ఆదాయ పన్ను ఎగ్గొడితే జైలుకే!
రుణాలు పుట్టవు, గ్యాస్ సబ్సిడీ అందదు
♦ ఆస్తుల క్రయ విక్రయాలకూ చెక్
♦ ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై
♦ కఠిన చర్యలకు ఐటీ శాఖ సన్నద్ధం
♦ ముక్కుపిండి వసూలు చేసే కార్యాచరణ
♦ రిటర్నులు దాఖలు చేయకపోయినా చిక్కులే
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారికి అరదండాలు విధించే దిశగా తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకునేందుకు ఆ శాఖ అస్త్రాలను సిద్ధం చేసింది. ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులకు రుణాలు లభించకుండా, ఆస్తుల క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా చేయనుంది. ఇందుకోసం పాన్ నంబర్‌ను బ్లాక్ చేయడం సహా వారికి వంట గ్యాసు సబ్సిడీ అందకుండా చేయడం వంటి పలు చర్యల ద్వారా వారిని దారికి తేవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పన్ను ఎగవేతదారుల విషయంలో అనుసరించాల్సిన చర్యలతో ఆదాయపన్ను (ఐటీ) శాఖ ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇటీవల జరిగిన ఐటీ అధికారుల వార్షిక సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టారు.
కార్యాచరణ ప్రణాళిక...
దేశంలో ఆదాయపన్ను పరిధిలోకి వచ్చికూడా రిటర్నులు దాఖలు చేయని వారి సంఖ్య 2014లో 22.09లక్షలుగా ఉండగా ఈ సంఖ్య 2015 నాటికి 58.95 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతదారుల పాన్ నంబర్లను రిజిస్ట్రేషన్ల శాఖకు పంపడం ద్వారా సంబంధిత వ్యక్తుల పేరుతో ఎలాంటి ఆస్తుల లావాదేవీలకు అవకాశం లేకుండా చేయాలని కార్యాచరణ ప్రణాళికలో ఐటీ శాఖ ప్రతిపాదించింది. ఎగవేతదారులపై ఓ కన్నేసి ఉంచేందుకు వారి సమాచారాన్ని దేశవ్యాప్తంగా ఐటీ అధికారులందరికీ పంపనుంది. ఎగవేతదారుల నుంచి బకాయిల వసూలు, వారికి సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసేందుకు వీలుగా ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సిబిల్ నుంచి తెలుసుకోవాలని కూడా నిర్ణయించింది.
సీబీడీటీ మార్గదర్శనం
ఉద్దేశపూర్వకంగా ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాలని ఐటీ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సైతం మార్గదర్శనం చేసింది. అరెస్ట్‌లు, నిర్బంధంతోపాటు వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు వెనుకాడవద్దని సూచించింది. ఈ మేరకు సీబీడీటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విధాన పత్రంలో ఆదాయపన్ను అధికారులను ఆదేశించింది.
ఐటీ చట్టంలోని సెక్షన్ 276 సీ(2) ప్రకారం ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు, జరిమానాకూ అవకాశం ఉంది. పన్ను వసూలు అధికారి (టీఆర్‌వో) ఐటీ చట్టంలో ఉన్న ఈ అధికారాలను వినియోగించుకుని పన్నులు రాబట్టాలి. కానీ, ఈ దిశగా చర్యలు తక్కువగా ఉంటున్నాయని, టీఆర్‌వోల వ్యవస్థను మరింత పటిష్టపరిచి, మరిన్ని సౌకర్యాల కల్పనతోపాటు వారికి సిబ్బందిని కేటాయించాలని సీబీడీటీ సూచించింది. కావాలని పన్ను ఎగవేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతోపాటు అవసరమైన కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడానికి కూడా వెనుకాడవద్దని కోరింది. పన్ను ఎగవేతదారుల ఆస్తులను అటాచ్ చేసి వాటిని ఏడాదిలోపు విక్రయించేందుకు వీలుగా టీఆర్‌వోల పనితీరును పర్యవేక్షణ అధికారులు పరిశీలించాలని ఆదేశించింది.
రూ. కోటి బకాయి ఉన్నా, పేర్లు బహిర్గతమే...
ప్రస్తుతం రూ.20కోట్లకు పైగా పన్ను బకాయి పడిన వ్యక్తులు, సంస్థల పేర్లను వెల్లడిస్తూ ఆదాయపన్ను శాఖ జాతీయ దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది. అలాగే, తన వెబ్‌సైట్‌లోనూ ప్రముఖంగా పేర్కొంటోంది. ఇకపై రూ.కోటి ఆ పైన బకాయి ఉన్న వ్యక్తులు, సంస్థల పేర్లను కూడా ఇలానే బహిరంగ పరచాలని నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 271 ఎఫ్ ప్రకారం పన్ను వర్తించే ఆదాయం పొందుతున్న వారు తప్పనిసరిగా గడువులోపు రిటర్నులు దాఖలు చేయాలి.
లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 276సీసీ ప్రకారం ఆదాయ వివరాలతో రిటర్నులు దాఖలు చేయని వారికి ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో రిటర్నులు దాఖలు చేయని ప్రతీ కేసును ప్రత్యేకంగా పరిశీలించి ఈ చట్టాల కింద చర్యలు చేపట్టాలని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఆదాయపన్ను కమిషనర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2,58 లక్షలకు పెరిగినట్టు ప్రణాళిక తెలియజేస్తోంది. వీటిలో ఈఏడాది 1.33 లక్షల కేసులను పరిష్కరించాలన్న లక్ష్యాన్ని విధించారు.