న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ మాల్‌వేర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా, కెనడాలను కూడా దాటేసింది. జీస్కేలర్ థ్రెట్‌ల్యాబ్జ్ రూపొందించిన ’మొబైల్, ఐవోటీ, ఓటీ థ్రెట్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
2023 జూన్ నుంచి 2024 మే వరకు 2000 కోట్ల పైచిలుకు మాల్వేర్ ముప్పు సంబంధిత మొబైల్ లావాదేవీలు, ఇతరత్రా సైబర్ ముప్పుల గణాంకాలను విశ్లేషించిన మీదట ఈ రిపోర్ట్ రూపొందింది. ‘అంతర్జాతీయంగా మొబైల్ మాల్‌వేర్ దాడుల విషయంలో భారత్ టాప్ టార్గెట్‌గా మారింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత్ ఈసారి మొదటి స్థానానికి చేరింది. ఇలాంటి మొత్తం అటాక్స్‌లో 28 శాతం దాడులు భారత్ లక్ష్యంగా జరిగాయి. అమెరికా (27.3 శాతం), కెనడా (15.9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డిజిటల్ పరివర్తన వేగవంతమవుతుండటం, సైబర్ ముప్పులు పెరుగుతుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత సంస్థలు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోంది‘ అని నివేదిక వివరించింది.
గూగుల్ ప్లే స్టోర్‌లో 200 పైచిలుకు హానికారక యాప్స్‌ను గుర్తించినట్లు, ఐవోటీ మాల్‌వేర్ లావాదేవీలు వార్షికంగా 45 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇది సైబర్ దాడుల ముప్పు తీవ్రతను తెలియజేస్తుందని వివరించింది. అత్యధికంగా సైబర్ దాడులకు గురవుతున్నప్పటికీ.. మాల్‌వేర్ ఆరిజిన్ పాయింట్ (ప్రారంభ స్థానం) విషయంలో మాత్రం భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరింది.
రిపోర్టులోని మరిన్ని విశేషాలు..
మొబైల్ అటాక్స్‌లో సగభాగం ట్రోజన్ల రూపంలో (హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, రన్ చేసేలా ప్రేరేపించే మోసపూరిత మాల్ వేర్) ఉంటున్నాయి. ఆర్థిక రంగంలో ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ మాల్‌వేర్ దాడులు 29% పెరగ్గా, మొబైల్ స్పైవేర్ దాడులు ఏకంగా 111% ఎగిశాయి.
ఆర్థికంగా మోసగించే లక్ష్యంతో చేసే మాల్‌వేర్ దాడులు, మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌లాంటి (ఎంఎఫ్‌ఏ) వివిధ అంచెల భద్రతా వలయాలను కూడా ఛేదించే విధంగా ఉంటున్నాయి. వివిధ ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా సైట్లు, క్రిప్టో వాలెట్లకు సంబంధించి ఫేక్ లాగిన్ పేజీలను సృష్టించి సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి దిగ్గజ భారతీయ బ్యాంకుల మొబైల్ కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. అచ్చం సిసలైన బ్యాంకింగ్ వెబ్‌సైట్లను పోలి ఉండే ఫేక్ సైట్లలో.. బ్యాంకుల కస్టమర్లు కీలక వివరాలను పొందుపర్చేలా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తూ, మోసగిస్తున్నారు. గతంలోనూ నకిలీ కార్డ్ అప్‌డేట్ సైట్ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత ఫిషింగ్ మాల్‌వేర్‌ను జొప్పించేందుకు ఇలాంటి మోసాలే జరిగాయి.
పోస్టల్ సర్వీసులను కూడా సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. యూజర్‌కు రావాల్సిన ప్యాకేజీ మిస్సయ్యిందనో లేక డెలివరీ అడ్రెస్ సరిగ్గా లేదనో ఎస్‌ఎంఎస్‌లు పంపడం ద్వారా వారిని కంగారుపెట్టి, తక్షణం స్పందించాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఫేక్ సైట్ల లింకులను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపించి మోసాలకు పాల్పడుతున్నారు.
అంతగా రక్షణ లేని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ (ఐవోటీ/ఓటీ) మొదలైనవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన టార్గెట్‌గా ఉంటున్నాయి. కాబట్టి భారతీయ సంస్థలు సురక్షితంగా కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment