న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే పరోక్షంగా మరికొన్ని ఆరోపణలు చేశారు. ఎంపీ మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఎంపీ దుబే శనివారం ‘ఎక్స్’లో‘ ..‘కొంత డబ్బు కోసం ఆమె జాతీయ భద్రతను పణంగా పెట్టారు.
ఇదే ఎన్‌ఐసీని ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, వివిధ కేంద్ర విభాగాలు వాడుతుంటాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్షాలు ఇంకా దీనిపై రాజకీయాలు చేయాలా? దీనిపై ఇక ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’ అని దూబే పేర్కొన్నారు. కానీ, దర్యాప్తు విభాగం పేరును ఆయన పేర్కొనలేదు. అంతేకాకుండా, ఆమె ఎవరి నుంచి లంచం తీసుకున్నారు? వ్యాపారవేత్త దర్శన్ హిరా నందాని తరఫున అదానీ గ్రూప్, ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్‌సభలో ఆమె ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వంటి విషయాలను దుబే వివరించలేదు.
ఎంపీ దుబేకి ఎథిక్స్ కమిటీ పిలుపు
అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఎంపీ దుబే ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఈ నెల 26న తమ ముందు హాజరై మౌఖిక సాక్ష్యం ఇవ్వాలని దుబేను కోరింది.
అదానీ గ్రూప్ గుజరాత్‌లోని తన కంపెనీకి బదులుగా ఒడిశాలోని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన విభాగంలో ఎల్‌ఎన్‌జీ నిల్వ చేసుకునేందుకు అనుమతి పొందిన అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు ఎంపీ మహువా పార్లమెంటరీ ఐడీని లాగిన్ చేసినట్లు వివరిస్తూ హిరా నందాని స్వయంగా సంతకం చేసిన ఒక సీల్డు కవర్‌ను ఈ కమిటీకి అందజేశారు. ఈ వివరాలు కూడా బయటకు వెల్లడి కావడం గమనార్హం. ఎంపీ మొయిత్రాపై ఆరోపణల విషయంలో సొంత పార్టీ టీఎంసీ మౌనంగా ఉంటోంది. అయినప్పటికీ మొయిత్రా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్‌పైనా, ఎంపీ దుబేపైనా ఆరోపణలు ఎక్కుపెడుతూనే ఉన్నారు.
ఎంపీలందరి లాగిన్ వివరాలను
ఎన్‌ఐసీ వెల్లడించాలి: మొయిత్రా
తను ఢిల్లీలో ఉండగా పార్లమెంటరీ లాగిన్ ఐడీని దుబాయ్‌లో వాడారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన ఆరోపణలపై ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను కూడా ఎన్‌ఐసీ బహిరంగ పర్చాలని, వారు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకంటే జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరం అదానీ గ్రూపేనని ఆమె ఎదురుదాడికి దిగారు. అదానీ గ్రూప్ కంపెనీ బొగ్గు దిగుమతులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment