న్యూఢిల్లీ: కీలక కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)కు చెందిన కంప్యూటర్లపై మాల్‌వేర్ దాడి జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎన్‌ఐసీ ప్రధాన విధుల్లో ప్రభుత్వానికి సంబంధించి సైబర్ రంగంలో మౌలిక వసతుల కల్పన ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ విభాగం ఈ –గవర్నెన్స్‌లో నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది.
ఎన్‌ఐసీకి చెందిన దాదాపు 100 కంప్యూటర్లపై ఈ సైబర్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి, ఎన్‌ఐసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎన్‌ఐసీ ఉద్యోగి ఒకరికి, తన అధికారిక మెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయడంతో ఆ ఉద్యోగి కంప్యూటర్‌లోకి మాల్‌వేర్ చొరబడింది’ అని శుక్రవారం సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో ఆ ఉద్యోగి తన పర్సనల్ ఈ మెయిల్‌ను ఉపయోగించలేకపోయాడని, ఆ తరువాత పలువురు ఇతర ఉద్యోగులకు ఇదే సమస్య ఎదురైందని వివరించారు.
అయితే, ఆ మాల్‌వేర్ దాడి వల్ల ఎలాంటి సమాచార నష్టం జరగలేదని ఎన్‌ఐసీ తెలిపిందన్నారు. ‘ఎన్‌ఐసీ ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ తొలి వారంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం. ఆ బగ్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించాం. ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేం’ అని ఆయన వివరించారు. అయితే, బెంగళూరులోని ఒక సంస్థ నుంచి ఆ మాల్‌వేర్ ఈ మెయిల్ వచ్చినట్లుగా గుర్తించినట్లు తెలిసింది. నిజానికి అమెరికా నుంచి ప్రాక్సీ సర్వర్ ద్వారా ఆ మాల్‌వేర్ ఈమెయిల్ బెంగళూరులోని ఆ ఐటీ సంస్థకు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైబర్ దాడికి సంబంధించి ఢల్లీ పోలీసు విభాగం అదనపు పీఆర్‌ఓ అనిల్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ‘గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు తమ కంప్యూటర్లపై దాడికి ప్రయత్నించినట్లు ఎన్‌ఐసీ గుర్తించింది. సైబర్ ప్రపంచంలో ఇది సాధారణంగా, తరచుగా చోటు చేసుకునే విషయమే. ఈ దాడిని తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా ఎన్‌ఐసీ గుర్తించి, తదనుగుణంగా సమాచార భద్రతకు చర్యలు తీసుకుంది’ అని మిట్టల్ పేర్కొన్నారు.
ముందు జాగ్రత్త చర్యగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, దేశ పౌరులు, దేశ భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఎన్‌ఐసీ కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హ్యాకింగ్ చేసి రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ చీఫ్ సహా అత్యంత ప్రముఖుల డేటాను దొంగలించారని, ఇందులో చైనా సంస్థ హస్తం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్‌ఐసీ కంప్యూటర్లపై దాడి ఆందోళనకరంగా మారింది.
ఎన్‌ఐసీపై సైబర్ దాడి
Published Sat, Sep 19 2020 4:57 AM | Last Updated on Sat, Sep 19 2020 5:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment