రాష్ట్ర రాజధానిలోని హుమాయూన్‌నగర్‌కు చెందిన ఎం.ఎ.రవూఫ్‌కు మాసబ్ ట్యాంకులోని జి.ఎన్.ఎస్. ఏజెన్సీలో గ్యాస్ కనెక్షన్ ఉంది. మొదటిసారి ఆయన బ్యాంకు ఖాతాలో వంట గ్యాస్ సిలిండర్‌కు సబ్సిడీ కింద అడ్వాన్సుగా రూ.420 పడింది. కానీ తర్వాత మూడు సిలిండర్లు తీసుకున్నా సబ్సిడీ మాత్రం ఆయన ఖాతాలో ఒక్కసారి కూడా జమ కాలేదు. ఈ విషయమై ఎవరిని సంప్రదించాలో తెలియక ఆయన ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్‌లోనే చింతల్‌బస్తీకి చెందిన కె.నరసింహులుకు విజయనగర్ కాలనీలోని గ్యాస్ ఏజెన్సీలో కనెక్షన్ (679479) ఉంది. తన ఆంధ్రాబ్యాంకు ఖాతాను గ్యాస్‌కు అనుసంధానం చేసుకున్నారు. మొదటిసారి ఆయనకు సబ్సిడీ కింద రూ.420.67 ఆంధ్రా బ్యాంకులో జమయింది. కానీ గ్యాస్ కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రం ఆయనకు ఖాతాయే లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో జమయినట్టుగా ఉంది. పైగా ఎస్‌బీఐలోని ఏ శాఖలో పడిందో కూడా తెలియడం లేదు. హైదరాబాద్ సీతారాంబాగ్‌కు చెందిన కె.బాబూలాల్‌కు విజయనగర్ కాలనీలోని స్వామి ఎంటర్‌ప్రైజెస్‌లో వంట గ్యాస్ కనెక్షన్ ఉంది. ఎస్‌బీఐ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. కానీ వంట గ్యాస్ సబ్సిడీ ఆయనకు ఖాతాయే లేని ఐసీఐసీఐ బ్యాంకులో జమయినట్టు గ్యాస్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంది. అది కూడా ఏ శాఖలోనన్న వివరాలు లేవు. ఇవి కేవలం వీరి సమస్యలు మాత్రమే కాదు. ఇలా నగదు బదిలీ పథకంలో లోపాల వల్ల 12 జిల్లాల్లోని అనేక మంది వంట గ్యాస్ వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. జూన్ 1 నుంచి తొలి దశలో నగదు బదిలీ ప్రారంభించిన హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో.. ప్రత్యేకించి జంట నగరాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘సబ్సిడీ జమ కాలేదంటూ చాలామంది వినియోగదారులు మా వద్దకు వచ్చి బాధ పడుతున్నారు. మేం వారి నంబరును గ్యాస్ కంపెనీల వెబ్‌సైట్‌లో చూసి ఏ బ్యాంకులో జమయిందో మాత్రమే చెబుతున్నాం. వెబ్‌సైట్‌లో అది మాత్రమే కనిపిస్తోంది తప్ప ఏ శాఖ అనే సమాచారం ఉండటం లేదు. దాంతో వినియోగదారులు బ్యాంకు శాఖల చుట్టూ తిరుగుతున్నారు. నగదు బదిలీ పథకంలో ఇది ప్రధాన లోపంగా మారింది’ అని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకు, విజయనగర్ కాలనీ, బోరబండ ప్రాంతాలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు ‘సాక్షి’కి తెలిపారు. పథకం రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ సమస్యలకు కారణమని ఆంధ్రా బ్యాంకు సీనియర్ మేనేజర్ ఒకరన్నారు. ఎన్నెన్ని బాధలో...! నగదు బదిలీ పథకంలో లోపాల వల్ల ఒక్కో వినియోగదారుడు ఒక్కో రకమైన సమస్య ఎదుర్కొంటున్నాడు. ఆధార్ నమోదు చేసుకుని ఆ సంఖ్యను గ్యాస్ కనెక్షన్‌కు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్నా కొందరికి సబ్సిడీ రావడంలేదు. మరికొందరికి సిలిండర్ తీసుకోకముందే అడ్వాన్స్ రూపంలో సబ్సిడీ పడింది. తర్వాత మాత్రం మూడు సిలిండర్లు తీసుకున్నా ఒక్కసారీ సబ్సిడీ జమ కాలేదు. ఒక బ్యాంకులో ఖాతా తెరిచి ఆధార్‌తో దాన్ని అనుసంధానం చేసుకున్న కొందరికి మొదటిసారి ఆ బ్యాంకులోనూ, తర్వాత మరో బ్యాంకులోనూ సబ్సిడీ జమయినట్టు గ్యాస్ కంపెనీల వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. కొందరి పేరుతో సబ్సిడీ జమయిన తర్వాత వారం రోజుల్లోనే అది వెనక్కు వెళ్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో, సమస్య పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక వినియోగదారులు తలపట్టుకుంటున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వారి పాలిట శాపంగా మారింది. భారం బదిలీ... పై సమస్యలకు తోడు నగదు బదిలీ పరిధిలోకి వచ్చిన వినియోగదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.53 అదనపు భారం కూడా పడుతోంది. వారికి సిలిండర్ రూ.466.2కు వస్తుంటే బదిలీ పథకాన్ని అమలు చేయని జిల్లాల్లోని వినియోగదారులకు మాత్రం రూ.412.5 మాత్రమే ఉంటోంది. దాంతో డీబీటీ కాస్తా ప్రజల పాలిట డెరైక్ట్ బర్డెన్ ట్రాన్స్‌ఫర్ (భారం బదిలీ) పథకంలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అదనపు భారం పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం వంట గ్యాస్ ధరను రూ.50 పెంచగా, ప్రజలపై అదనపు భారం పడనీయొద్దనే లక్ష్యంతో దాన్ని సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన నిర్ణయించారు. తర్వాత రోశయ్య హయాంలో ఈ సబ్సిడీని రూ.25కు తగ్గించారు. ఇప్పుడు నగదు బదిలీ పథకం ముసుగులో రూ.50 సబ్సిడీని రద్దు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసింది. దాంతో వినియోగదారులపై సిలిండర్‌కు మరో రూ.25 అదనపు భారం పడింది. త్వరలో బ్యాంకర్లతో భేటీ: ఎల్‌డీఎం భరత్‌కుమార్ నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులపరంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాలుగైదు రోజుల్లో అన్ని బ్యాంకుల అధికారులతో భేటీ అవుతామని హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్డీఎం) భరత్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులు సహకరించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
Published Mon, Sep 16 2013 9:13 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement