం ఆమె హైదరాబాద్‌లో ప్రారంభించి మాట్లాడారు. ‘ఇంధన పొదుపుపై విద్యార్థులతో ప్రచారం చేస్తాం. దేశంలో ఏటా రూ. 5,33,900 కోట్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను వినియోగిస్తున్నాం. ఇది మొత్తం జీడీపీలో 7% సమానం. 25% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 75% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. దీనిపై 7 వారాలపాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి బుధవారం కార్లను వినియోగించరాదని పెట్రోలియంశాఖ ఉద్యోగులంతా నిర్ణయించారు. ఆ రోజు బస్సుల్లో లేదా నడుచుకుంటూ కార్యాలయాలకు వస్తారు’ అని మంత్రి వివరించారు. కార్యక్రమంలో గెయిల్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ హరిప్రసాద్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ అనుసంధానం కాకున్నా వంట గ్యాస్ సబ్సిడీ ఆధార్ అనుసంధానం కాకపోయినా వంటగ్యాస్‌కు సబ్సిడీ వర్తింపజేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పనబాక తెలిపారు. ఆధార్ లేదన్న కారణంతో ప్రజలకు పథకాలను నిలిపివేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మంత్రి ఈ మేరకు వివరణ ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు ‘నేను సమైక్య వాదిని. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’ అంటూ నిష్ర్కమించారు. -
గ్రేటర్లో సిలిం‘డర్’ !
-
గ్రేటర్లో సిలిం‘డర్’ !
సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీ పథకం అమలవుతున్న హైదరాబాద్‌లో వంటగ్యాస్ ధర మండిపోతోంది. తాజాగా సిలిండర్‌పై రూ.72.50 పైసలు మేరకు పెరగడంతో రీఫిల్లింగ్ ధర రూ.1097లకు చేరింది. సోమవారం నుండి పెరిగిన ధర అమల్లోకి వచ్చింది. నగదు బదిలీ (డీబీటీ) పూర్తిస్థాయిలో అమలుకాక, అమలైనా సబ్సిడీపై పరిమితితో వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే.. పెరుగుతున్న వంటగ్యాస్ ధర ప్రజలకు మరింత భారంగా మారుతోంది. కేవలం నెల వ్యత్యాసంలోనే సిలిండర్ ధర రూ.135 పెరిగినట్లయింది. గత నెలలో సిలిండర్‌పై రూ. 62.50 పైసలు పెరగగా, తాజాగా మరో రూ.72.50 పెరిగింది. మరోవైపు డీబీటీ కారణంగా వినియోగదారులు సిలిండర్‌పై రూ.79 అదనంగా భరించక తప్పడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌పై అందించిన సబ్సిడీ రూ.25కు ఎగనామం పెట్టడమే కాకుండా విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ముక్కుపిండి వసూలు చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన ధరతో వ్యాట్‌పన్ను రూ.54కు చేరింది. డీబీటీ అమలు లేని నగరాలు, జిల్లాల్లో మాత్రం సిలిండర్ రీఫిల్లింగ్ రూ.412.50లకు మాత్రమే లభిస్తోంది. ఇక్కడ మాత్రం బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీబీటీ వర్తించిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ నగదు బ్యాంక్‌లో జమ అవుతోంది. మిగతా వినియోగదారులు పూర్తి ధరను భరించక తప్పడం లేదు. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 12 లక్షల కనెక్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. దీంతో మిగతా 14 లక్షల మందికి పెరుగుతున్న ధర పెనుభారంగా మారుతోంది. ఆధార్, బ్యాంక్‌లతో అనుసంధానమైన వినియోగదారులకు ఎప్పటికప్పుడు సిలిండర్ ధరను బట్టి సబ్సిడీ విడుదల అవుతోంది. గ్రేటర్లో డీబీటీ అమలు ప్రారంభమైన జూన్‌లో రూ.420, జూలైలో రూ.458, ఆగస్టులో రూ.498. సెప్టెంబర్‌లో రూ. 558.30 పైసలు జమ అయ్యాయి. తాజాగా ఈ నెలలో రూ.600కు పైగా నగదు బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. తాజా పెంపుతో నెలకు ఒక సిలిండర్ వినియోగం లెక్కన గ్రేటర్ హై దరాబాద్ ప్రజలపై సుమారు రూ.18.88 కోట్ల భారం పడుతుందని అంచనా. -
ఆధార్‌పై నీలినీడలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని... విశిష్ట గుర్తింపు సంఖ్య ‘ఆధార్’తో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నానా హైరానా పడుతున్న తరుణంలో సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ‘ఆధార్’ను పొందడం ఐచ్ఛికమని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు, దానికి లింకు పెట్టరాదని సుప్రీం కోర్టు సోమవారం సంచలనాత్మక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో ఆధార్ కార్యక్రమం సాగుతున్నప్పటికీ, సరైన సంఖ్యలో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనందున విఘ్నాలు ఏర్పడుతూనే వచ్చాయి. ఇటీవల దీనిపై ప్రజల్లో కూడా ఆసక్తి సన్నగిల్లింది. ముఖ్యంగా బెంగళూరులో దీనిపై ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది ఆఖరు లోగా నేరు ప్రయోజన బదిలీ (డీబీటీ)ని అమలు చేయడానికి వీలుగా ఆధార్ కవరేజీని మరింత విస్తృతం చేయాలని చమురు కంపెనీలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ విపరీతమైన ఒత్తిడిని తీసుకొస్తోంది. వంట గ్యాస్‌పై సబ్సిడీని నేరుగా కస్టమర్ బ్యాంకు ఖాతాకు జమ చేయడమే డీబీటీ. తుమకూరు, మైసూరు, ధార్వాడలలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తుమకూరు జిల్లాలో, అక్టోబరు ఒకటో తేదీ నుంచి మైసూరు, ధార్వాడ జిల్లాల్లో విధిగా అమలు చేయనున్నారు. వచ్చే మార్చి నుంచి మరో 19 జిల్లాల్లో దీనిని విధిగా అమలు చేయాల్సి ఉంది. దీని వల్ల వినియోగదారులు వంట గ్యాస్‌కు మార్కెట్ ధరను చెల్లించాలి. అనంతరం ఆధార్ లింకుతో కూడిన బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు. ఆధార్ సంఖ్యలు, దానితో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలను సమర్పించని వారికి సబ్సిడీ లభించదు. ప్రస్తుతానికి 60 శాతం మందికి ఆధార్ సంఖ్య ఇచ్చినా, మిగిలిన 40 శాతం మందికి ఇవ్వడమే అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా 2,900 ఆధార్ నమోదు కేంద్రాలున్నాయి. బెంగళూరులో 589 కేంద్రాలున్నప్పటికీ, జనం పెద్దగా తరలి రావడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.54 కోట్ల మంది పేర్లను నమోదు చేసుకోగా, 2.86 కోట్ల మందికి ఆధార్ సంఖ్యను ఇచ్చారు. ఇప్పటికే మందకొడిగా సాగుతున్న ఈ కార్యక్రమం సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో అటకెక్కుతుందనే ఆందోళన అధికారుల్లో నెలకొంటోంది. -
వంటగ్యాస్ సబ్సిడీపై ‘వ్యాట్’ తొలగించాలి
సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ ధరలు అమలు చేయడాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తప్పుపట్టింది. వంటగ్యాస్ సబ్సిడీ మొత్తంపైనా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధించడం సమంజసం కాదంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. ‘నగదు బదిలీ పథకం అమల్లో ఉన్న జిల్లాల్లోని వంటగ్యాస్ వినియోగదారులకు మొత్తం బిల్లుపై(సిలిండర్‌కు రూ.980మీద) రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తున్నాయి. నగదు బదిలీ వర్తించని వారికి సబ్సిడీపోనూ వచ్చే బిల్లు(రూ.412)పైనే వ్యాట్ వసూలు చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ విధానంవల్ల నగదు బదిలీ పరిధిలోకి వచ్చేవారికి వంటగ్యాస్ సిలిండర్ ధర ఎక్కువగా ఉంటోంది. ఆధార్ అనుసంధానం చేసుకోనివారు చెల్లించే ధరకంటే.. అనుసంధానం చేసుకున్నవారు వంటగ్యాస్‌కు అధిక రేటు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆధార్ అనుసంధానానికి వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు. ఇలా ఒకేరకమైన వంటగ్యాస్‌పై రెండురకాలుగా వ్యాట్ విధించడం సరికాదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని సబ్సిడీ మొత్తానికి వ్యాట్‌ను మినహాయించాలి’’ అని లేఖలో కోరింది. రాష్ట్రంలో పరిస్థితిదీ: రాష్ట్రంలో వంటగ్యాస్ విషయంలో ద్వంద్వ ధరలు అమల్లో ఉన్నాయి. నగదు బదిలీ పరిధిలోకి వచ్చిన 12 జిల్లాల్లోని వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రూ.25 సబ్సిడీని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. అంతటితో సరిపెట్టుకోకుండా వినియోగదారులకు లభించే వంటగ్యాస్ ధరపైగాక మొత్తం బిల్లుపై (సిలిండర్‌కు రూ.980పై) వ్యాట్ బాదుతోంది. దీంతో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,024.50 పడుతోంది. అంటే.. వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రూ.558.30 సబ్సిడీపైనా రాష్ట్రప్రభుత్వం వ్యాట్ గుంజుతోందన్నమాట. దీంతో నగదు బదిలీ వర్తించనివారితో పోల్చితే ఈ పథకం వర్తించేవారికి ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.29 చొప్పున వ్యాట్ భారం అదనంగా పడుతోంది. దీనివల్లే నగదు బదిలీ అమల్లో లేని జిల్లాల ప్రజలకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.412.70 (దీనిపై సుమారు రూ.22 వరకు వ్యాట్ పడుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రూ.25 సబ్సిడీ వర్తిస్తుండడంతో దాదాపు అదే ధరకు వినియోగదారులకు లభిస్తున్నది) ఉండగా నగదు బదిలీ అమల్లో ఉన్న జిల్లాల్లో మాత్రం ఏకంగా రూ.466 పడుతోంది. నగదు బదిలీ వర్తించేవారికి రాష్ట్రప్రభుత్వం రూ.25 సబ్సిడీ రద్దు చేయడం, దీనికితోడు అదనంగా రూ.29 వ్యాట్ విధించడమే ఇందుకు కారణం. దీనివల్ల వీరికి ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.53 చొప్పున అదనపు భారం పడుతోంది. ఒకే వంటగ్యాస్‌పై ఇలా రెండు ధరలు అమలు చేయడం దారుణమనే విమర్శలను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ద్వంద్వ విధానం సరికాదని, సబ్సిడీపై మినహాయించి వినియోగదారులకు పడే వంటగ్యాస్ రేటుపైనే వ్యాట్ విధించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీచేయడం గమనార్హం. -
ప్రహసనంగా గ్యాస్‌కు నగదు బదిలీ పధకం
-
ప్రహసనంగా మారిన గ్యాస్ నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని హుమాయూన్‌నగర్‌కు చెందిన ఎం.ఎ.రవూఫ్‌కు మాసబ్ ట్యాంకులోని జి.ఎన్.ఎస్. ఏజెన్సీలో గ్యాస్ కనెక్షన్ ఉంది. మొదటిసారి ఆయన బ్యాంకు ఖాతాలో వంట గ్యాస్ సిలిండర్‌కు సబ్సిడీ కింద అడ్వాన్సుగా రూ.420 పడింది. కానీ తర్వాత మూడు సిలిండర్లు తీసుకున్నా సబ్సిడీ మాత్రం ఆయన ఖాతాలో ఒక్కసారి కూడా జమ కాలేదు. ఈ విషయమై ఎవరిని సంప్రదించాలో తెలియక ఆయన ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్‌లోనే చింతల్‌బస్తీకి చెందిన కె.నరసింహులుకు విజయనగర్ కాలనీలోని గ్యాస్ ఏజెన్సీలో కనెక్షన్ (679479) ఉంది. తన ఆంధ్రాబ్యాంకు ఖాతాను గ్యాస్‌కు అనుసంధానం చేసుకున్నారు. మొదటిసారి ఆయనకు సబ్సిడీ కింద రూ.420.67 ఆంధ్రా బ్యాంకులో జమయింది. కానీ గ్యాస్ కంపెనీ వెబ్సైట్లో మాత్రం ఆయనకు ఖాతాయే లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో జమయినట్టుగా ఉంది. పైగా ఎస్బీఐలోని ఏ శాఖలో పడిందో కూడా తెలియడం లేదు. హైదరాబాద్ సీతారాంబాగ్‌కు చెందిన కె.బాబూలాల్‌కు విజయనగర్ కాలనీలోని స్వామి ఎంటర్‌ప్రైజెస్‌లో వంట గ్యాస్ కనెక్షన్ ఉంది. ఎస్బీఐ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. కానీ వంట గ్యాస్ సబ్సిడీ ఆయనకు ఖాతాయే లేని ఐసీఐసీఐ బ్యాంకులో జమయినట్టు గ్యాస్ కంపెనీ వెబ్సైట్లో ఉంది. అది కూడా ఏ శాఖలోనన్న వివరాలు లేవు. ఇవి కేవలం వీరి సమస్యలు మాత్రమే కాదు. ఇలా నగదు బదిలీ పథకంలో లోపాల వల్ల 12 జిల్లాల్లోని అనేక మంది వంట గ్యాస్ వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. జూన్ 1 నుంచి తొలి దశలో నగదు బదిలీ ప్రారంభించిన హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో.. ప్రత్యేకించి జంట నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘సబ్సిడీ జమ కాలేదంటూ చాలామంది వినియోగదారులు మా వద్దకు వచ్చి బాధ పడుతున్నారు. మేం వారి నంబరును గ్యాస్ కంపెనీల వెబ్సైట్లో చూసి ఏ బ్యాంకులో జమయిందో మాత్రమే చెబుతున్నాం. వెబ్సైట్లో అది మాత్రమే కనిపిస్తోంది తప్ప ఏ శాఖ అనే సమాచారం ఉండటం లేదు. దాంతో వినియోగదారులు బ్యాంకు శాఖల చుట్టూ తిరుగుతున్నారు. నగదు బదిలీ పథకంలో ఇది ప్రధాన లోపంగా మారింది’ అని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకు, విజయనగర్ కాలనీ, బోరబండ ప్రాంతాలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు ‘సాక్షి’కి తెలిపారు. పథకం రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ సమస్యలకు కారణమని ఆంధ్రా బ్యాంకు సీనియర్ మేనేజర్ ఒకరన్నారు. ఎన్నెన్ని బాధలో...! నగదు బదిలీ పథకంలో లోపాల వల్ల ఒక్కో వినియోగదారుడు ఒక్కో రకమైన సమస్య ఎదుర్కొంటున్నాడు. ఆధార్ నమోదు చేసుకుని ఆ సంఖ్యను గ్యాస్ కనెక్షన్‌కు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్నా కొందరికి సబ్సిడీ రావడంలేదు. మరికొందరికి సిలిండర్ తీసుకోకముందే అడ్వాన్స్ రూపంలో సబ్సిడీ పడింది. తర్వాత మాత్రం మూడు సిలిండర్లు తీసుకున్నా ఒక్కసారీ సబ్సిడీ జమ కాలేదు. ఒక బ్యాంకులో ఖాతా తెరిచి ఆధార్‌తో దాన్ని అనుసంధానం చేసుకున్న కొందరికి మొదటిసారి ఆ బ్యాంకులోనూ, తర్వాత మరో బ్యాంకులోనూ సబ్సిడీ జమయినట్టు గ్యాస్ కంపెనీల వెబ్సైట్లో కనిపిస్తోంది. కొందరి పేరుతో సబ్సిడీ జమయిన తర్వాత వారం రోజుల్లోనే అది వెనక్కు వెళ్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో, సమస్య పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక వినియోగదారులు తలపట్టుకుంటున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వారి పాలిట శాపంగా మారింది. భారం బదిలీ... పై సమస్యలకు తోడు నగదు బదిలీ పరిధిలోకి వచ్చిన వినియోగదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.53 అదనపు భారం కూడా పడుతోంది. వారికి సిలిండర్ రూ.466.2కు వస్తుంటే బదిలీ పథకాన్ని అమలు చేయని జిల్లాల్లోని వినియోగదారులకు మాత్రం రూ.412.5 మాత్రమే ఉంటోంది. దాంతో డీబీటీ కాస్తా ప్రజల పాలిట డెరైక్ట్ బర్డెన్ ట్రాన్స్ఫర్ (భారం బదిలీ) పథకంలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అదనపు భారం పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం వంట గ్యాస్ ధరను రూ.50 పెంచగా, ప్రజలపై అదనపు భారం పడనీయొద్దనే లక్ష్యంతో దాన్ని సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన నిర్ణయించారు. తర్వాత రోశయ్య హయాంలో ఈ సబ్సిడీని రూ.25కు తగ్గించారు. ఇప్పుడు నగదు బదిలీ పథకం ముసుగులో రూ.50 సబ్సిడీని రద్దు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసింది. దాంతో వినియోగదారులపై సిలిండర్‌కు మరో రూ.25 అదనపు భారం పడింది. త్వరలో బ్యాంకర్లతో భేటీ: ఎల్డీఎం భరత్‌కుమార్ నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులపరంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాలుగైదు రోజుల్లో అన్ని బ్యాంకుల అధికారులతో భేటీ అవుతామని హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్డీఎం) భరత్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులు సహకరించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. -
జనవరి 1 కల్లా అన్ని జిల్లాల్లో గ్యాస్‌కు నగదు బదిలీ
వచ్చే నెల నుంచి మరో 8 జిల్లాల్లో పథకం సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌కు నగదు బదిలీని జనవరి 1కల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు దశల్లో 12 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉండగా, వచ్చే నెల 1 నుంచి మరో 8 జిల్లాల్లో (కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, వరంగల్, మెదక్, నల్లగొండ, విశాఖపట్టణం) జిల్లాల్లో అమల్లోకి రానుంది. నవంబర్ 1 నుంచి మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో అమలుచేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో అమల్లోకి తేనున్నారు. నగదు బదిలీ ప్రారంభించిన నాటి నుంచి మూడు నెలల్లోగా వినియోగదారులు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. అప్పటివరకు అనుసంధానం చేయకపోయినా సబ్సిడీని ఇస్తారు. మూడు నెలలు తరువాత కూడా ఆధార్‌ను బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయని వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వరు. మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆధార్‌ను బ్యాంకు లింకేజి చేసుకుంటే అప్పటి నుంచి వంట గ్యాస్ సబ్సిడీని అందజేస్తారు.