తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన లోక్‌సభ లాగిన్ ఐడీ వివరాలు వ్యాపారవేత్త, హీరానందాని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు ఆమె ఆంగీకరించారు. అయితే అతని నుంచి కేవలం చిన్న చిన్న గిఫ్ట్‌లే అందుకున్నట్లు చెప్పారు. హిరానందని గ్రూప్ సీఈవో నుంచి స్కార్ఫ్, కొన్ని లిప్‌స్టిక్‌లు, ఐషాడో వంటి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటులో తాను అడగాల్సిన ప్రశ్నలను పోస్ట్ చేసేందుకు తన లోక్‌సభ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించేందుకు స్నిహితుడైన దర్శన్ హీరానందానికి అనుమతి ఇచ్చినట్లు ఆమె అంగీకరించారు. అయితే హీరానందని నుంచి డబ్బుల రూపంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలను మహువా ఖండించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్తను ప్రశ్నించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇతరులకు కూడా వివరాలు ఇచ్చా!
లోక్‌సభ లాగిన్ వివరాలు ఇచ్చినట్లు అంగీకరించిన మహువా.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుందని, తన ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్‌సైట్లను నిర్వహించే ఎన్‌ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని తెలిపారు..
ముంబైలో ఉన్నప్పుడు హీరానందానీ కారు వాడాను
వ్యాపారవేత్త అయిన హీరానందాని తన స్నేహితుడని, అతని నుంచి పుట్టినరోజు కానుకగా స్కార్ఫ్, లిప్‌స్టిక్‌లు, బాబీ బ్రౌన్ నుంచి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు మొయిత్రా పేర్కొన్నారు. తన కోసం దుబాయ్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్ నుంచి మేకప్ వస్తువులు తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. తన ఇంటి ఇంటీరియర్‌లను మార్చడం కోసం తాను అతనిని సంప్రదించానని, అతను ఆమెకు కొత్త ఆర్కిటెక్చరల్ ప్లాన్‌లు, డ్రాయింగ్‌లను అందించాడని, అయితే ఖర్చులను ప్రభుత్వం పరిధిలోకి వచ్చే సీపీడబ్ల్యూడీ చేపట్టిందని ఆమె చెప్పారు. అలాగే తాను ముంబయిలో ఉన్నప్పుడల్లా హీరానందానీ స్నేహితుడైనందున అతని కారును ఉపయోగించేదానినని కూడా చెప్పింది.
రూ. 2 కోట్ల ప్రస్తావన లేదు
దర్శన్ హీరానందని తనకు ఇంకా ఏమైనా ఇచ్చి ఉంటే వెంటనే వచ్చి చెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆరోపణ చేస్తారని, కానీ ఆ ఆరోపణలను నిరూపించే బాధ్యత వారిపై ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. అఫిడవిట్‌లో తనకు 2 కోట్ల నగదు ఇచ్చిన ప్రస్తావన లేదని, ఒకవేళ ఇచ్చినట్లయితే.. దయచేసి ఎప్పుడు ఇచ్చారో తేదీ చెప్పాలని, అన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలని కోరారు.
సొమ్ములు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ను,లక్ష్యంగా చేసుకొని ప్రశ్నించినవేనని లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వీటికి తోడు మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని నిషికాంత్ దూబే మరో ఆరోపణలు చేయడం దుమారం చెలరేపింది.
ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31న తమ ముందు విచారణకు హాజరు కావాలని మహువాను కమిటీ తెలిపింది. అయితే తన నియోజకవర్గం కృష్ణానగర్‌లో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల వల్ల మరికొంత సమయం కావాలని ఎంపీ కోరగా.. ఆమె హాజరుకావాల్సిన తేదీ నవంబర్ రెండుకు మారింది. కొత్త తేదీ ఇచ్చిన ఎథిక్స్ కమిటీ.. ఇంతకు మించి పొడిగింపు ఉండదని వెల్లడించింది.
ఇక ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ నైతిక వ్యవహారాల కమిటీ ముందు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. అదే విధంగా మహువాకు వ్యతిరేకంగాపలు సాక్ష్యాలను సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment