ఆధార్ లేకున్నా గ్యాస్ నగదు బదిలీ
* మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
* ఆధార్ లేకున్నా బ్యాంక్ ఖాతాలో రాయితీ జమ
* మొదటి మూడు నెలలు యథావిధిగా రాయితీ
* తర్వాత మూడు నెలలకు బ్యాంకు ఖాతా ఇచ్చాకే రాయితీ
* పథక పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు, జనవరి నుంచి మిగతా జిల్లాల్లో ప్రారంభం కానున్న గ్యాస్ నగదు బదిలీకి సంబంధించి ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారధి వాటిని విడుదల చేశారు. దీనిప్రకారం కేంద్రం చేసిన కొన్ని మార్పులు చేర్పులను అందులో వివరించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం పథక పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసింది.
రాష్ట్ర కమిటీలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఛైర్మన్‌గా బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, ఆయిల్ కంపెనీల స్టేట్ లెవల్ కో-ఆర్డినేటర్, ఐఓసీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్, బీపీసీఎల్ ప్రాంతీయ మేనేజర్, మీ సేవ డెరైక్టర్, ఆధార్ ప్రాజెక్టు మేనేజర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఎస్‌ఓలు సభ్యులుగా ఉంటారు. జిల్లా కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కో-ఆర్డినేటర్, లీడ్ బ్యాంకు మేనేజర్, డీఎస్‌ఓ, మీసేవా మేనేజర్, ఆయిల్ కంపెనీల నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరంతా కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి.
మార్గదర్శకాలు ఇవీ..
* ఎల్పీజీ, బ్యాంక్ ఖాతాల్లో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాల్లోకి వెళుతుంది. ఆధార్ లేకున్నా డీలర్‌కు బ్యాంక్ అకౌంట్ ఇస్తే సంబంధిత బ్యాంక్ అకౌంట్‌కు రాయితీ జమ అవుతుంది.
* మొదటి మూడు నెలల పాటు ఈ పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా తొలి మూడు నెలలు రాయితీ ధరకే సిలిండర్ ఇస్తారు. అయితే తర్వాత మూడు నెలలపాటు రాయితీ ఇవ్వరు. అయితే బ్యాంక్ ఖాతాను ఇవ్వగానే రాయితీ మొత్తాలు అన్నీ ఆ ఖాతాలో జమ అవుతాయి.
పథకంపై కేంద్రం చేసిన సూచనలు
* పథకంపై ప్రజల్లో అవగాహ కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి.
* ఆధార్ సంఖ్య కోసం కొత్త ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
* కలెక్టర్లు ఆయిల్ కంపెనీల కో ఆర్డినేటర్లకు తగిన సహాయ సహకారాలు అందించాలి.
* ఆధార్,ఎల్పీజీ, బ్యాంకు కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.