గ్యాస్ సబ్సిడీ కట్ నిర్ణయించడం ఎలా?
♦ 10 లక్షల పన్ను ఆదాయం ఉండే వినియోగదారులు ఎవరు?
♦ వివరాల సేకరణ బాధ్యతను ఎన్‌ఐసీకి అప్పగించాలని కేంద్రం యోచన
సాక్షి, హైదరాబాద్: పన్ను విధించదగ్గ ఆదాయం (టాక్సబుల్ ఇన్‌కమ్) ఏడాదికి రూ. 10 లక్షలకు మించి ఉన్నవారికి వంటగ్యాస్ రాయితీని నిలిపివేయాలని నిర్ణయించిన కేంద్రం.. అధికాదాయ వర్గాల వారిని గుర్తించే బృహత్తర బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ)కు అప్పగించే అవకాశముంది. వంటగ్యాస్ వినియోగదారుల్లో ఆ తరహా ఆదాయం ఉన్నవారు ఎంతమంది ఉన్నారన్న అంచనాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని ఆదాయపు పన్ను విభాగాల నుంచి రూ. 10 లక్షల పన్ను ఆదాయం మించి ఉన్న వారి వివరాలను తీసుకుని, దాన్ని గ్యాస్ వినియోగదారుల డేటాతో సరిపోల్చి రాయితీకి అనర్హమైన వారిని తొలగించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. స్థూల ఆదాయం నుంచి పీఎఫ్, హెచ్ఆర్‌ఏ తదితరాలను తీసేసిన తర్వాత పన్ను విధించదగ్గ ఆదాయం వస్తుంది.
ఈ లెక్కల బాధ్యతను ఎన్‌ఐసీకి కట్టబెడితే ఫలితం ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదాయంతో నిమిత్తం లేకుండా ఎవరైనా 14.2 కిలోల వంటగ్యాస్‌ను రాయితీ ధరపై ఏడాదికి 12 సిలిండర్లు తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పిలుపుతో రాష్ట్రంలో ఇప్పటికే సుమారు లక్ష మంది స్వచ్ఛందంగా రాయితీని వదులుకునేందుకు ముందుకొచ్చారు. ఒక్క హెచ్‌పీ గ్యాస్ కంపెనీ పరిధిలోనే రాయితీ వదులుకున్న వారి సంఖ్య 53,558 ఉండగా, ఇండేన్, భారత్ గ్యాస్ కంపెనీలను కలుపుకుంటే లక్ష వరకు ఉంటుందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పన్ను విధించతగ్గ ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి గ్యాస్ సబ్సిడీ కోత పడనుంది. గతంలో ఒకరి పేరు మీద రెండు మూడు కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్‌ను ఉంచి మిగిలిన వాటిని తొలగించాలని నిర్ణయించినప్పుడు ఆ బాధ్యతను ఎన్‌ఐసీకే అప్పగించారు. ఇప్పుడు కూడా గ్యాస్ కంపెనీల వద్ద వినియోగదారుల ఆధార్ వివరాలే ఉన్నాయి తప్పితే పాన్‌కార్డు వివరాలు లేవు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ బాధ్యతను ఎన్‌ఐసీకి కట్టబెట్టాలని యోచిస్తోంది.