National Informatics Center
-
మొయిత్రా ఢిల్లీలో ఉంటే.. దుబాయ్‌లో ఆమె లాగిన్ ఐడీని వాడారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే పరోక్షంగా మరికొన్ని ఆరోపణలు చేశారు. ఎంపీ మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఎంపీ దుబే శనివారం ‘ఎక్స్’లో‘ ..‘కొంత డబ్బు కోసం ఆమె జాతీయ భద్రతను పణంగా పెట్టారు. ఇదే ఎన్ఐసీని ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, వివిధ కేంద్ర విభాగాలు వాడుతుంటాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్షాలు ఇంకా దీనిపై రాజకీయాలు చేయాలా? దీనిపై ఇక ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’ అని దూబే పేర్కొన్నారు. కానీ, దర్యాప్తు విభాగం పేరును ఆయన పేర్కొనలేదు. అంతేకాకుండా, ఆమె ఎవరి నుంచి లంచం తీసుకున్నారు? వ్యాపారవేత్త దర్శన్ హిరా నందాని తరఫున అదానీ గ్రూప్, ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్‌సభలో ఆమె ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వంటి విషయాలను దుబే వివరించలేదు. ఎంపీ దుబేకి ఎథిక్స్ కమిటీ పిలుపు అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఎంపీ దుబే ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఈ నెల 26న తమ ముందు హాజరై మౌఖిక సాక్ష్యం ఇవ్వాలని దుబేను కోరింది. అదానీ గ్రూప్ గుజరాత్‌లోని తన కంపెనీకి బదులుగా ఒడిశాలోని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన విభాగంలో ఎల్ఎన్జీ నిల్వ చేసుకునేందుకు అనుమతి పొందిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఎంపీ మహువా పార్లమెంటరీ ఐడీని లాగిన్ చేసినట్లు వివరిస్తూ హిరా నందాని స్వయంగా సంతకం చేసిన ఒక సీల్డు కవర్‌ను ఈ కమిటీకి అందజేశారు. ఈ వివరాలు కూడా బయటకు వెల్లడి కావడం గమనార్హం. ఎంపీ మొయిత్రాపై ఆరోపణల విషయంలో సొంత పార్టీ టీఎంసీ మౌనంగా ఉంటోంది. అయినప్పటికీ మొయిత్రా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్‌పైనా, ఎంపీ దుబేపైనా ఆరోపణలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను ఎన్ఐసీ వెల్లడించాలి: మొయిత్రా తను ఢిల్లీలో ఉండగా పార్లమెంటరీ లాగిన్ ఐడీని దుబాయ్‌లో వాడారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన ఆరోపణలపై ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను కూడా ఎన్ఐసీ బహిరంగ పర్చాలని, వారు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకంటే జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరం అదానీ గ్రూపేనని ఆమె ఎదురుదాడికి దిగారు. అదానీ గ్రూప్ కంపెనీ బొగ్గు దిగుమతులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. -
ఎన్ఐసీపై సైబర్ దాడి
న్యూఢిల్లీ: కీలక కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)కు చెందిన కంప్యూటర్లపై మాల్వేర్ దాడి జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎన్ఐసీ ప్రధాన విధుల్లో ప్రభుత్వానికి సంబంధించి సైబర్ రంగంలో మౌలిక వసతుల కల్పన ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ విభాగం ఈ –గవర్నెన్స్‌లో నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ఐసీకి చెందిన దాదాపు 100 కంప్యూటర్లపై ఈ సైబర్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి, ఎన్ఐసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎన్ఐసీ ఉద్యోగి ఒకరికి, తన అధికారిక మెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయడంతో ఆ ఉద్యోగి కంప్యూటర్లోకి మాల్వేర్ చొరబడింది’ అని శుక్రవారం సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో ఆ ఉద్యోగి తన పర్సనల్ ఈ మెయిల్‌ను ఉపయోగించలేకపోయాడని, ఆ తరువాత పలువురు ఇతర ఉద్యోగులకు ఇదే సమస్య ఎదురైందని వివరించారు. అయితే, ఆ మాల్వేర్ దాడి వల్ల ఎలాంటి సమాచార నష్టం జరగలేదని ఎన్ఐసీ తెలిపిందన్నారు. ‘ఎన్ఐసీ ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ తొలి వారంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం. ఆ బగ్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించాం. ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేం’ అని ఆయన వివరించారు. అయితే, బెంగళూరులోని ఒక సంస్థ నుంచి ఆ మాల్వేర్ ఈ మెయిల్ వచ్చినట్లుగా గుర్తించినట్లు తెలిసింది. నిజానికి అమెరికా నుంచి ప్రాక్సీ సర్వర్ ద్వారా ఆ మాల్వేర్ ఈమెయిల్ బెంగళూరులోని ఆ ఐటీ సంస్థకు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైబర్ దాడికి సంబంధించి ఢల్లీ పోలీసు విభాగం అదనపు పీఆర్ఓ అనిల్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ‘గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు తమ కంప్యూటర్లపై దాడికి ప్రయత్నించినట్లు ఎన్ఐసీ గుర్తించింది. సైబర్ ప్రపంచంలో ఇది సాధారణంగా, తరచుగా చోటు చేసుకునే విషయమే. ఈ దాడిని తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా ఎన్ఐసీ గుర్తించి, తదనుగుణంగా సమాచార భద్రతకు చర్యలు తీసుకుంది’ అని మిట్టల్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, దేశ పౌరులు, దేశ భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఎన్ఐసీ కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హ్యాకింగ్ చేసి రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ చీఫ్ సహా అత్యంత ప్రముఖుల డేటాను దొంగలించారని, ఇందులో చైనా సంస్థ హస్తం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్ఐసీ కంప్యూటర్లపై దాడి ఆందోళనకరంగా మారింది. -
మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు ఉందా?
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలున్నాయా?’.. అంటూ మీ మొబైళ్లకు ఫోన్లు వస్తే కంగారు పడకండి. కరోనా మహమ్మారి విస్తరణ, వైరస్ వ్యాప్తిపై వాస్తవ పరిస్థితిని, దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే నడుం బిగించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనంతో పాటు వైరస్ ఏ మేరకు వ్యాపించింది, ప్రస్తుత పరిస్థితిని గురించి స్పష్టమైన అంచనాకు వచ్చేందుకు కేంద్రం ఈ పద్ధతిని ఎంచుకుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారక ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యం (ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్–ఐఎల్ఐ) లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి కరోనా వైరస్ సోకిందా లేదా అని పరీక్షలు నిర్వహించి, ఆ లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌కు పంపించాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత ప రిస్థితుల్లో సువిశాల దేశంలో కరోనా లక్షణాలున్న వారి గుర్తింపు ప్రక్రియ అసంభవంగా మారిన నేపథ్యంలో అతి పెద్ద టెలిఫోనిక్ సర్వే ద్వారా ఈ పనిని పూర్తిచేయాలని నిర్ణయించింది. అయితే తాము జాతీయ స్థాయిలో ఈ టెలి సర్వేను మొదలుపెట్టడానికి ముందే దీనికి సంబం ధించిన అవగాహన, చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. టాస్క్‌ఫోర్స్ సూచనల మేరకు.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా నిర్వహించే ఈ సర్వేకు 1921 టోల్‌ఫ్రీ నంబర్‌ను కేంద్రం ఉపయోగించబోతోంది. ఈ నంబర్ నుంచి దేశంలోని అన్ని ఫోన్లకు కాల్ చేసి దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలపై సమాచారం సేకరిస్తారు. కరోనా లక్షణాలపై ఆరా తీసేందుకు ప్రభుత్వపరంగా సేకరిస్తున్న సమాచారం కాబట్టి.. ఈ సర్వేలో అందరూ పాల్గొని ఈ వైరస్ లక్షణాల వ్యాప్తి, విస్తరణకు సంబంధించి నిర్దిష్టమైన ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వా లని కోరుతోంది. సర్వే నిర్వహణకు సంబంధించి, దీని ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం తాజాగా ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. దేశంలో 90 శాతం కుటుంబాలకు మొబైల్ ఫోన్ల సౌకర్యం అందుబా టులో ఉన్నట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే టెలి సర్వే సందర్భంగా తమకు లేదా కుటుంబసభ్యులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని వెల్లడించిన పక్షం లో వెంటనే వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. నేషనల్ టాస్క్‌ఫోర్స్ సూచనల మేరకు ‘మెగా ఎపిడెమియోలాజికల్ సర్వే’లో భాగంగానే ఈ సర్వేను చేపడు తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఈ టెలి సర్వే ద్వారా ఐఎల్ఐ లక్షణాలు న్న కేసులను దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో వర్గీకరించనున్నారు. ఇలాంటి వాటిలో అనుమానిత కేసులెన్నో గుర్తించి హోంక్వారంటైన్‌కు పరిమితం చేసి, ఆపై వైద్యపరంగా చికిత్స అందించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్ల వినియోగదార్లకు ఫోన్ చేయడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి అనుమానితులతో పాటు ఏ స్ధాయిలో అది విస్తరించిందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే సర్వే ఫలితాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి మొదలయ్యాక కూడా విదేశాల నుంచి వచ్చిన విషయాన్ని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్నా వాటిని పలువురు దాచిపెట్టారని, కాబట్టి టెలి సర్వేలో ఏ మేరకు నిజాలు చెబుతారనేది తెలియదని వారంటున్నారు. -
ఏడాదిలో ఎన్ఐసీ 800 కొలువులు
భువనేశ్వర్: వచ్చే ఏడాది కాలంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) 800 మంది నిపుణులను నియమించుకోనుంది. ఇందులో సైబర్ సెక్యూరిటీ నిపుణులు 355 మంది వరకు ఉంటారని సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా సైబర్ ముప్పు పెరిగిపోవడంతో డేటా భద్రత కీలకంగా మారిపోయిందని పేర్కొంది. ఎన్ఐసీ భువనేశ్వర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్లౌడ్ ఆధారిత నేషనల్ డేటా సెంటర్‌ను ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభిం చారు. ఢిల్లీ, హైదరాబాద్, పుణే తర్వాత భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన నాలుగవ కేంద్రమిది. ఎన్ఐసీ ప్రస్తుతం ప్రభుత్వరంగంలో 10,000 వెబ్సైట్ల నిర్వహణ చూస్తోంది. దేశవ్యాప్తంగా 4,500 మంది పనిచేస్తున్నారు. కంప్యూటింగ్, స్టోరేజీకి డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగిపోయిందని ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ నీతావర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా పాల్గొన్నారు. -
గ్యాస్ సబ్సిడీ కట్ నిర్ణయించడం ఎలా?
♦ 10 లక్షల పన్ను ఆదాయం ఉండే వినియోగదారులు ఎవరు? ♦ వివరాల సేకరణ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగించాలని కేంద్రం యోచన సాక్షి, హైదరాబాద్: పన్ను విధించదగ్గ ఆదాయం (టాక్సబుల్ ఇన్కమ్) ఏడాదికి రూ. 10 లక్షలకు మించి ఉన్నవారికి వంటగ్యాస్ రాయితీని నిలిపివేయాలని నిర్ణయించిన కేంద్రం.. అధికాదాయ వర్గాల వారిని గుర్తించే బృహత్తర బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగించే అవకాశముంది. వంటగ్యాస్ వినియోగదారుల్లో ఆ తరహా ఆదాయం ఉన్నవారు ఎంతమంది ఉన్నారన్న అంచనాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని ఆదాయపు పన్ను విభాగాల నుంచి రూ. 10 లక్షల పన్ను ఆదాయం మించి ఉన్న వారి వివరాలను తీసుకుని, దాన్ని గ్యాస్ వినియోగదారుల డేటాతో సరిపోల్చి రాయితీకి అనర్హమైన వారిని తొలగించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. స్థూల ఆదాయం నుంచి పీఎఫ్, హెచ్ఆర్ఏ తదితరాలను తీసేసిన తర్వాత పన్ను విధించదగ్గ ఆదాయం వస్తుంది. ఈ లెక్కల బాధ్యతను ఎన్ఐసీకి కట్టబెడితే ఫలితం ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదాయంతో నిమిత్తం లేకుండా ఎవరైనా 14.2 కిలోల వంటగ్యాస్‌ను రాయితీ ధరపై ఏడాదికి 12 సిలిండర్లు తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పిలుపుతో రాష్ట్రంలో ఇప్పటికే సుమారు లక్ష మంది స్వచ్ఛందంగా రాయితీని వదులుకునేందుకు ముందుకొచ్చారు. ఒక్క హెచ్‌పీ గ్యాస్ కంపెనీ పరిధిలోనే రాయితీ వదులుకున్న వారి సంఖ్య 53,558 ఉండగా, ఇండేన్, భారత్ గ్యాస్ కంపెనీలను కలుపుకుంటే లక్ష వరకు ఉంటుందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పన్ను విధించతగ్గ ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉన్న వారికి గ్యాస్ సబ్సిడీ కోత పడనుంది. గతంలో ఒకరి పేరు మీద రెండు మూడు కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్‌ను ఉంచి మిగిలిన వాటిని తొలగించాలని నిర్ణయించినప్పుడు ఆ బాధ్యతను ఎన్ఐసీకే అప్పగించారు. ఇప్పుడు కూడా గ్యాస్ కంపెనీల వద్ద వినియోగదారుల ఆధార్ వివరాలే ఉన్నాయి తప్పితే పాన్‌కార్డు వివరాలు లేవు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ బాధ్యతను ఎన్ఐసీకి కట్టబెట్టాలని యోచిస్తోంది.